షాకింగ్ న్యూస్: టీమిండియా నుంచి ‘నయావాల్’ ఔట్?
దిశ, స్పోర్ట్స్: ఆ బ్యాట్‌మెన్ క్రీజులో ఉంటే టీమిండియా క్రీడాభిమానులు గుండెల మీద చెయ్యేసుకొని పడుకుంటారు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లు చెమటలు కక్కేలా కష్టపడతారు. పరుగులు రాకున్నా అతడు అక్కడ నిలబడి ఉంటే కొండంత భరోసా.. రాహుల్ ద్రవిడ్ తర్వాత అంతటి నమ్మకాన్ని ఇచ్చిన క్రికెటర్.. అతడే చతేశ్వర్ పుజారా. కెప్టెన్, వైస్ కెప్టెన్లను పక్కన పెట్టి టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందో అంచనా వేయండ కష్టం కానీ.. […]
దిశ, స్పోర్ట్స్: ఆ బ్యాట్‌మెన్ క్రీజులో ఉంటే టీమిండియా క్రీడాభిమానులు గుండెల మీద చెయ్యేసుకొని పడుకుంటారు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లు చెమటలు కక్కేలా కష్టపడతారు. పరుగులు రాకున్నా అతడు అక్కడ నిలబడి ఉంటే కొండంత భరోసా.. రాహుల్ ద్రవిడ్ తర్వాత అంతటి నమ్మకాన్ని ఇచ్చిన క్రికెటర్.. అతడే చతేశ్వర్ పుజారా. కెప్టెన్, వైస్ కెప్టెన్లను పక్కన పెట్టి టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందో అంచనా వేయండ కష్టం కానీ.. టెస్టు క్రికెట్‌లో ఎవరు ఉంటారంటే అందరూ పుజారా పేరే మొదటగా చెబుతారు. ఓపెనర్లు విఫలం అయినా.. మిడిలార్డర్‌ను రక్షించాలన్నా.. మధ్యలో పుజారా ఒక గోడలాగా అడ్డంపడి ఉండాల్సిందే. ద్రవిడ్ రిటైర్ అయ్యాక ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా? అని అందరూ ఎదురు చూడగా.. గుజరాత్ నుంచి వచ్చిన పుజారా దానికి సంపూర్ణ న్యాయం చేశాడు. కేవలం టెస్టులు ఆడుతున్న పుజారాకు తక్కువ జీతం ఎందుకని ఒకానొక సమయంలో బీసీసీఐ కూడా అతడిని అందరితో సమానంగా ప్రమోషన్ ఇచ్చి జీతం పెంచింది. అలాంటి పుజారా ఇప్పుడు జట్టులో ఉండటం అవసరమా అని ఏకంగా టీమ్ ఇండియా మేనేజ్‌మెంటే ఆలోచించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
పుజారా పేలవ ప్రదర్శన..
టీమ్ ఇండియా టెస్టు గెలుపుల్లో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించిన చతేశ్వర్ పుజారా రికార్డులను గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా పరిశీలిస్తే చాలా పేలవంగా ఉన్నాయి. చివరగా పుజారా 2019 ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ సాధించాడు. అది తప్ప 30 ఇన్నింగ్స్‌లుగా ఒక్క సెంచరీ కూడా లేకపోగా.. 10 సార్లు పది పరుగులకు ముందే అవుటైన చెత్త రికార్డు నమోదు చేశాడు. మరోవైపు ఏడాదిన్నరగా పుజారా సగటు 26.35 మాత్రమే. పుజారా ఒక డిఫెండింగ్ బ్యాట్స్‌మాన్ అని టీమ్ ఇండియా యాజమాన్యం కూడా భావించే అతనికి తుది జట్టులో చోటు కల్పిస్తున్నది. కానీ అతడు టెస్టుల్లో కూడా అత్యంత దారుణమైన స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం.. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయకపోవడం వల్ల తర్వాత బ్యాట్స్‌మెన్‌పై చాలా భారం పడుతున్నది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పుజారా ఇలా ఇబ్బంది పెట్టినా పంత్ సమయోచితంగా బ్యాటింగ్ చేయడం వల్లే భారత జట్టు గెలవడమో కనీసం డ్రాగా ముగించడమో చేసిందని దిగ్గజ క్రికెటర్లు కూడా వ్యాఖ్యానించారు. భారత జట్టు ఆడిన కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో పుజారా కూడా అత్యంత పేలవంగా అవుటవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అతడిని పక్కన పెట్టి కొత్తగా బ్యాటింగ్ లైనప్ రూపొందించే పనిలో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ పడింది.
నెంబర్ 3లో ఎవరు?
పరిమిత ఓవర్ల క్రికెట్‌ను పక్కన పెడితే టెస్టు క్రికెట్‌లో టీమ్ ఇండియా నెంబర్ త్రీ బ్యాట్స్‌మాన్ అంటే చతేశ్వర్ పుజారా అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అతడిని తప్పిస్తే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెంబర్ త్రీ స్థానంలో కేఎల్ రాహుల్ లేదా హనుమ విహారిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అగస్టు 4 నుంచి టీమ్ ఇండియా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ప్రారంభం కాన్నున్నది. ఆ మ్యాచ్ నుంచి పుజారాను తప్పించి రాహుల్ లేదా విహారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది. అలా కాకపోతే మూడో నెంబర్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీని పంపి నాలుగో నెంబర్‌లో విహారీకి ఛాన్స్ ఇవ్వాలని కూడా టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి అనంతరం భారత టెస్టు జట్టులో మార్పుల అవసరం అని కోహ్లీ మీడియా ముందే వ్యాఖ్యానించాడు. త్వరలో జరగబోయే టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా తుది జట్టులో మార్పు జరుగుతుందని కోహ్లీ తేల్చి చెప్పాడు. సినియర్ కోటాలో తమ స్థానాలను కాపాడుకుంటున్న కొంత మందిని పక్కకు పెట్టి విహారి, సిరాజ్, మయాంక్ వంటి క్రికెటర్లను తుది జట్టులోకి తీసుకొని వచ్చే అవకాశం ఉన్నది.