రైస్బౌల్ ఆఫ్ తెలంగాణ.. ఆ విషయం చెప్పడానికి గర్విస్తున్నా: కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: గత ఏడాది ధాన్యం కొనుగోళ్ళలో దేశంలోనే రెండవ స్థానంలో ఉన్న తెలంగాణ.. నేడు నెంబర్ వన్ దిశగా అడుగులు వేస్తోందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఏడాది యాసంగిలో భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 56 శాతం మన రాష్ట్రమే అందించగలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, గిట్టుబాటు ధరకు రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం సేకరిస్తోందని సీఎం తెలిపారు. ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో తెలంగాణ […]
దిశ, తెలంగాణ బ్యూరో: గత ఏడాది ధాన్యం కొనుగోళ్ళలో దేశంలోనే రెండవ స్థానంలో ఉన్న తెలంగాణ.. నేడు నెంబర్ వన్ దిశగా అడుగులు వేస్తోందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఏడాది యాసంగిలో భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 56 శాతం మన రాష్ట్రమే అందించగలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, గిట్టుబాటు ధరకు రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం సేకరిస్తోందని సీఎం తెలిపారు. ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని ప్రగతిని సాధించిందని, 2013-14 లో తెలంగాణలో దాదాపు 49 లక్షల ఎకరాల్లో వరిపంట సాగయితే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోటి ఆరు లక్షల ఎకరాల్లో వరిపంట సాగయిందన్నారు. 60.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగయిందని, 31 లక్షల 60 వేల బేళ్లపత్తి ఉత్పత్తి అయిందని, పత్తి సాగులో తెలంగాణా దేశంలో మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానంలో నిలిచిందని, దేశంలో తెలంగాణా పత్తికి చాలా నాణ్యమైనదనే పేరుంది కనుక మార్కెట్‌లో ఎంతో డిమాండ్ ఉండటం గమనార్హమని కేసీఆర్ అన్నారు.
స్వాతంత్య్ర పోరాట ఉజ్వల ఘట్టాలను దేశం స్మరించుకుంటోందన్నారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపుగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు ఇప్పుడు లేవని, నల్గొండలో 4వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. స్వాతంత్ర్య ఫలాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశం అనేక రంగాల్లో పురోగతి సాధించిందన్నారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని, అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ ఏర్పడిన నాడు 2013-2014 ఆర్ధిక సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 1 లక్షా 12 వేల 126 రూపాయలు ఉండగా, నేడు తెలంగాణా రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 37 వేల 632 రూపాయలకు చేరుకుందన్నారు. నేడు మన దేశ తలసరి ఆదాయం 1 లక్షా 28 వేల 829 రూపాయలుగా నమోదైందని, దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణా రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో పదికి మించి పార్లమెంట్ స్థానాలున్నపెద్ద రాష్ట్రాలతో పోలిస్తే.. తలసరి ఆదాయంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పడానికి గర్విస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.