అంగిలి ఎండినా గొంతు తడవదు

దిశ, ఏపీ బ్యూరో: “ఆళ్ల పరిస్థితి మరీ దయనీయమండె. పాపమాళ్ల పంటల్ని కలుపుమందోసి సంపేశారండె! ఇళ్లు తగలెట్టేశారండె. ఫారెస్టోళ్లు అన్నీ ఇన్నీ చెయ్యలేదండె. ఆయాల భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యగారుండి ఆళ్లకండగా నిలవబట్టి సరిపోనాదండె. ఫారెస్టోళ్ల మీద కేసులెట్టి ఆళ్లకి న్యాయం చేయాలని.. ఓ పెద్దెత్తున ఆందోళన జరిగింది సార్. ఆళ్లకి రేషన్కార్డు, ఆధార్, ఓటక్కు ఈడ్నే ఉన్నాయండె! ఎందుకో గవరమెంటాళ్లని పట్టిచ్చుకోట్లేదు సార్!” తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్గిరిజన సంఘ నేత తెడ్ల అబ్యాయి […]

Update: 2020-10-19 10:16 GMT

దిశ, ఏపీ బ్యూరో: “ఆళ్ల పరిస్థితి మరీ దయనీయమండె. పాపమాళ్ల పంటల్ని కలుపుమందోసి సంపేశారండె! ఇళ్లు తగలెట్టేశారండె. ఫారెస్టోళ్లు అన్నీ ఇన్నీ చెయ్యలేదండె. ఆయాల భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యగారుండి ఆళ్లకండగా నిలవబట్టి సరిపోనాదండె. ఫారెస్టోళ్ల మీద కేసులెట్టి ఆళ్లకి న్యాయం చేయాలని.. ఓ పెద్దెత్తున ఆందోళన జరిగింది సార్. ఆళ్లకి రేషన్కార్డు, ఆధార్, ఓటక్కు ఈడ్నే ఉన్నాయండె! ఎందుకో గవరమెంటాళ్లని పట్టిచ్చుకోట్లేదు సార్!” తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్గిరిజన సంఘ నేత తెడ్ల అబ్యాయి ఆవేదన ఇది. సుమారు ఆర్నెల్ల కిందట చింతూరు ప్రాంతంలో చోటు చేసుకున్న ఉదంతమిది.

రాష్ట్ర విభజనకు ముందు ఒడిస్సాలోని కోరాపుట్ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్వాసితులు అందులో కొందరున్నారు. చత్తీస్ఘడ్లో మావోయిస్టులు, పోలీసుల మధ్య బతకలేక వలసొచ్చినోళ్లు ఇంకొందరున్నారు. దాదాపు 2005 నుంచి ఆదివాసీల వలస ప్రారంభమైంది. అప్పట్లో ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లోని చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం, కుకునూరు, వేలేరుపాడు భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల్లో అటవీ ప్రాంతాలకు చేరారు. గోదావరి తీరంలో 203 ఆవాసాలను ఏర్పాటు చేసుకొని తల దాచుకున్నారు. నాటి వాళ్ల జనాభా16,024 మంది. విభజన తర్వాత ఈ మండలాలను ఏపీలో విలీనం చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కుకునూరు, వేలేర్పాడు, తూర్పు గోదావరి జిల్లాలోని చింతూరు, వీఆర్పురం, కూనవరం మండలాల్లో చస్తూ బతుకుతూ జీవిస్తున్నారు. ఇలా వలసొచ్చిన ఆదివాసీలను కోండులు, కోయిలంటారు. ప్రస్తుతం వీళ్ల జనాభా 20 వేలుంటుందని అంచనా.

వలస ఆదివాసీలంతా అడవిలోని చెట్లను నరికి పోడు వ్యవసాయం చేస్తారు. అది వారి జీవన శైలి. వలస వచ్చిన ఆదివాసీలను అడవి నుంచి తరిమెయ్యాలని అటవీశాఖ అనేక ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వ పథకమేదీ వాళ్లకు అందనివ్వలేదు. వాళ్ల పంటలపై కలుపు మందులు పోసి తగలబెట్టారు. కేసులు పెట్టి జైళ్లలో వేశారు. చివరకు వాళ్ల నివాసాలను తగలబెట్టారు. అయినా ప్రాణభయంతో పారిపోలేదు. బతకడం కోసం యుద్ధానికే దిగారు. అటవీశాఖపై న్యాయ పోరాటం చేశారు. కన్నతల్లిలాంటి అడవిని విడిచి బయటకు రాలేమన్నారు. అడవిని నమ్ముకొని జీవిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోకున్నా.. మా బతుకులు మేం బతుకుతామని మొండిగా నిలిచారు. బతుకుపోరులో సతమతమవుతూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ఆదివాసీలకు రాష్ట్ర ప్రజల్లాగే అన్ని హక్కులూ కల్పించాలని నాడు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవు. వలస ఆదివాసీ గుంపుల్లో కొందరికి మాత్రమే రేషన్ కార్డులందాయి. గత ప్రభుత్వం వీళ్లను గాలికొదిలేసింది. ఆదివాసీలు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరానున్నారు. సరైన రహదారుల్లేవు. ఈ గ్రామాలకు వెళ్లాలంటే కాలిబాటలే శరణ్యం. ఆర్టీసీ బస్సు ఎలా ఉంటుందో తెలీదు. వర్షాలు పడితే వాళ్ల జీవనం ఛిద్రమవుతుంది. మొకాల్లోతు బురదలో నడవాలి. ప్రభుత్వ పథకాలు ఏవీ వీళ్ల దరి చేరడం లేదు. తాగునీరు, విద్యుత్, ఉపాధి, రేషన్ కార్డులు, విద్యా వైద్యం ఏదీ అందదు. రేషన్ కార్డులున్నా నిత్యావసరాలు అందవు. ఇప్పటికీ చెలమ నీరే గతి. అడవి జంతువులు, గేదెలు చెలమలను తొక్కేసి నాశనం చేస్తాయి. వాటిని కాపాడుకునేందుకు చెలమల చుట్టూ కంచె వేసుకునేది. వీళ్లను అడవి నుంచి తరిమేసేందుకు అటవీ శాఖ వాళ్లు చెలమలను ధ్వంసం చేసేది. నీటి కోసం అవస్థలు పడుతున్నా వాళ్లు అడవిని వదల్లేదు. జ్వరమొస్తే ఆకు పసర్లు, మంత్రాలే దిక్కు. ఆదివాసీ పిల్లలు పౌష్టికాహారం అందక బాల్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. వింత రోగాలు, విష జ్వరాలతో నిత్య పోరాటం వాళ్లది. ఆదివాసీ తెగల సంప్రదాయ జీవన శైలిలోనే మెరుగులు దిద్దేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.

మన లెక్కలో వాళ్లు ఎస్టీలు కాదు : రమణ, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి

వాళ్లు చత్తీస్ గడ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి వలస వచ్చారు. ఇక్కడ వాళ్లను గుత్తి కోయలుగా ప్రభుత్వం గుర్తించింది. గుత్తి కోయలు ఎస్టీలు కాదు. అందువల్ల వాళ్లకు గిరిజనులకు అందే పథకాలేవీ వర్తించవు. కాకుంటే మానవతా ధృక్పథంతో వాళ్లకు రేషన్కార్డు, మంచినీళ్ల సదుపాయంతోపాటు ఇతర పథకాలు వీలున్నమేరకు అందిస్తున్నాం. అడవిలో చెట్లు నరకొద్దని చెబుతున్నాం. ఫారెస్టు డిపార్టుమెంటుకు, వాళ్లకీ ఏవైనా గొడవలు తలెత్తితే పరిష్కరిస్తున్నాం. ఆర్నెల్ల కిందట జరిగిన గొడవ తెలంగాణ పరిధిలోకి వస్తుంది. ఇక్కడా అక్కడక్కడా చిన్నచిన్న గొడవలు తలెత్తితే అధికారులు వాటిని సర్దుబాటు చేస్తున్నారు.

Tags:    

Similar News