కరోనా వేళ.. ఫీజుల గోల !

దిశ, హైదరాబాద్ : కరోనా వైరస్ మానవాళిని అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడెక్కడ చూసినా లాక్‌డౌన్ నుంచి ఇంకెప్పుడు బయటపడతామనే ముచ్చట్లే.. వినిపిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో 20 శాతం సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారు. ప్రయివేటు ఉద్యోగులంతా విధులకు దూరమై, ఇండ్లకే పరిమితం అయ్యారు. ప్రయివేటు సంస్థలకు ప్రభుత్వం చేసిన రిక్వెస్టో.. నెలలో 20 రోజులు డ్యూటీ చేయడం వల్లనో.. కారణం ఏదైనా మార్చి నెల వేతనాలు ప్రయివేటు ఉద్యోగులకు అందాయి. ప్రస్తుతం లాక్‌‌డౌన్ ఏప్రిల్ నెలంతా కొనసాగుతోంది. […]

Update: 2020-04-20 00:26 GMT

దిశ, హైదరాబాద్ : కరోనా వైరస్ మానవాళిని అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడెక్కడ చూసినా లాక్‌డౌన్ నుంచి ఇంకెప్పుడు బయటపడతామనే ముచ్చట్లే.. వినిపిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో 20 శాతం సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారు. ప్రయివేటు ఉద్యోగులంతా విధులకు దూరమై, ఇండ్లకే పరిమితం అయ్యారు. ప్రయివేటు సంస్థలకు ప్రభుత్వం చేసిన రిక్వెస్టో.. నెలలో 20 రోజులు డ్యూటీ చేయడం వల్లనో.. కారణం ఏదైనా మార్చి నెల వేతనాలు ప్రయివేటు ఉద్యోగులకు అందాయి. ప్రస్తుతం లాక్‌‌డౌన్ ఏప్రిల్ నెలంతా కొనసాగుతోంది. ఏ సంస్థలోనూ కార్యకలాపాలు కొనసాగకపోవడంతో.. వాటికి నయా పైసా ఆదాయం వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటిదకా మార్చి నెల వేతనాలతోనే ఎలాగోలా సర్ధుకున్న కుటుంబాలు.. మే ఒకటో తేదీ నుంచి ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోనున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రయివేటు విద్యా సంస్థలు ఫీజుల కోసం తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి చేస్తుండటం వారిని కలవరపెడుతోంది.

కరోనాలోనూ గుదిబండ..

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కిరాణం, మెడికల్ మినహా ఇతర లావాదేవీలు కొనసాగడం లేదు. ఇంటి అద్దెలకు ఇబ్బంది పెట్టవద్దని అద్దె ఇంటి యజమానులకు సూచించింది.కుటుంబ పోషణ సైతం భారంగా మారిన ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ప్రయివేటు విద్యాలయాలు వ్యాపార ధోరణిని వీడటం లేదు. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. యూనిఫాం తప్పనిసరి చేస్తున్నాయి. అంతేకాదు, బకాయి ఫీజులు రెండ్రోజుల్లో చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. ఓ పాఠశాలకు చెందిన సిబ్బంది రెండ్రోజుల్లో ఫీజు చెల్లించాలని ఒక విద్యార్థి తండ్రితో మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, నగరంలోని మరో విద్యా సంస్థ ఏకంగా పేరెంట్స్‌కు లెటర్స్ పంపడంతో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను మెసేజ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం లేక, జీతం వస్తదో.. రాదో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనూ ఈ ఫీజుల భారాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.

ఉద్యోగాలకే గ్యారంటీ లేదు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్ అమల్లో ఉండగా.. దీని తర్వాత వ్యవస్థల మనుగడ తలకిందులయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రభావంతో ఆయా కంపెనీలు, సంస్థల్లో చాలా ఉద్యోగాలు తగ్గే వీలుంది. కొత్త అవకాశాలకు ఛాన్సే ఉండకపోవచ్చు. ఏదేమైనా.. ప్రభుత్వం ప్రజలను ఆదుకునేందుకు కొంత ఉపశమన చర్యలు చేపడుతోంది. ఆన్‌లైన్, డిజిటల్ వర్క్ ఫ్రేమ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఉన్న ఉద్యోగాలకే గ్యారంటీ లేనట్టుగా భావించాల్సి వస్తోంది. వాస్తవానికి పదో తరగతి వార్షిక పరీక్షలే వాయిదా పడ్డాయి. మరోవైపు కుటుంబ నిర్వహణే అతికష్టంగా మారింది. పరిస్థితులు కడు దయనీయంగా ఉన్నాయి. ఈ తరుణంలో ఫీజుల కోసం ప్రయివేటు విద్యాలయాలు చేస్తున్న జులం ఎంత వరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఫీజులు మాఫీ చేయాలి : వెంకట్ సాయినాథ్, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్

కరోనా ప్రభావంతో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయ్యాయి. మేం చేసే ఉద్యోగాలు ఉంటాయో.. ఊడతాయో గ్యారంటీ లేదు. దేశమంతా లాక్‌డౌన్ నడుస్తున్న సంగతి తెలుసు కదా. ఈ పరిస్థితిలో ప్రయివేటు విద్యా సంస్థలు.. ఫీజుల గురించి మాట్లాడటం దుర్మార్గం. ఫీజులను వసూలు చేసుకునేందుకే విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు పెడుతున్నారు. కర్నాటక, ఒరిస్సా, ఢిల్లీ తరహాలో మంత్లీ పద్ధతిలో ఫీజుల చెల్లింపునకు మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అవసరమైతే మొత్తం ఫీజులను మాఫీ చేయాలి. ఉద్యోగాలు తగ్గించొద్దని ఐటీ కంపెనీలకు మంత్రి కేటీఆర్ లేఖలు రాసినట్టు.. ఫీజుల వ్యవహారంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. మా పరిస్థితులు బాగుంటే భవిష్యత్తులో మేమే ఫీజులు చెల్లిస్తాం. అంతవరకు ఫీజులు చెల్లించం. ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెంటనే స్పందించాలి. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రయివేటు విద్యా సంస్థలకు తగు మార్గదర్శకాలు విడుదల చేయాలి.

Tags : Corona effect, school fee harrasment, HSPA, KTR, KCR, Private schools

Tags:    

Similar News