పీఆర్సీపై చర్చలు.. సీఎం మీదనే ఆశలు
దిశ, తెలంగాణ బ్యూరో: వేతన సవరణ కమిషన్ నివేదిక వివాదాస్పదమవుతోంది. అధికారికంగా వెల్లడించకుండానే రిపోర్టు బయటకు ఎలా లీక్ అయ్యిందనే అంశంపై చర్చ సాగుతుండగానే, ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించి ఉద్యోగులను ఒప్పించే విధంగా సీఎస్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగ సంఘాలు వ్యతిరేకతను వెళ్లగక్కుతూనే ఉన్నాయి. రాజకీయ పక్షాలు కూడా వారికి అండగా నిలిచాయి. ప్రధాన పార్టీలు దీనిని ఓ అవకాశంగా తీసుకుంటున్నాయి. ఉద్యోగులను ఉసిగొల్పే విధంగా ప్రకటనలు చేస్తున్నాయి. ఉద్యోగ జేఏసీని […]
దిశ, తెలంగాణ బ్యూరో: వేతన సవరణ కమిషన్ నివేదిక వివాదాస్పదమవుతోంది. అధికారికంగా వెల్లడించకుండానే రిపోర్టు బయటకు ఎలా లీక్ అయ్యిందనే అంశంపై చర్చ సాగుతుండగానే, ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించి ఉద్యోగులను ఒప్పించే విధంగా సీఎస్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగ సంఘాలు వ్యతిరేకతను వెళ్లగక్కుతూనే ఉన్నాయి. రాజకీయ పక్షాలు కూడా వారికి అండగా నిలిచాయి. ప్రధాన పార్టీలు దీనిని ఓ అవకాశంగా తీసుకుంటున్నాయి. ఉద్యోగులను ఉసిగొల్పే విధంగా ప్రకటనలు చేస్తున్నాయి. ఉద్యోగ జేఏసీని సైతం టార్గెట్ చేస్తున్నాయి. ఉద్యోగ జేఏసీ ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నాయంటూ దూరం పెంచే ప్రయత్నాలు మొదలయ్యాయి.
వేతన సవరణపై ఉన్నతాధికారుల బృందం బుజ్జగింపులకు దిగింది. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో సమావేశమైన త్రిసభ్య కమిటీ ఆ తర్వాత కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రభుత్వం తరపున చెబుతూ కన్విన్స్ చేస్తోంది. దీనికి ఓ మంత్రితో ఉద్యోగ సంఘాలకు రాయబారం నెరుపుతోంది. సదరు మంత్రి కూడా పీఆర్సీ నివేదిక అశాస్త్రీయమంటూ ఉద్యోగుల పక్షాన మాట్లాడుతూనే.. ఉద్యోగ నేతలను ఎంతో కొంతకు ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
ప్రధాన ఉద్యోగ సంఘాలతో బుధవారం చర్చించిన సీఎస్కమిటీ.. రాత్రి కూడా ఉద్యోగ వర్గానికి చెందిన ఓ మంత్రితో మంతనాలు చేసింది. జేఏసీలోని ప్రధాన నేతలతో మళ్లీ మాట్లాడిస్తున్నారు. స్టేట్ ఎకానమీ దృష్ట్యా కమిషన్ఇచ్చిన దానికంటే ఒకటీ, రెండు శాతం ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందని, ఇప్పుడు దానికి ఒప్పుకోవాలంటూ సూచిస్తోంది. అంటే ప్రభుత్వం తరపున 10 శాతం ఫిట్‌మెంట్‌కు ఒప్పిస్తామని, సీఎంతో మాట్లాడిస్తామంటూ చెప్పుకొస్తున్నారు. ఈ బుజ్జగింపుల పర్వం ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. సంఘాల నేతలను కొన్నిచోట్ల బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అయితే బుజ్జగింపుల పర్వాన్ని ఉద్యోగ సంఘాల నేతలు కొట్టిపారేస్తున్నారు.
30 శాతంపై ఆశలు
వేతన సవరణలో కమిషన్మరో అంశం కూడా సూచించింది. ఇక నుంచి వేతన సవరణ ఐదేండ్లకోసారి కాకుండా పదేండ్లకోసారి చేసే విధంగా నివేదికలో పేర్కొంది. ఇలాగైతే ఉద్యోగులకు ఇబ్బందులని, అందుకే ఈసారి కచ్చితంగా 30 శాతం పైమేరకు ఫిట్‌మెంట్ సాధించుకోవాలని ఉద్యోగులు భావిస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వం నుంచి 33 శాతం ఫిట్మెంట్వస్తుందని ఇప్పటి వరకు ఊహించారు. కానీ కమిషన్ మాత్రం 7.5 శాతానికి సూచనలు చేసింది. దీంతో పీఆర్సీ నివేదికపై భగ్గుమంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 శాతం వస్తుందని, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగ సంఘాలు భరోసాతో ఉన్నాయి. ఎందుకంటే గతంలో పలు కమిషన్లు తక్కువ సూచించినా.. ఎక్కువ ఇచ్చారని, ఈసారి కూడా అదే ఉంటుందనే ధీమాతో ఉన్నారు. కానీ గతంలో పీఆర్సీ కమిషన్లు సూచించిన ఫిట్‌మెంట్‌కు 10 శాతం వరకు అదనంగా ఇచ్చారు. కానీ ఈసారి 30 శాతం ఇవ్వాలంటే 22.5 శాతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తోంది. ఇది సాధ్యమవుతుందా అనేది కూడా అనుమానం నెలకొంటోంది.
సార్ పిలుపు కోసం?
ప్రస్తుతం పీఆర్సీ బంతి సీఎం చేతుల్లో పడింది. కమిషన్ సూచించిన తక్కువ ఫిట్‌మెంట్ తీసుకునేందుకు సంఘాలు సిద్ధంగా లేవు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తోనే తేల్చుకుంటామని ఉద్యోగ జేఏసీ ప్రకటించింది. కమిషన్ నివేదిక కేవలం సూచనలు మాత్రమేనని, అది చట్టబద్ధత కాదని, సీఎం కేసీఆర్‌తో లౌక్యంగా వ్యవహరించి పరిష్కరించుకుంటామని తేల్చింది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలతో సీఎస్కమిటీ భేటీ ముగిసింది. మొత్తం గుర్తింపు పొందిన సంఘాలతో చర్చలు పూర్తి చేసినట్లు సీఎస్ వెల్లడించారు. దీనికి సంబంధించిన నివేదికను సీఎం కేసీఆర్‌కు ఇవ్వనున్నారు.
సంఘాల నుంచి వచ్చిన వినతులు, పూర్తిస్థాయి రిపోర్టును సీఎంకు అప్పగించనున్నారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ నెలాఖరులోగా ఫిట్‌మెంట్ తేల్చుకోవాలని భావిస్తోంది. కానీ ఇంకా ప్రగతిభవన్ నుంచి ఆహ్వానం రాలేదు. ఉద్యోగుల అంశాల్లో మధ్యవర్తిత్వం చేసే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నుంచి కూడా ఇంకా సమాధానం రావడం లేదు. మంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు గంటల తరబడి చర్చిస్తూనే ఉన్నాయి. కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. వాస్తవంగా శుక్రవారం సీఎం కేసీఆర్‌తో చర్చలు ఉంటాయని భావించారు. కానీ గురువారం అర్థరాత్రి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఎప్పుడు పిలుస్తారోనని ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో చర్చించుకున్న తర్వాతే ఫిట్‌మెంట్ ప్రకటన ఉంటుందని అనుకుంటున్నారు.
పీఆర్సీపై దశలవారీగా ఉద్యమం చేస్తాం: తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక
పీఆర్సీపై సీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రిసభ్య కమిటీ సమావేశాలకు ఐక్య వేదికలోని 79 భాగస్వామ్య సంఘాలను చర్చలకు పిలవాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య వేదిక సంఘం డిమాండ్ చేసింది. ఐక్య వేదికలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘ నాయకులను చర్చలకు ఆహ్వానించాలని, 47.5 శాతం ఫిట్‌మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలన్నారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో ఐక్య వేదిక ప్రతినిధులు గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల మధ్య విభజించి పాలించు చందంగా వ్యవహరిస్తోందని, ఉద్యోగ సంఘాలతో చర్చించడం లేదని, కొన్ని సంఘాలనే పిలుస్తున్నారన్నారు. పీఆర్సీ అనేది ఉద్యోగులకు వేసే భిక్ష కాదని అది తమ హక్కు అన్నారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నాయకులు చిలగాని సంపత్ కుమార్ స్వామి, సదానంద గౌడ్, జంగయ్య, చావ రవి, రాజేంద్రప్రసాద్, ఆకుల నందకుమార్, నిర్మల, పురుషోత్తం, కృష్ణుడు, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.