డెడ్‌లైన్ ముగిసింది.. ఇప్పుడేంచేస్తారు..?
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలలో కాలయాపన జరుగుతోంది. జనవరి డెడ్‌లైన్‌గా సూచించినా విషయాలు కొలిక్కి రావడం లేదు. పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుండగా బదిలీలు చేయడం లేదు. అటు ఏపీ నుంచి రావాల్సిన ఉద్యోగులకు సంబంధించిన అంశంలో సరైన నిర్ణయాలూ లేవు. మరోవైపు పీఆర్సీ అంశం సస్పెన్స్ సినిమాలాగా రక్తి కట్టిస్తూనే ఉంది. దిశ, తెలంగాణ బ్యూరో : ఫిట్మెంట్ ను జనవరిలోనే ప్రకటిస్తారని, పదవీ విరమణ పెంపుపై కూడా నిర్ణయం తీసుకుంటారని ఆశతో చూశారు. దాదాపు […]
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలలో కాలయాపన జరుగుతోంది. జనవరి డెడ్‌లైన్‌గా సూచించినా విషయాలు కొలిక్కి రావడం లేదు. పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుండగా బదిలీలు చేయడం లేదు. అటు ఏపీ నుంచి రావాల్సిన ఉద్యోగులకు సంబంధించిన అంశంలో సరైన నిర్ణయాలూ లేవు. మరోవైపు పీఆర్సీ అంశం సస్పెన్స్ సినిమాలాగా రక్తి కట్టిస్తూనే ఉంది.
దిశ, తెలంగాణ బ్యూరో : ఫిట్మెంట్ ను జనవరిలోనే ప్రకటిస్తారని, పదవీ విరమణ పెంపుపై కూడా నిర్ణయం తీసుకుంటారని ఆశతో చూశారు. దాదాపు 680 మంది జనవరిలో విరమణ పొందారు. ఉద్యోగుల పదోన్నతులు, పోస్టింగ్‌ల అంశం ఇంకా సాగుతూనే ఉంది. కొన్ని శాఖల్లో పదోన్నతులను ఎంతో కొంత పూర్తి చేసినా పోస్టింగ్ ఆర్డర్లు మాత్రం ఇవ్వడం లేదు. మరికొన్ని శాఖల్లో ప్రమోషన్ల కోసం కోర్టు కేసులు, సీనియార్టీపరమైన సమస్యలను కారణంగా చూపిస్తూ పదోన్నతులకు బ్రేక్ వేశారు. నేరుగా నియమితులైన వారితో పాటు కిందిస్థాయి నుంచి వచ్చే వారి అంశంలో సీనియార్టీ ఇబ్బందులున్నా ఇంకా మార్గదర్శకాలు జారీ కాలేదు. దీంతో చాలా మందికి పదోన్నతులు నిలిచిపోయాయి. అలాగే, వైద్యారోగ్య శాఖతో పాటు ఎక్సైజ్, పర్యాటక, దేవాదాయ, వ్యవసాయ శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఆదివారంతో గడువు ముగిసినట్లుగా భావిస్తున్నారు. పదోన్నతుల ప్రక్రియ నిరంతరం కొనసాగాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా అధికార వర్గాలు మాత్రం సాధ్యం కాదన్నట్టుగానే చెబుతున్నాయి.
అక్కడక్కడా కదలికలు
కొన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియను కొంతమేరకు పూర్తి చేశారు. ఉదాహరణగా అబ్కారీ శాఖలో ఏఈఎస్ నుంచి ఈఎస్‌లకు పదోన్నతులిచ్చారు. సీఐ నుంచి ఏఈఎస్ వాళ్ల జాబితానే సిద్ధం చేయలేదు. పంచాయతీరాజ్ శాఖలో గ్రేడ్ – 2 నుంచి గ్రేడ్ –1కు పదోన్నతులు ఇచ్చారు. తర్వాత వారి జాబితా కూడా పెండింగ్‌లోనే ఉంది. మార్కెటింగ్‌లో కూడా 24 మందికి స్పెషల్ గ్రేడ్ కింద పదోన్నతులిచ్చారు. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖలో కూడా ఇంకా పెండింగ్. పోలీస్ శాఖలో డీపీసీ పూర్తి అయినా ఇంకా పదోన్నతులు ప్రకటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇలా కొన్ని శాఖల్లో కొద్దిమేర మాత్రమే ఈ ప్రక్రియ చేసినా, పోస్టింగ్‌లు మాత్రం ఇవ్వడం లేదు. పదోన్నతులు కల్పించిన తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చి బదిలీలు చేయాల్సి ఉన్నా కేవలం ప్రమోషన్లకు పరిమితమయ్యారు. అబ్కారీ శాఖలో ఈఎస్లుగా పదోన్నతులు వచ్చినా ఇంకా పాతస్థానాల్లోనే ఉన్నారు. రెవెన్యూలో పరిస్థితి కూడా అంతే. రిజిస్ట్రేషన్ల శాఖలో డిసెంబర్ నుంచి పోస్టింగ్‌లు లేవు. పోస్టింగ్‌ల కోసం కూడా మార్పులు తీసుకువస్తామంటూ రాష్ట్ర ఉన్నతాధికారి ఫైల్‌ను పెండింగ్ పెట్టినట్లు చెబుతున్నారు.
మంత్రులు చెప్పడం లేదు
మరోవైపు పోస్టింగ్‌ల కోసం మంత్రులదే తుది నిర్ణయమని అధికారవర్గాలు బాహాటంగానే పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పదోన్నతులు వచ్చిన వారిని ఎక్కడెక్కడ భర్తీ చేయాలనే అంశంపై మంత్రులకు తీరిక లేదని చెబుతున్నారు. మంత్రులు చెప్పకపోవడంతో వారి పోస్టింగ్ ఉత్తర్వులు సిద్ధం చేయడం లేదు. మంత్రులు ఖరారు చేసిన తర్వాతే పోస్టింగ్‌లు వస్తాయంటూ స్పష్టంగా తెలియజేస్తున్నారు.
పీఆర్సీ… ఇంకెంత దూరం?
వేతన సవరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఉద్యోగవర్గాలు వ్యతిరేక స్వరాలు అందుకున్నాయి. కమిషన్ నివేదికలో ఫిట్‌మెంట్‌ను కేవలం 7.5 శాతానికే సూచించిన విషయం తెలిసిందే. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలన్నీ ఫిట్మెంట్ పెంచాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. వారిని బుజ్జగించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా డిసెంబర్ 29న తొలుత ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన సీఎం కేసీఆర్… విడుతలుగా అధికారులకు అనధికారిక షెడ్యూల్ ఇచ్చారు. దీనిపై బహిరంగ ప్రకటన చేశారు. డిసెంబర్ 31న బిస్వాల్ కమిషన్ నివేదిక ఇచ్చింది. దాన్ని జనవరి తొలి వారంలోనే అధ్యయనం చేసి, రెండో వారంలోగా ఉద్యోగ సంఘాలతో చర్చించి, మూడో వారంలో కేబినెట్ భేటీ ఉంటుందని, కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కానీ పీఆర్సీ సీల్డ్ కవర్‌ను జనవరి ఆఖరి వారంలో ఓపెన్ చేశారు. దీనిపై చాలా దుమారం మొదలైంది. నెలాఖరులోగా ఫిట్మెంట్ ప్రకటిస్తారని అనుకున్నా చర్చలే ముగియలేదు. ప్రస్తుతం సీఎస్ ఆధ్వర్యంలోని త్రీమెన్ కమిటీ నివేదికలను సీఎం కేసీఆర్‌కు ఇచ్చిన తర్వాత మళ్లీ ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే సంఘాలు సీఎం అపాయింట్మెంట్ కోరాయి. కానీ సీఎం కార్యాలయం నుంచి స్పందన లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాల్లో జనవరి డెడ్‌లైన్‌గా ఉన్నా చాలా అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఎంతకాలం సాగదీస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు అంశాలపై ఉపాధ్యాయవర్గాలు మళ్లీ తిరుగుబాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీ అంశం మళ్లీ చిచ్చు పెడుతోంది. జనవరిలో తేలుతుందని ఆశ పెట్టుకున్నా నిరాశే ఎదురైంది. ఈ నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇంకా సాగిదీతే.