ఆయన యాక్షన్ షురూ.. వైఎస్ఆర్ టీపీలో నూతనోత్సాహం!

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీ కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ యాక్షన్ ప్లాన్ షురూ చేశారా? సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రంగంలోకి దిగనున్నారా? ఆయన సూచనలు, సలహాలతో నిస్తేజంగా ఉన్న శ్రేణులు యాక్టివ్ కానున్నాయా? నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం రానుందా అంటే లోటస్ పాండ్ వర్గాలు అవుననే సమాధానాన్ని ఇస్తున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. కాగా ఆ పార్టీ కోసం […]

Update: 2021-08-25 20:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీ కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ యాక్షన్ ప్లాన్ షురూ చేశారా? సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రంగంలోకి దిగనున్నారా? ఆయన సూచనలు, సలహాలతో నిస్తేజంగా ఉన్న శ్రేణులు యాక్టివ్ కానున్నాయా? నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం రానుందా అంటే లోటస్ పాండ్ వర్గాలు అవుననే సమాధానాన్ని ఇస్తున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. కాగా ఆ పార్టీ కోసం ప్రశాంత్ కిశోర్ తన అనుచర గణాన్ని రంగంలోకి దింపుతున్నట్లు లోటస్ పాండ్ శ్రేణులు చెబుతున్నాయి. తన సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐపీఏసీ) సెప్టెంబర్ లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగించనుందని తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ నేరుగా తెర ముందుకు రాకున్నా తెర వెనుకుండే సలహాలు, సూచనలు అందిస్తారని సమాచారం. రాబోయే ఎన్నికల సమయానికి ఆయన నేరుగా రంగంలోకి దిగే అవకాశముందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 9వ తేదీన వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు విషయాన్ని ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఆనాటి నుంచి అన్ని జిల్లాల వైఎస్సార్ అభిమానులు, నాయకులతో వరుస ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించింది. ఆనాటి నుంచి లోటస్ పాండ్‌కు నేతల తాకిడి ఎక్కువైనా కొద్ది రోజుల అనంతరం క్రమంగా జనం తగ్గుతూ వచ్చారు. ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టి మరింత జనాల్లోకి వెళ్లాలని షర్మిల ప్రయత్నించింది. అనంతరం నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షకు పూనుకుంది. అయినా శ్రేణుల్లో జోష్ క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీనికి తోడు ప్రాధాన్యత కల్పించలేదని ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న తరుణంలో లోటస్ పాండ్ శ్రేణులకు తమ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పని చేస్తారనే విషయం తెలియడంతో నూతనోత్సాహం మొదలైంది. షర్మిల పార్టీ ఏర్పాటు విషయంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారని గతంలో నుంచి వార్తలు వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోసం ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన సమయంలోనే పార్టీ ఏర్పాటుకు సంబంధించి బీజం పడినట్లు సమాచారం.

వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ప్రశాంత్ కిశోర్ పనిచేస్తారని గతంలో ఒకానొక సందర్భంలో పార్టీకి చెందిన ముఖ్య నేతలతో షర్మిల తల్లి విజయమ్మ చెప్పినట్లుగా తెలుస్తోంది. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి సైతం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. లోటస్ పాండ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యక్తుల సలహాలు, సూచనలు తీసుకోవడంలో తప్పేంటని తేల్చేశారు. అయితే ఇదంతా ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే జరుగుతున్నట్లు లోటస్ పాండ్ వర్గీయులు చర్చించుకుంటున్నారు. ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐపీఏసీ టీం కీలకంగా వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని స్పష్టం చేశారు. అయితే వైఎస్సార్ తెలంగాణ పార్టీతో ముందస్తుగానే ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ‘పీకే’ టీం కీలకంగా వ్యవహరించనుందని ఆ పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల సోషల్ మీడియా యాక్టివిటీని కూడా పెంచాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీన ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, జహీరాబాద్, నల్లగొండ జిల్లాల సోషల్ మీడియా ప్రతినిధులతో ఆమె లోటస్ పాండ్‌లో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కాగా 2వ తేదీన తన తండ్రి వర్ధంతి సందర్భంగా లోటస్ పాండ్‌లో వైఎస్సార్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. క్రమంగా ప్రజల్లో యాక్టివిటీని పెంచాలని ఆమె తీసుకున్న నిర్ణయాలకు తోడు ప్రశాంత్ కిశోర్ కూడా ఆ పార్టీకి తోడవుతారనే విషయం నాయకులు, కార్యకర్తలకు తెలియడంతో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది.

Tags:    

Similar News