చరిత్ర సృష్టిస్తారా.. ఆ నియోజకవర్గాల్లో అలజడి రేపుతున్న మహిళా ఎంపీ అభ్యర్థులు

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు రాజకీయ ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి.

Update: 2024-05-01 03:31 GMT

దిశ, ప్రతినిధి, కడప: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు రాజకీయ ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కడప పార్లమెంటు, అసెంబ్లీలకు ఇద్దరు మహిళలు పోటీ చేస్తున్నారు. కడప గెలుపుపై గురి పెట్టారు. రెండు స్థానాల్లో కూడా త్రిముఖ పోరు జరుగుతున్నా కాంగ్రెస్, టీడీపీల నుండి ఇద్దరు ప్రముఖ మహిళలు బరిలో ఉన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా పార్లమెంటు స్థానానికి, మాజీ మంత్రి దివంగత రాజగోపాల్ రెడ్డి కుటుంబం నుంచి ఆయన చిన్న కోడలు మాధవి రెడ్డి తెలుగుదేశం నుండి కడప అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. రెండు ప్రధాన రాజకీయ కుటుంబాలకు నుంచి ఇద్దరు మహిళలు కడప నుండి గెలుపు ధీమాతో ముందుకు సాగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ మహిళలు కావడం, ఒక ప్రత్యేకమైన రాజకీయ చరిష్మా కలిగి ఉండడం, ప్రచార పర్వంలో ప్రత్యేకత చాటుకుంటూ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రజల సమస్యలపై భరోసా ఇస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

*ట్రెండ్ సృష్టిస్తున్న మాధవీ రెడ్డి

నాలుగు నెలలకు ముందే మాధవీరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. కడప అసెంబ్లీ టికెట్‌పై ధీమాతో ఉంటూ టిక్కెట్ సాధించారు. అంతే వచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకుని గెలుపే లక్ష్యంగా కడప అసెంబ్లీలో ఓ ట్రెండ్ సృష్టించారు. పార్టీకి ఊపు తెచ్చారు. రాజకీయ పరిశీలకు సైతం మొదట్లో అంచనా వేయలేకపోయారు. 2004 నుంచి కడపలో గెలుపేలేని తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆమె జోష్ నింపిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముస్లిం మైనార్టీల ప్రభావం ఉన్న కడపలో 30 సంవత్సరాలుగా పార్టీలు ఏవైనా మైనార్టీ నేతలే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇలాంటి నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ముందు సాగుతున్న మావిరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమించినప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి ,ప్రస్తుత కడప వైసీపీ అభ్యర్థి అయిన అంజద్ భాషను టార్గెట్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారం, కడప మౌలిక వసతుల కల్పనలో వైసీపీ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే విఫలమైనట్లుగా మాట్లాడుతూ జనం మధ్యకు వెళ్లారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం మొదటిసారే అయినా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మహిళగా కడపలో సమీకరణ పై దృష్టి పెట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీ నుంచి టిడిపిలో చేరికలకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడైన ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి 2014 నుంచి ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. కడపలో ఆయనకు ఉన్న అనుచరగణం, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం మాధవి రెడ్డికి కలిసి ఇచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆమె ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప అసెంబ్లీ నుండి పోటీ చేయడం, వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అనుకూలంగా ఉంటున్న మైనార్టీల ప్రభావం కలిగిన కడప బరిలో ఆమె గెలుపు కోసం చేసే ప్రయత్నం అంత సులువైన అంశం కాదు. అయినా కూడా అంచనాలకు మించి కడప అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె దూసుకెళ్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

*వైసీపీలో అలజడి రేపుతున్న షర్మిలా రెడ్డి

కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి పోటీ కడప వైసీపీలో అలజడి రేపుతోంది. కడప పార్లమెంటు స్థానం నుంచి ఆమె మహిళా అభ్యర్థిగా పోటీ చేయడంతోనే పార్లమెంట్ రాజకీయాలు ప్రత్యేకత సంతరించుకున్నాయి. కడప పార్లమెంటులో 1989 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ,ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి, కుమారుడు జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత ఆయన సోదరుడు కుమారుడు అవినాష్ రెడ్డిలే గెలుస్తూ వస్తున్నారు. అంటే 1989 నుంచి ఇప్పటిదాకా వైఎస్ కుటుంబమే కడప పార్లమెంట్‌లో గెలుస్తూ వస్తోంది. వైసీపీ ఏర్పాటయ్యాక 2014, 2019 ఎన్నికల్లో షర్మిల తమ్ముడు అవినాష్ రెడ్డి ఎన్నికయ్యారు. ప్రస్తుతం కూడా అవినాష్ రెడ్డే వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుండి షర్మిల పోటీలో ఉన్నారు .షర్మిల పోటీ చేయడంతోనే బలమైన త్రిముఖ పోటీ ఏర్పడిందని చెప్పాలి. షర్మిల జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తూ ,ఆయనపై విమర్శనాస్తాలు చేయడంతో పాటు వివేక హత్య కేసు పై ఆరోపణ చేస్తూ ప్రచార పర్వంలో దూసుకెళుతున్నారు. షర్మిల ఎంపీగా పోటీ చేస్తుండడంతో వైసీపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్న మైనారిటీ వర్గాల ఓట్లు చాలా మటుకు షర్మిల అనుకూలంగా మారుతాయన్న అంచనాలు వేస్తున్నారు. ఇదే జరిగితే అవినాష్ రెడ్డి ఓట్ల శాతానికి గండి పడే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా నేతగా మొదటిసారి కడపలో పోటీ చేస్తున్న ఆమెను ఓటర్లు ఏ మేరకు ఆదరిస్తారు అన్నది చూడాలి.

గెలిస్తే చరిత్రే..

కడప పార్లమెంటు నుంచి వైఎస్ షర్మిల, కడప అసెంబ్లీ నుంచి ఆర్ మాధవి రెడ్డిలు ఈ ఎన్నికల్లో గెలిస్తే వారిది ఒక చరిత్రే అవుతుంది. కడప పార్లమెంటు నుంచి కానీ, అసెంబ్లీ నుంచి గాని ఇప్పటివరకు మహిళలు గెలిచిన సందర్భం లేదు. అంతేకాదు కడప పార్లమెంటు నుంచి 1967లో మాత్రమే మహిళా అభ్యర్థిగా కె. రామసుబ్బమ్మ కాంగ్రెస్ నుండి పోటీ చేశారు. సీపీఐ అభ్యర్థి ఎద్దుల ఈశ్వర్ రెడ్డిపై ఆమె 37719 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అంతకుమించి ప్రధాన పార్టీల నుంచి ఎవరు పోటీ చేయలేదు. కడప అసెంబ్లీ నుంచి ఇప్పటివరకు ప్రధాన పార్టీ నుంచి మహిళా అభ్యర్థిగా ఎవరూ పోటీ చేయలేదు. గతంలో కొన్నిసార్లు రంగమ్మ రెడ్డి అనే మహిళ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ వచ్చారు. కానీ కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలైన ప్రధాన పార్టీ నుంచి ఎవరు పోటీ చేసిన సందర్భం లేదు. కాబట్టి మొదటిసారి ప్రధాన పార్టీల నుండి మాధవీ రెడ్డి పోటీ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఇటు మాధవి రెడ్డి అటు షర్మిల గెలిస్తే కడప ఎంపీ, ఎమ్మెల్యేలుగా వీరే మొదటి వారుగా జిల్లా చరిత్రలో నిలుస్తారు.


Similar News