తొమ్మిది ఏళ్లుగా సర్కార్​ మోసం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

తొమ్మిది ఏళ్లుగా నిరుద్యోగులను సర్కార్​ మోసం చేస్తూనే ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2023-03-17 16:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తొమ్మిది ఏళ్లుగా నిరుద్యోగులను సర్కార్​ మోసం చేస్తూనే ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్​పీ ఎస్సీ లీకుతో విద్యార్ధులు పరేషాన్​లో ఉన్నారన్నారు. భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తివేసిందన్నారు. వెంటనే సిట్టింగ్ జడ్జ్​తో విచారణ జరిపించి అభ్యర్ధులను న్యాయం చేయాలని ఆయన శుక్రవారం సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ‘‘నీళ్లు..నిధులు..నియామకాలు నినాదంతో తెలంగాణ యువతను ఆకర్షించి మీరు అధికారంలోకి వచ్చారు.గడిచిన 9 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో పదే పదే మోసం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఏడాది క్రితం బిస్వాల్ కమిటీ నివేదిక స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆ ఖాళీలను భర్తీ చేయాలన్నా ఆలోచన చేయ లేదు.

సునీల్ నాయక్, భాషా లాంటి వందలాది మంది యువత నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో కూడా మీ ప్రభుత్వంలో చలనం లేదు.మీ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ జంగ్ సైరన్ ల పేరుతో పోరాటాలు చేస్తే వాటిని కూడా పోలీసులను అడ్డుపెట్టి అణచి వేసే ప్రయత్నం చేశారు.ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ. 3,106 భృతి ఇస్తానని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని మోసం చేశారు. తాజాగా మరో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు, షెడ్యూల్స్ ప్రకటించారు. కనీసం ఈ కొన్ని ఉద్యోగాలనైనా సక్రమంగా పారదర్శకంగా భర్తీ చేస్తారని ఆశించాం. కానీ స్వప్రయోజనాల కోసం నిరుద్యోగుల భవిష్యత్​ను ఆగం చేశారు. ”అంటూ రేవంత్​ లేఖలో ఫైర్​అయ్యారు.

ఇక ప్రభుత్వం భర్తీ చేసే కొద్దిపాటి ఉద్యోగాల కోసం ఏకంగా, 30 లక్షల మంది నిద్రాహారాలు మాని పరీక్షలకు సిద్ధమవుతున్నారని, తల్లిదండ్రులు పంపించే చాలి,చాలనీ డబ్బులతో హాస్టళ్లు,కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టి మరీ పరీక్షలకు ప్రిపేరైనట్లు గుర్తు చేశారు. గ్రూప్​-1కు 2 లక్షల 80 వేల మంది, ఏఈ పరీక్షకు 55 వేల మంది, ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పరీక్షకు 80 వేల మంది, డివిజినల్ అకౌంట్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్ష దాదాపు లక్ష మంది హాజరు కాగా, త్వరలో నిర్వహించే గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షల కోసం దాదాపు 14 లక్షల మంది, టౌన్ ప్లానింగ్ పరీక్ష కోసం 55 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు రేవంత్ లేఖలో గుర్తు చేశారు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా పేపర్ లీకులు, పరీక్షలు రద్దు చేసే దుస్థితి ఏర్పడటం బాధకరమన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే, శిక్ష మాత్రం నిరుద్యోగ యువతకు వేస్తున్నట్లు విమర్శించారు.

టీఎస్పీఎస్సీ రాజ్యాంగ సంస్థ అయినప్పటికీ, దాని చైర్మన్, సభ్యుల నియామకం చేసేది రాష్ట్ర ప్రభుత్వమే అని రేవంత్ పేర్కొన్నారు. పేపర్ లీకేజీ లో సాంకేతికపరమైన లోసుగులు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంబంధిత ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ కుడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని రేవంత్ నొక్కి చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన చైర్మన్, సభ్యులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. ప్రతి అంశానికి తుమ్మితే, దగ్గితే ట్విటర్ ద్వారా స్పందించే ఐటీ మంత్రి కూడా దీనిపై పేపర్​లీకేజీపై స్పందించలేదన్నారు. ప్రభుత్వ పెద్దల హాస్తం ఉండటంతోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్​పీఎస్సీలో అన్ని వ్యవహారాలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలలో ఆటలాడితే కాంగ్రెస్​ పార్టీ సహించదని రేవంత్ లేఖలో స్పష్టం చేశారు.


Tags:    

Similar News