కేసీఆర్‌కు మరో షాక్.. తెలంగాణలో బాబు ఎంట్రీతో కొత్త గుబులు

బీఆర్ఎస్ లో చంద్రబాబు గుబులు మొదలైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న పార్టీ పునర్ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.

Update: 2022-12-22 22:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ లో చంద్రబాబు గుబులు మొదలైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న పార్టీ పునర్ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే 8ఏళ్ల తర్వాత మొదటి సభ సమరశంఖం పేరుతో ఖమ్మంలో నిర్వహించి భారీ సక్సెస్ చేశారు. పార్టీని వీడినవారంతా తిరిగి రావాలని బాబు పిలుపునిచ్చారు. దీంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఎక్కువమంది నేతలు టీడీపీ నుంచి వచ్చినవారే కావడంతో పార్టీలో దిద్దుబాటు చర్యలకు అధిష్టానం సన్నద్ధమవుతోంది. బీఆర్ఎస్ నేతల్లో టీడీపీ వ్యూహాలపై జోరుగా చర్చమొదలైంది.

బడుగు, బలహీన వర్గాల పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు ఏపీపై ఫోకస్ పెట్టారు. దీంతో తెలంగాణలోని పార్టీ నేతలంతా ఇతరపార్టీల్లో చేరారు. కేడర్ ఉన్నప్పటికీ నాయకత్వం లోపించింది. దీంతో పార్టీని గాడిలో పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే గత నెల10న కాసాని జ్ఞానేశ్వర్ కు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించారు. నిత్యం రాష్ట్రంలోని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల నేతలు, రాష్ట్ర కమిటీతో భేటీలు, అనుబంధ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో యాక్టీవిటీ పెంచారు. గ్రామస్థాయి నుంచి బలోపేతానికి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపడుతున్నారు. అందులో భాగంగానే మొదటిసభను ఖమ్మంలో నిర్వహించి సమరశంఖం పూరించారు. రాష్ట్రంలోని అధికారపార్టీతోపాటు ప్రతిపక్షాలు సైతం ఊహించని విధంగా ప్రజలను తరలించి సక్సెస్ చేశారు. అందరి అంచనాలను తలకిందులు చేశారు. కార్యకర్తలను నాయకులను తయారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతేకాదు పార్టీని వీడిన వారంతా తిరిగి రావాలని, పార్టీ పునర్నిర్మాణం చేసుకుందామని పిలుపు నిచ్చారు. దీంతో అధికారపార్టీ బీఆర్ఎస్ లో గుబులు మొదలైంది. పార్టీలో ఉన్న ఎక్కుమంది నేతలంతా టీడీపీ నుంచి వచ్చినవారే. అంతేకాదు కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. వివిధ హోదాల్లోనూ పనిచేస్తున్నారు. మరి కొంతమంది నేతలు పదవులు దక్కక అసంతృప్తిలో ఉండగా, పదవులు ఉన్నా ప్రాధాన్యత లేకపోవడంతో సతమతమవుతున్నారు. వారు ఎక్కడ పార్టీ మారతారేమోనని టెన్షన్ స్టార్ట్ అయింది.

టీడీపీ ఎందరో నాయకులను తయారు చేసింది. కేసీఆర్ తో సహా ఎంతోమందికి రాజకీయ అవకాశం కల్పించింది. అంతేకాదు నాడు ఎన్టీఆర్ చేపట్టిన రూపాయి కిలో బియ్యం, ప్రజలవద్దకే పాలనతో అధికారులను గ్రామస్థాయికి తీసుకురావడం, పరిపాలన సంస్కరణలతో బడుగు వర్గాలకు చేరువైంది. గ్రామస్థాయిలో పటిష్టమైన కేడర్ ను కలిగి ఉంది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత నేతలంతా పార్టీలు మారడంతో కొంత స్తబ్దుగా ఏర్పడింది. అయితే వారిలో పునరుత్తేజం తెచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అయితే జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ కు ఈ పరిణామాలు కొరకరాని కొయ్యగా మారాయి. బాబు ఫోకస్ ఎటుదారి తీస్తుందోనని, మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలకుంటున్న కేసీఆర్ కు మింగుడుపడటం లేదు. రాబోయే ఎన్నికల్లో పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే రాష్ట్రంలో పట్టుకోవాల్సిందే.

ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో ఇప్పటికి కేడర్ పటిష్టంగా ఉంది. సుమారు 30 నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గెలిచే అవకాశంసైతం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉంది. మిగిలిన ఉమ్మడి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో టీడీపీకి కేడర్ ఉంది. టీఆర్ఎస్(బీఆర్ఎస్) రాష్ట్రంలో ప్రభంజనం ఉన్నప్పటికీ ఖమ్మంలోని పలు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. అంతేకాదు టీడీపీ ఖమ్మం సభకు బీఆర్ఎస్ లోని పలువురు నేతలు తమ కేడర్ ను సైతం పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇద్దరు మాజీమంత్రులతో పాటు మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు టీడీపీ గూటికీ చేరుతారనే ప్రచారం జరిగింది. రాబోయే ఎన్నికల నాటికి ఇతర పార్టీల నుంచి భారీగా టీడీపీలోకి వస్తారని పార్టీ నేతల ఒకరు చెప్పారు.

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య పోరుతో సతమతమవుతుంది. గత నాలుగురోజులుగా మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డికి వ్యతిరేకంగా భేటీకావడం చర్చనీయాంశమైంది. వారంతా ఎమ్మెల్యే సుభాస్ రెడ్డి తప్పా మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వచ్చినవారే. అయితే ఈ విషయంలో అధిష్టానం మాత్రం ఆచితూచీ వ్యవహరిస్తోంది. తెలుగుదేశంపార్టీ పునర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఆ ఎమ్మెల్యేలంతా ఘర్ వాపసీ అవుతారా అనేది బీఆర్ఎస్ లో చర్చకు దారితీసింది. అదే విధంగా వలస వచ్చినవారికే కాంగ్రెస్ పార్టీ లో పదవులు అంటూ సీనియర్ నేతల విమర్శల నేపథ్యంలో ఈ నెల 18న టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సీతక్కతో సహా 12మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అందరూ టీడీపీలోకి వెళ్తారా అనే చర్చసైతం జోరందుకుంది. ఒకవైపు బీఆర్ఎస్ లో, మరోవైపు కాంగ్రెస్ లో అసంతృప్త నేతలపై చంద్రబాబు సైతం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే వారందరీని ఘర్ వాపసీ పేరుతో టీడీపీలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురి నేతల టచ్ లోకి చంద్రబాబు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ఆపార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

హైదరాబాద్ అభివృద్ధికి టీడీపీ 20ఏళ్ల క్రితమే విజన్ 2020తో పునాదివేసిందని, హైటెక్ సిటీ, జినోమ్ వ్యాలీ, ఫ్లోరోసిస్ రూపుమాపేందుకు చర్యలు చేపట్టిందని, నావల్లే తెలంగాణ అభివృద్ధి అని ఖమ్మంసభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. కేబినెట్ కు చెందిన ఆరుగురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సైతం ఖండించారు. చంద్రబాబుపై కట్టడికి విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ చంద్రబాబు పాలనలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అన్యాయానికి గురైందని, సిలేరు పవర్ ప్రాజెక్టుతో పాటు 7 మండలాలను కలుపుతూ జీవో తెచ్చారని ప్రతివిమర్శలు చేశారు. టీడీపీ వైపు బీఆర్ఎస్ శ్రేణులు దృష్టిసారించకుండా చేయాలనే ప్రయత్నాలను ఆపార్టీ అధినేత ప్రారంభించారు. ఇప్పటివరకు టీడీపీపై విమర్శలు చేయని బీఆర్ఎస్ నేతలు ఒక్క ఖమ్మం సభతో అప్రమత్తమైంది. పార్టీ శ్రేణులతో కాపాడుకునే యత్నాలను ప్రారంభించింది. ఏదీ ఏమైనప్పటికీ టీడీపీ సభ సక్సెస్ బీఆర్ఎస్ అధినేతకు కంటిమీద కునులేకుండా చేస్తుంది.


Similar News