ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయం.. కేసీఆర్‌కు షాక్ తప్పదా?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రోజు రోజుకూ ఆసక్తి రేపుతున్నది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

Update: 2022-10-18 11:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రోజు రోజుకూ ఆసక్తి రేపుతున్నది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించడం దాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరించడంపై ఆయన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సాంకేతికంగా ఎన్నికల సంఘం నుంచి పేరు మార్పిడి అవ్వగానే ఆయన రంగంలోకి దిగబోతున్నట్లు చర్చ జరుగుతోంది. పొరుగు రాష్ట్రంలో ఏపీలోను కేసీఆర్ పార్టీకి మద్దతు పెరగడం, ఇప్పటికే ఉండవల్లి లాంటి సీనియర్ నేతలతో కేసీఆర్ మంతనాలు జరపడాన్ని బట్టి వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ను ఏపీలో పాగవేసేలా ప్రణాళికలు రచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉన్నా ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు బీజేపీతో సంబంధాలు కొనసాగిచిన పవన్ కల్యాణ్ మంగళవారం అనూహ్యంగా చంద్రబాబుతో భేటీ కావడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.

తెలంగాణ వైపు చంద్రబాబు, పవన్ చూపులు:

బీఆర్ఎస్ పేరుతో సీఎం కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తుంటే చంద్రబాబు, పవన్ మాత్రం తెలంగాణ పొలిటికల్ సినారియోలోకి ఎంట్రి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు ఇటీవల భద్రాచలంలో పర్యటించారు. ఇటీవల ఆయన్ను టీటీడీపీ నేతలు కలిశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సైతం కసరత్తు జరిగినా చివరి నిమిషంలో చంద్రబాబు ఆ డిసిషన్ను మార్చుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇక పవన్ కల్యాణ్ సైతం తెలంగాణలో పోటీ చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఇదే అంశంపై పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతున్నామని అయితే ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగాలో నిర్ణయం తీసుకుంటే తాను రంగప్రవేశం చేసి అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తాననే సంకేతాలు ఇచ్చేశారు. ఈ మాటలు చెప్పిన గంట వ్యవధిలోనే పవన్ కల్యాణ్ చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నది. వీరిద్దరి భేటీ ఏపీ రాజకీయాలకే పరిమితం అవుతుందా లేక తెలంగాణలోనూ కలిసి పని చేయబోతున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది.

అదే జరిగితే టీఆర్ఎస్ కు భారీ షాక్ తప్పదా?:

ఏపీలో బీజేపీ, జనసేన మధ్య కలిసి స్నేహ బంధం ఉంది. వీరికి చంద్రబాబు కలిసి వస్తే ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికర అంశమే. అయితే తెలంగాణలో ఈ మూడు పార్టీలు కలిస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది చర్చగా మారుతున్నది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీకి ఆసక్తి చూపితే టీ-బీజేపీ నేతల సూచనల మేరకు పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరిగింది. కానీ రాబోయే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిస్తే అధికార పార్టీకి షాక్ తప్పదా అనే వాదన తెరపైకి వస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో మునుగోడుకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ టీడీపీకి కొంత క్యాడర్ ఉంది. పవన్ కల్యాణ్ కు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభిమానులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలానికి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను పవన్ కల్యాణ్ ఈ ఏడాది మే లో పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా చేశారు. అయితే పవన్ పర్యటించిన చౌటుప్పల్ ప్రాంతం మునుగోడు నియోజకవర్గంలోనికే వస్తుంది. ఆ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనకు ప్రతి నియోజకవర్గంలో 5 వేల ఓట్లు ఉన్నాయని తాము గెలుపు ఓటములను ప్రభావితం చేయగమని అన్నారు. జరుగుతున్న పరిణామాల దృష్ట్యా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కలిసి బీజేపీకి మద్దతు తెలిపితే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

కేసీఆర్ ఎవరి వైపు?:

ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా వెళ్లాలనే నిర్ణయంతో ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయనే ప్రచారం కొంత కాలంగా జరుగుతున్నది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చంద్రబాబుతో సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామం రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడానికి సంకేతమా అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పేరుతో ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న కేసీఆర్ ముందు అసలైన సవాల్ ఎదురు చూస్తోంది. ఏపీలో ప్రస్తుతం రాజధాని సమస్య అన్ని పార్టీలకు ఓ టాస్క్ గా మారిపోయింది. ఏపీ రాజధానిగా అమరావతినే ఉండాలని టీడీపీ, జనసేన, బీజేపీ వాదిస్తుంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందే అని వైసీపీ పట్టుబడుతోంది. మూడు రాజధానులను పక్కాగా అమలు చేస్తామని చెబుతోంది. ఈ అంశం రాబోయే ఎన్నికల్లో కీ రోల్ పోషించబోతుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇలాంటి సంక్లిష్టమైన అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందనేది చర్చనీయాంశం. ఏపీలో పోటీ చేయాలనుకుంటే గనుక కచ్చితంగా కేసీఆర్ ఈ అంశంపై తమ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాల్సి ఉంటుంది. దీంతో కేసీఆర్ అమరావతికి జై కొడతారా లేక జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తారా అనేది ఉత్కంఠ రేపుతున్నది.

ఇవి కూడా చ‌ద‌వండి:

పవర్' కోసం దూకుడు 

Tags:    

Similar News