ఢిల్లీకి చేరిన రాజస్థాన్ కాంగ్రెస్ పంచాయతీ

కర్ణాటక ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న వర్గపోరు సమస్యగా మారింది. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విబేధాలు రోజురోజు భగ్గుమంటున్నాయి.

Update: 2023-05-29 05:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న వర్గపోరు సమస్యగా మారింది. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విబేధాలు రోజురోజు భగ్గుమంటున్నాయి. ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు అధిష్టానం నిర్ణయించింది. ఈమేరకు రాజస్థాన్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ విడివిడిగా భేటీ కాబోతున్నారు.

గత ప్రభుత్వంలోని అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని సచిన్ పైలట్ సొంత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తాను చేసిన మూడు ప్రధాన డిమాండ్లను ఈ నెలాఖరులోపు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలకు ఓ పరిష్కారం చూపేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ భేటీపై ఖర్గే స్పందిస్తూ రాజస్థాన్ నుంచి అశోక్, పైలట్ ఇద్దరు వస్తున్నారని పార్టీకి మేలు చేసే విధంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. మొదటి నుంచి రెండు వర్గాల మధ్య రాజస్థాన్ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు గుప్పుమంటున్న వేళ ఈసారైనా అధిష్టానం ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందా లేక నాన్చివేత ధోరణితోనే వదిలేస్తుందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

Tags:    

Similar News