కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి.. ప్రియాంక గాంధీ సమక్షంలో చేరిక?

బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు భవిష్యత్ నిర్ణయం ఎలా ఉండబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకోంది.

Update: 2023-04-20 13:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు భవిష్యత్ నిర్ణయం ఎలా ఉండబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్‌పై అసమ్మతి రాగం వినిపించిన ఈ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న ప్రచారం ఆసక్తిని రేపుతోంది. కేసీఆర్‌ను గద్దె దించేందుకు రెడీగా ఉన్న పార్టీలోనే చేరుతానని ఇప్పటికే స్పష్టం చేసిన పొంగులేటి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పొంగులేటి, జూపల్లి ఇద్దరు కూడా వచ్చే నెలలో తెలంగాణలో ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం కండువా కప్పుకోబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మే మొదటి వారంలో సరూర్ నగర్‌లో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కాబోతున్నారు. దీంతో ప్రియాంక గాంధీ సమక్షంలోనే పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు ఉన్న ఈ నేతల చేరికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీంతో ఎలాగైనా వీరిని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కేసీఆర్ పై పై చేయి సాధించాలనే అభిప్రాయంతో బీజేపీ, కాంగ్రెస్ లు ఉన్నాయి.

ఈ క్రమంలో పొంగులేటి చేరికపై ఖమ్మం జిల్లా సీనియర్ నేత రేణుకా చౌదరితో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీలు బలరాం నాయక్, సురేష్ షెట్కర్, ఇతర నేతలు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. రేణుకా చౌదరి ఇంట్లో సమావేశం అయిన నేతలు.. పొంగులేటి కాంగ్రెస్ లోకి వచ్చేలా చొరవ తీసుకోవాలని రేణుకా చౌదరిని ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ ఇద్దరు నేతలపై బీజేపీ సైతం కన్నేసింది. ఈ క్రమంలో ఈనెల 23న చేవెళ్లలో జరగనున్న అమిత్ షా సభలో వీరు బీజేపీలో చేరుతారనే ప్రచారమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News