గత అనుభవం నుంచి గుణపాఠం నేర్వని బీఆర్ఎస్

వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

Update: 2023-02-19 08:03 GMT

దిశ, వైరా : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో వర్గ రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ వర్గ రాజకీయాలతో బీఆర్ఎస్ పార్టీకి పెను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ఈ వర్గ రాజకీయాలు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో కొనసాగుతున్నాయి. అంతర్గత సమావేశాలు నిర్వహించి పార్టీలో ప్రాతనిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య అధికారులపై వ్యక్తిగతంగా విమర్శలు చేసే స్థాయికి ఈ రాజకీయాలు చేరాయి. పోటాపోటీ ర్యాలీలు, పోటాపోటీగా వ్యక్తి గత నినాదాలతో బీఆర్ఎస్ పార్టీని సైతం డైలమాలో పడేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ ముందు వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అత్యధిక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. కానీ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించటంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని ఆయన అనుచరులు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం ఒక్క వైరా నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు ప్రశాంతంగా నడుస్తున్నాయి.

పాలేరు నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుతం ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గాలుగా పార్టీ విడిపోయి ఉన్నప్పటికీ అక్కడ వర్గ రాజకీయాలు పార్టీని తీవ్రస్థాయి లో నష్టపరిచే విధంగా కనిపించడం లేదు. అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా వైరా నియోజకవర్గంలో మాత్రమే పార్టీలోని వర్గ విభేదాలు బీఆర్ఎస్ కు ప్రతిబంధకంగా మారాయని అనడంలో సందేహం లేదు. 2018 ఎన్నికల్లో పార్టీలోని వర్గ విభేదాలు కారణంగానే వైరాలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. పార్టీలోని వర్గ విభేదాలు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన లావుడ్యా రాములు నాయక్ ను విజయ తీరానికి చేర్చాయి. బీఆర్ఎస్ పార్టీ గత అనుభవం నుంచైనా గుణపాఠం నేర్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలోని వర్గ విభేదాలను బీఆర్ఎస్ కట్టడి చేయలేకపోతే గతంలో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు క్రాస్ ఓటింగ్ ద్వారా లాభం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గత అనుభవంతో నైనా గుణపాఠం నేర్వరా..

గత అనుభవంతో నైనా బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం నేర్వని వైనం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. 2014 ఎన్నికల్లో వైయస్సార్సీపి పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యేగా బానోత్ మదనాన్ లాల్ గెలుపొందారు. అనంతరం మదన్ లాల్ అభివృద్ధి నినాదంతో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే వైరా నియోజకవర్గంలో మదన్ లాల్, పొంగులేటి వర్గీయుల మధ్య అప్పట్లో తీవ్ర వర్గ విభేదాలు నెలకొన్నాయి. 2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా రెండు నియోజకవర్గాల మినహా అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ లకే సీటు కేటాయించడంతో వైరా నుంచి మదన్లాల్ ఎన్నికల బరిలో దిగారు.

దీంతో పొంగులేటి వర్గీయులు తమను నాలుగేళ్లగా టార్గెట్ చేసి, అనేక కేసులు పెట్టి మానసికంగా మదన్ లాల్ తీవ్ర ఇబ్బందులు గురిచేసారని ఆరోపిస్తూ మదనలాల్ కు టికెట్ రద్దు చేయాలని అనేక రూపాల్లో ఆందోళన చేశారు. అయినప్పటికీ పార్టీ తన నిర్ణయం మార్చుకోకపోవడంతో పొంగులేటి వర్గీయులు పార్టీకి ముకుమ్మడిగా రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి విఫలమై, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల రంగంలోకి దిగిన లావుడ్యా రాములు నాయక్ కు తమ మద్దతును ప్రకటించారు. పొంగులేటి వర్గీయులు, మదన్ లాల్ వ్యతిరేక వర్గీయులతో పాటు కాంగ్రెస్ పార్టీకి పొత్తుల్లో టికెట్ కేటాయించకపోవడం తో మనోవ్యధ చెందిన కాంగ్రెస్ శ్రేణులు కలిసి ఈ ఎన్నికల్లో రాములు నాయక్ ను గెలుపు తీరాలకు చేర్చారు. అనంతరం రాములు నాయక్ అభివృద్ధి కోసమని బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

అప్పట్లో వర్గ విభేదాలకు బీఆర్ఎస్ పార్టీ అడ్డుకట్ట వేసి ఉంటే వైరాలో ఆ పార్టీ విజయం సాధించి ఉండేది. ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ లో అదే రీతిలో వర్గ రాజకీయాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్ లాల్, బానోత్ చంద్రావతి వర్గాలుగా పార్టీ విడిపోయి ఉంది. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను పోటా పోటీగా బీఆర్ఎస్ వర్గాలు వేరువేరుగా నిర్వహించారు. పోటాపోటీ ర్యాలీలతో వైరా వర్గ రాజకీయాలను మరింత వేడెక్కించారు. ఓ వర్గం వారు తమ అనుచరులతో అంతరంగిక సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యే రాముల నాయక్ పై వ్యక్తిగత ఆరోపణలు చేసే స్థాయికి వర్గ రాజకీయాలు వెళ్లాయి. అంతేకాకుండా నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులను బదనాం చేసే పరిస్థితికి ఈ రాజకీయాలు చేరుకున్నాయి. ఇంత జరుగుతున్న తమకు ఏమి తెలియనట్లు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం వ్యవహరించటం పార్టీకు నియోజకవర్గంలో ప్రతికూల అంశంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వర్గ విభేదాలతో ప్రతిపక్షాలకు లాభం చేకు రే ఛాన్స్..?

బీఆర్ఎస్ లోని వర్గ విభేదాల వల్ల భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు లాభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్గ రాజకీయాలు రాములు నాయక్ ఎమ్మెల్యేగా గెలిచేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం కూడా ఇదే వర్గ రాజకీయం కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా పొంగులేటి శిబిరానికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయనటంలో సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తుందని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. అయితే వైరా నియోజకవర్గంలోని కమ్యూనిస్టులు బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తారా...? అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. గతంలో కమ్యూనిస్టుల పొత్తులతో గెలిచిన ఓ ఎమ్మెల్యే అనంతరం ఆ కమ్యూనిస్టులపైనే కత్తి కట్టారు. కారేపల్లి మండలం తో పాటు ఇతర మండలాల్లో కూడా సదరు గులాబీ నేత కమ్యూనిస్టులపై అనేక నాన్ బేయిలబుల్ కేసులు పెట్టించారని ఆయా మండలాల్లోనే కమ్యూనిస్టు నాయకులే ఇప్పటికి బహిరంగగా విమర్శలు చేస్తున్నారు.

ఈ వ్యవహారం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారుతుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పార్టీలోని వర్గాలను కట్టడి చేయటంలో బిఆర్ఎస్ విఫలమవుతోంది. ఈ వర్గాలను నియంత్రించకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కని వర్గం టిక్కెట్టు వచ్చిన వర్గంపై కత్తి కట్టి పరోక్షంగా బీఆర్ఎస్ కు పోటీగా ఉండే ప్రతిపక్షంకు ఓట్లను క్రాస్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల పొంగులేటి వర్గానికి కానీ కాంగ్రెస్ కానీ వచ్చే ఎన్నికల్లో లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినప్పటికీ పార్టీలోని వర్గాలను ఒకే తాటిపైకి తీసుకువస్తే పార్టీ గెలుపుకు దోహోదపడుతుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో వైరాలో కారు గుర్తుపై గెలిచిన సందర్భం లేదు. పార్టీకి వ్యతిరేకంగా గెలిచిన వారు అభివృద్ధి కోసం గులాబీ కండువ కప్పుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడా లేని విధంగా వైరా నియోజకవర్గంలోని వర్గ విభేదాలను అరికట్ట లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నాను.

Also Read..

బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్.. తీవ్ర స్థాయికి చేరిన వర్గపోరు! 

Tags:    

Similar News