తెలుగును విస్మరించిన కేసీఆర్.. నిర్మలా సీతారామన్ సంచలన వ్యా్ఖ్యలు

తాంత్రికులు చెప్పినందుకే కేసీఆర్ తన కేబినెట్‌లోకి మహిళలను తీసుకోవడంలేదని తమకు తెలిసిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన కామెంట్లు చేశారు.

Update: 2022-10-08 12:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తాంత్రికులు చెప్పినందుకే కేసీఆర్ తన కేబినెట్‌లోకి మహిళలను తీసుకోవడంలేదని తమకు తెలిసిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన కామెంట్లు చేశారు. ఢిల్లీలో ఒక మీడియా చానల్‌తో ఆమె మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం టీఆర్ఎస్‌ను స్థాపించారని, వీటి కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించారన్నారు. ఎన్నికల్లో కుల రాజకీయాలు పారద్రోలడమే కాకుండా, మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తాననని హామీ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. ఇవన్నీ ప్రజలు నమ్మి టీఆర్ఎస్‌కు అధికారాన్ని కట్టబెడితే 2014 నుంచి 2018 వరకు ఒక్క మహిళను కూడా కేబినెట్‌లోకి తీసుకోలేదని ఆమె వెల్లడించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఒక మహిళను కేబినెట్‌లోకి తీసుకున్నారని, ప్రతిపక్షాలు, మీడియా ప్రశ్నించాక ఒకరిద్దరిని కేబినెట్‌లోకి తీసుకున్నారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నీళ్ల ఇబ్బంది ఉండదని కేసీఆర్ అన్నారని, రూ.40 వేల కోట్ల నుంచి రూ.లక్ష 40 వేల కోట్లకు వ్యయం పెంచి మరీ నిర్మించారని, అయితే ప్రజలకు నీళ్ల చుక్క కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు అందించనప్పుడు అన్ని లక్షల కోట్లు పెట్టి ఏం ఉపయోగమని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, రూ.3 లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఇది 25 శాతం జీఎస్ డీపీకి సమానమన్నారు. ఇక నియామకాల గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. నీళ్లు, నియామకాలు, నిధుల కోసం తెచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మహిళలకు స్థానం ఇవ్వకూడదని మంత్ర తంత్రాలు చేసేవాళ్లు చెప్పినందుకే వారికి ఇవ్వలేదని తమకు తెలిసిందన్నారు. నిజంగానే మంత్ర, తంత్రగాళ్లు చెప్పినందుకే మహిళలను కేబినేట్‌లోకి తీసుకోలేదా? మరేదైనా కారణముందా అనేది కేసీఆర్‌కే తెలియాలని ఎద్దేవా చేశారు. ఇకపోతే టీఆర్ఎస్‌ను ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మార్చారని, ఇలా మార్చడం వల్ల తెలంగాణ ఎమోషన్ పోవడంతో పాటు తెలుగు కూడా పోయిందన్నారు. తెలుగు స్థానంలో సంస్కృతం వచ్చి చేరిందని సెటైర్లు చేశారు.

సచివాలయానికి వెళ్తే కీడు జరుగుతుందని తాంత్రికులు చెప్పిన సూచనల మేరకే కేసీఆర్ అడుగు పెట్టలేదని, అందుకే పాత సచివాలయాన్ని కూల్చి కొత్త నిర్మాణం చేపడుతున్నారన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నా తాంత్రికులు చెప్పినందుకు సచివాలయానికి వెళ్లను, ప్రజలకు అందుబాటులో ఉండను అన్నట్లుగా కేసీఆర్ తీరు తయారైందని విమర్శలు చేశారు. తెలంగాణను మరిచిపోయి, తెలుగును కూడా మరిచిపోయి కొత్త పార్టీని పెట్టిన ముఖ్యమంత్రి దేశానికి సేవ చేస్తారంటే అనుమానాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉట్టికి ఎగురలేనమ్మ.. స్వర్గానికి ఎగరుదామన్నట్లుగా టీఆర్ఎస్ పరిస్థితి తయారైందని సెటైర్లు వేశారు. తెలంగాణలోనే ప్రజలకు ఏమీ చేయని టీఆర్ఎస్, దేశ ప్రజలకు సేవ చేస్తామంటే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు.

Tags:    

Similar News