పంచాయతీల సొమ్ము లాక్కున్నారు.. నారా లోకేష్
గ్రామ పంచాయతీలను జగన్ సర్కారు నిర్వీర్యం చేసింది. కేంద్రం నుంచి వచ్చే నిధులను సుమారు రూ.9 వేల కోట్లను లాక్కున్నారు.
దిశ, ఏపీ బ్యూరో: గ్రామ పంచాయతీలను జగన్ సర్కారు నిర్వీర్యం చేసింది. కేంద్రం నుంచి వచ్చే నిధులను సుమారు రూ.9 వేల కోట్లను లాక్కున్నారు. వట్టిపోయిన పంచాయతీల్లో నిధుల్లేక మౌలిక సదుపాయాల కల్పన కొరత ఏర్పడింది. ఇప్పటికీ టీడీపీ హాయంలో వేసిన సీసీ రోడ్లు, మురుగు కాలవలే ఉన్నాయి. ఈ ప్రభుత్వం గ్రామాలను మురికి కూపాలుగా మార్చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పూర్తి చేసుకొని మంగళవారం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సరిహద్దులోని లక్ష్మీపురం, నూజెండ్ల, గుర్రపు నాయుడు పాలెం గ్రామస్తులు లోకేష్‌ను కలిసి గ్రామాల్లో తాగునీరు, పారిశుద్యం, రోడ్ల స్థితిగతుల గురించి వివరించారు.
పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలతోపాటు కరెంటు చార్జీలు షాక్ కొడుతున్నాయని చెప్పారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ టీడీపీ అధికారానికి కరెంటు చార్జీలతోపాటు ఆయిల్ రేట్లు తగ్గిస్తామని హామీనిచ్చారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతీ గ్రామానికి తాగునీరందిస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా నుంచి వినుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న చోట లోకేష్‌కు ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వినుకొండ ఇన్చార్జి జీవీ ఆంజనేయులు, సత్తెనపల్లి ఇన్చార్జి కన్నా లక్ష్మీ నారాయణ, మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ నరేంద్ర, జూలకంటి బ్రహ్మారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావుతోపాటు పలువురు టీడీపీ సీనియర్ నేతలు లోకేష్‌ను సాదరంగా ఆహ్వానించారు.