ఇంకా ఆ సంబంధాలు ఎక్కడ ఉంటాయి.. వైఎస్ ఫ్యామిలీపై మంత్రి బొత్స హాట్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్‌లో అన్నాచెల్లెళ్ల రాజకీయం రసవత్తరంగా మారింది.

Update: 2024-04-26 10:48 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అన్నాచెల్లెళ్ల రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్న వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో తన సొంత చెల్లి వైఎస్ షర్మిల బట్టలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పసుపు చీర కట్టుకుని చంద్రబాబు దగ్గరికి వెళ్లి మోకరిల్లుతుంది ఆయన పేర్కొన్నారు.

అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సొంత చెల్లి బట్టలపై బహిరంగ సభలో ప్రస్తావించడం ఏంటని పలువురు నెటిజన్స్ ఆయనపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. మీ అమ్మ విజయమ్మ కూడా పసుపు చీర కట్టుకుంటే ఇలానే మాట్లాడతారా.. ? అని నిలదీస్తున్నారు. ఇక ఇదే విషయంపై నిన్న వైఎస్ షర్మిల స్పందించారు. పసుపు చీర కట్టుకుంటే తప్పేంటి..? పసుపు పైన చంద్రబాబు నాయుడుకి ఏమైనా పేటెంట్ రైట్ ఉందా? పచ్చ కలర్‌ను ఆయన కొనుక్కున్నారా? అని ప్రశ్నించారు.

పసుపు అంటే మంగళకరమని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అన్నారని, అందుకే మొదట్లో సాక్షి టీవి కూడా పసుపు రంగులోనే ఉండేది, ఆ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారా..? అసలు మంత్రి స్థానంలో ఉండి చెల్లి చీరపై బహిరంగ సభలో మాట్లాడారంటే.. ఇంతకంటే దిగజారి పోవడం ఇంకొకటి ఉందా.. అసలు జగన్మోహన్ రెడ్డికి సంస్కారం ఉందా అని ఆమె దుయ్యబట్టారు.

తాజాగా ఈ అన్నాచెల్లెళ్ల గొడవపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల నిన్నటి వరకే సీఎం చెల్లి అని అన్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల ప్రత్యర్థి పార్టీ నాయకురాలు అలాంటప్పుడు.. అన్నాచెల్లెల్ల సంబంధాలు ఎలా ఉంటాయి అని ప్రశ్నించారు. ఓ వ్యక్తిపై విమర్శలు చేసేటప్పుడు ఆమె సంయమనం పాటించాలని షర్మిలకు సూచించారు.జగన్మోహన్ రెడ్డి తలకు పెట్టుకున్న బ్యాండేజ్ ఎప్పుడు తీయాలో డాక్టర్ చూసుకుంటారని మంత్రి బొత్స  షర్మిలకు చురకలు అంటించారు. 

Tags:    

Similar News