మరో రికార్డుకు అడుగు దూరంలో Aam Aadmi Party!
గుజరాత్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు చేదు జ్ఞాపకంగా మారబోతుంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఓ మధురానుభూతిని ఇవ్వబోతోందా?
దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు చేదు జ్ఞాపకంగా మారబోతుంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఓ మధురానుభూతిని ఇవ్వబోతోందా? వెలువడుతున్న ఫలితాలతో ఆ పార్టీలో అప్పుడే సంబురాలు మొదలు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంపొందిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి మొదలైన ఆమ్ ఆద్మీ రాజకీయ ప్రస్థానం గోవా, పంజాబ్ నుంచి గుజరాత్ వైపు చేరింది. గుజరాత్ ఎన్నికల్లో అధికార బీజేపీ తర్వాత ఆ మేరకు కేజ్రీవాల్ పార్టీపైనే చర్చ జరిగింది. అయితే, తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆ పార్టీ చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపడంలో చతికిలపడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓ అంశంలో మాత్రం ఆమ్ ఆద్మీకి కలిసి రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. గుజరాత్ ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ జాతీయ పార్టీ హోదా సాధించబోతోందనే ధీమా ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ఢిల్లీ, పంజాబ్, గోవాలలో ఇప్పటికే రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన ఆమ్ ఆద్మీ.. గుజరాత్ లోనూ ఆ హోదా సాధిస్తుందని, తద్వారా తమ పార్టీ జాతీహోదా కలిగిన పార్టీగా అవతరించబోతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గురువారం ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ప్రకారం గుజరాత్ లో బీజేపీ 154, కాంగ్రెస్ 19 ఆమ్ ఆద్మీ 6 స్థానాల్లో లీడ్ లో ఉంది. అయితే ఆప్ జాతీయ పార్టీగా అవతరించాలంటే గుజరాత్‌లో కనీసం రెండు సీట్లు గెలవడంతో పాటు అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆరు స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతునప్పటికీ చివరి వరకు ఏం జరగబోతోందనేది ఉత్కంఠగానే ఉంది. ఆప్‌ను జాతీయ పార్టీ దిశగా తీసుకువెళ్లడంపై గత కొంత కాలంగా కేజ్రీవాల్ తీవ్ర కసరత్తే చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీగా అతి త్వరలోనే అవతరిస్తుందని కేజ్రీవాల్ గతంలోనే ప్రకటించారు. ఈ మేరకు ఈ ఘనత సాధించేందుకు మరో అడుగు దూరమే మిగిలి ఉండటంతో ఎలాంటి పరిణామం చోటు చేసుకోబోతోందనేది ఆసక్తిని రేపుతోంది.
కాంగ్రెస్‌కు బ్యాడ్ న్యూస్:
ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీగా అవతరిస్తే ఆ పరిణామం ఏ పార్టీకి నష్టం చేకూర్చనుందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఆమ్ ఆద్మీ ఎంట్రీ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చుతోందని గుజరాత్, పంజాబ్‌తో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీనే కాంగ్రెస్ ఓట్లను పెద్ద ఎత్తున చీల్చగలిగిందనే అభిప్రాయాలు వినిపించాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోయే సార్వత్రిక ఎన్నికలపై ఉంటుంది. కాంగ్రెస్ లంచ్‌ను ఆమ్ ఆద్మీ ఆరగిస్తోందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గుజరాత్‌లో ఈ ప్రయత్నం గట్టిగానే జరిగిందనే వాదన కూడా ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌ను దాటి ఆమ్ ఆద్మీ ముందుకు వెళ్లలేకపోయినా ఆపార్టీకి చేయాల్సినంత డ్యామేజ్ చేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ ఇదే దూకుడు కనపరిస్తే ఎలా అనేది చర్చగా మారింది. ప్రాంతీయ పార్టీగా ఉంటూనే తమకు తీరని నష్టం మిగుల్చుతున్న ఆమ్ ఆద్మీ ఇక జాతీయ పార్టీగా అవతరిస్తే అది ఆ ఎఫెక్ట్ తమ ఓట్లను చీల్చడంపై భారీగా పడే అవకాశాలు ఉంటాయనే చర్చ హస్తం పార్టీలో జరుగుతోంది. ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమిలో ఆమ్ ఆద్మీ కీలకం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో ఇది కాంగ్రెస్, కేజ్రీవాల్ మధ్య వర్గపోరుకు దారి తీసి చివరకు బీజేపీకే అనుకూలించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.