ముఖ్యమంత్రి పదవి కోల్పోనున్న కేసీఆర్.. జాతీయ పార్టీతో కొత్త చిక్కులు!
జాతీయ రాజకీయాలు సీఎం కేసీఆర్‌కు అనేక సవాళ్లను తీసుకొస్తున్నాయి. టీఆర్ఎస్ కాకుండా కొత్తగా జాతీయ పార్టీ పెడితే ఆయన సీఎం పదవిని కోల్పోయే చాన్స్ ఉంది.
దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రాజకీయాలు సీఎం కేసీఆర్‌కు అనేక సవాళ్లను తీసుకొస్తున్నాయి. టీఆర్ఎస్ కాకుండా కొత్తగా జాతీయ పార్టీ పెడితే ఆయన సీఎం పదవిని కోల్పోయే చాన్స్ ఉంది. శాసనసభా పక్ష నేతగానూ అవకాశం కోల్పోతారు. ఆయన స్థానంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడటం కోసం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ లేదా మరో పేరుకు మార్చుకోవడం ఉత్తమమైన మార్గంగా కనిపిస్తున్నది. లీగల్‌గా, రాజ్యాంగపరమైన చిక్కులు లేకుండా యథాతథంగా సీఎంగా కేసీఆర్ కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఇదొక్కటే ఆయనకు సేఫ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండింటిలో టీఆర్ఎస్ అధినేత తీసుకునే ఏ నిర్ణయం తీసుకున్నా ఇకపైన రాష్ట్ర అసెంబ్లీలోనూ కొన్ని మార్పులు అనివార్యం కానున్నాయి. టీఆర్ఎస్ పేరుకు బదులుగా బీఆర్ఎస్ లేదా మరో పేరు పెడితే అసెంబ్లీ రికార్డుల్లో దానికి అనుగుణమైన మార్పులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టీఆర్ఎస్‌ను ఇలా కొనసాగిస్తూనే కొత్తగా జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తే రాజ్యాంగపరమైన చిక్కులు ఎదురవుతాయి. ఇన్ని చర్చల నడుమ దసరా పండుగ రోజున పార్టీ అధినేత కేసీఆర్ వెలువరించే ప్రకటన కీలకంగా కానున్నది.
ఆయన తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా అసెంబ్లీ సెక్రటరీ తగిన సవరణలు చేయాలి. తదుపరి అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ సరికొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే ఇలాంటి లీగల్, రాజ్యాంగపరమైన అంశాలపై కేసీఆర్.. గతంలో స్పీకర్‌గా పనిచేసిన మధుసూదనాచారి, న్యాయవాద అంశాలపై అవగాహన ఉన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ లోతుగా చర్చించారు. రాజ్యాంగ అంశాలపై సమగ్రమైన పట్టు ఉన్న రిటైర్డ్ బ్యూరోక్రాట్లతోనూ చర్చలు జరిపారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నందున భవిష్యత్తులో రాబోయే చిక్కులు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలపై ఢిల్లీ స్థాయిలోనూ అధికారులతో సీఎం చర్చించినట్టు తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా అభిప్రాయాలను సేకరించినట్టు సమాచారం. ఇప్పుడు అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న సెటప్ యథాతథంగా కొనసాగాలంటే తీసుకోవాల్సిన చర్యలపైనా అధ్యయనం చేశారు.
కొత్త పార్టీతో చిక్కులు
టీఆర్ఎస్ పేరును మార్చడానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందితే దానికి అనుగుణంగా అసెంబ్లీలోనూ తగిన మార్పులు చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతో, ఆ పార్టీ గుర్తుపై పోటీచేసి గెలిచినందున అసెంబ్లీ రికార్డుల్లో అదే కొనసాగుతున్నది. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. ఈ కారణంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చే సర్క్యులర్ (నోటిఫికేషన్)కు అనుగుణంగా అసెంబ్లీ రికార్డుల్లో టీఆర్ఎస్ స్థానంలో కొత్త పేరు ఉనికిలోకి వస్తుంది. ఇకపైన సమావేశాల్లో కొత్త పేరు కలిగిన పార్టీ నేతగానే సీఎంను, ఆ పార్టీ ఎమ్మెల్యేలను పరిగణించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి కూడా స్పష్టమైన నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ పేరును మార్చడానికి బదులుగా అదనంగా కొత్త పార్టీని ఉనికిలోకి తీసుకొస్తే రాజ్యాంగపరమైన చిక్కులు అనివార్యమవుతాయి. ప్రజలు ఓటు వేసి గెలిపించి అధికారంలో కొనసాగడానికి ఐదేండ్ల మ్యాండేటరీ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ తరఫున అయినందున.. కొత్త పార్టీని స్థాపిస్తే దానికి అసెంబ్లీలో గుర్తింపు ఉండదు. కొత్త పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడైతే ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ తరఫున 'లీడర్ ఆఫ్ ది హౌజ్'గా ఆయన ఎన్నిక ప్రశ్నార్థకమవుతుంది. టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాన్ని, సీఎం పదవిని ఆయన కోల్పోవాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి మరో లీడర్‌ను (సీఎం) ఎన్నుకోవాల్సి ఉంటుంది.
పదవిని వదులుకుంటారా?
రాష్ట్రానికి కేటీఆర్, దేశానికి కేసీఆర్ అనే కామెంట్లు వినిపిస్తున్నా వాటిని పార్టీ నేతలే కొట్టిపారేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం పదవిని కేసీఆర్ వదులుకోరు అని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. కేటీఆర్ సీఎం అయ్యేది లేదని, తానే కొనసాగుతానని కేసీఆర్ స్వయంగా పలు సందర్భాల్లో కేసీఆర్ చెప్పారు. మరో వైపు మళ్లీ సీఎం కేసీఆరేనని, దక్షిణాదిన హ్యాట్రిక్ సీఎంగా ఆయన రికార్డు సృష్టిస్తారని కేసీఆర్ సైతం వ్యాఖ్యానించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే టీఆర్ఎస్‌కు అదనంగా కొత్త పార్టీని స్థాపించే అవకాశాలు తక్కువే. టీఆర్ఎస్ పార్టీ పేరు మాత్రమే మారుతున్నందున ప్రస్తుతం ఉన్న కామన్ సింబల్, స్టేట్ రికగ్నిషన్ యధావిధిగా కొనసాగుతాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, అసెంబ్లీ రూల్స్, రాజ్యాంగపరమైన ప్రొవిజన్స్ ఏం చెబుతున్నాయనే దానిపై ఇప్పటికే కసరత్తు జరిగినా నిపుణుల అభిప్రాయాలను కూడా అధినేత కేసీఆర్ సేకరిస్తున్నారు. గతంలో అన్నాడీఎంకే పార్టీ అఖిల భారత అన్నాడీఎంకేగాను, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్‌గానూ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌గా మారినప్పుడు చోటుచేసుకున్న పరిణామాలపై ఇప్పటికే అధ్యయనం చేశారు. పేరు మార్పుపై ఎలక్షన్ కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవడం మొదలు అక్కడ ఆమోదం పొంది నోటిఫికేషన్ వెలువడడం, దాని తర్వాత అసెంబ్లీ సెక్రటరీ తదనుగుణమైన మార్పులు చేయడం, ఇక్కడ నోటిఫికేషన్ జారీ కావడం.. ఈ మొత్తం ప్రక్రియను పట్టే సమయం తర్వాత లాంఛనంగా అసెంబ్లీ రికార్డుల్లో మార్పులు చేర్పులు ఫైనల్ కానున్నాయి. మరి సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: కాంగ్రెస్‌లో జోడో యాత్ర టెన్షన్... ఇంకా ఫైనల్ కాని రూట్ మ్యాప్