పాలమూరు ప్రాజెక్ట్ అవినీతిపై కేసీఆర్ తేలు కుట్టిన దొంగలా మారాడు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని అది బయటపడడంతో కేసీఆర్ ప్రస్తుతం తేలు కుట్టిన దొంగలాగా మారిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.

Update: 2023-05-27 12:14 GMT

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ / బిజినపల్లి: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని అది బయటపడడంతో కేసీఆర్ ప్రస్తుతం తేలు కుట్టిన దొంగలాగా మారిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 73వ రోజు సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రెండో ప్యాకేజీ వెంకటాద్రి రిజర్వాయర్ ను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల, శ్రీశైలం, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుల పరిధిలోని తెలంగాణలో సొంత రాష్ట్రం రాకముందే 95 లక్షల ఎకరాలకు సాగునీరు అందెదన్నారు. కృష్ణ నీటిని ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి నల్గొండ ప్రాంతాలకు తరలించాలన్న ఉద్దేశంతో గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల నుంచి పాలమూరు ప్రాజెక్టు రూపకల్పనకు జీవో విడుదల చేసిందన్నారు.

కానీ దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం కాంట్రాక్టర్లు జేబులు నింపేందుకు దిగువ ప్రాంతమైన శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎగువ ప్రాంతానికి నీరు తీసుకొచ్చేలా పాలమూరు డిజైన్ మార్చారని తద్వారా లక్షల కోట్ల రూపాయలను ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే మోటార్ల కొనుగోళ్లలోనే 56 వేల కోట్ల అవినీతి జరిగిందని పూర్తి సాక్షాధారాలతో సహా కోర్టు ముందు ఉంచడంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ తేలు కుట్టిన దొంగలాగా మారారని ఆరోపించారు. కేవలం మూడున్నర ఏళ్లలో కూర్చి వేసుకోనైనా కూర్చొని పాలమూరు నిర్మించి తీరుతానని 35 కోట్లతో ప్రారంభించి పదేళ్లైనా 10 శాతం కూడా పూర్తి చేయలేదన్నారు. ప్రాజెక్ట్ వ్యయాన్ని కూడా పెంచేశారని పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఆ నిధులన్నీ స్వాహా చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెండోసారి అధికారం కట్టబెడితే నాలుగేళ్లయిన ఇరిగేషన్ శాఖకు మంత్రి, ఈఎన్సి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎవరూ లేరని కేవలం పర్సనల్ సెక్రెటరీ మాత్రమే హెలికాప్టర్ ఎక్కి తిరగడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నల్లమట్టి జనార్దన్ రెడ్డిగా పేరు గాంచాడంటే ఈ ప్రాంతంలో చెరువులు కుంటల్లో నల్లమట్టి ఏ స్థాయిలో లూటీ చేశారో అర్థం చేసుకోవాలన్నారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఎన్ని చెరువుల్లో ఎంత మేర నల్లమట్టి తవ్వారు ఎక్కడ వాడుతున్నారు అన్న వివరాలు తెలపాలన్నారు. ఎమ్మెల్యే మర్రి పాలమూరు ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు పీఆర్ఓగా లేదా సలహాదారునిగా, టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారో చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కల్లు దందా, ఇసుక దందా, భూమాఫియా, ధరణి దందా ఇలా చివరికి గ్రామాల్లో ఉన్న బొందల గడ్డను కూడా కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.

పేద ప్రజల కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా లాక్కొని కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రిజర్వాయర్ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర చేస్తున్న క్రమంలో పెంటయ్య, భాగ్యమ్మ, మణెమ్మ అనే రైతులు ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయామని ప్రభుత్వం మాత్రం కొంత నగదు చేత పెట్టిందని ఆ డబ్బుతో ఇతర ప్రాంతాల్లో సెంటు భూమి కూడా రావడంలేదని రైతులు బోరున విలపించారని తెలిపారు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని మండిపడ్డారు. గట్టిగా ప్రశ్నించిన వారిపై పీక పైన కాలు పెట్టి తొక్కే సంస్కృతి ఈ రాష్ట్రంలో గల్లి గల్లికి పాకిందన్నారు. అయినా సరే ఎవరు భయపడొద్దని కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని అధికారులు పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పెన్షన్ దారులు రైతులు నిరుద్యోగులు పాత్రికేయులు సైతం భయాన్ని వీడి ముందుకు రావాలన్నారు. ప్రతి చిన్నదానికి ప్రతిపక్షాలు కోర్టు మెట్లు ఎక్కుతున్నాయని వచ్చిన ఆరోపణలకు స్పందిస్తూ ప్రజాస్వామ్య దేశంలో అన్యాయం జరిగితే చివరికి వెళ్ళేది కోర్టుల వద్దకేనని న్యాయస్థానాలను బ్యాన్ చేయగలిగితే ఎవరు కోర్టుకు వెళ్ళరని ఎద్దేవా చేశారు.

దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా ఈఎన్సి స్పందించి పాలమూరు ప్రాజెక్టును ఆపాలనుకున్నది ఎవరో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు నిర్మించాలన్న ఉద్దేశం లేదని కోర్టుకు వెళ్లేలా వ్యవహరిస్తూ కోర్టుకు వెళ్లిన వారిపై బురద చల్లడం అలవాటైందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో నిర్మించిన ఏ ఒక్క ప్రాజెక్టు సెంటు భూమికి కూడా సాగునీరు ఇవ్వడం లేదన్నారు. ముందుగా కృష్ణ నీటి వాటా అంశాన్ని తేల్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. పాలమూరు ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టుగా చెబుతూ కోర్టుకు మాత్రం తాగునీరు ప్రాజెక్టుగా ఆఫిడవిట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు, కాలేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా అడిగే ధైర్యం కూడా చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి, డిసిసి అధ్యక్షులు వంశీకృష్ణ, జడ్పిటిసిలు రోహిణి, సుమిత్ర, డిసిసి ప్రధాన కార్యదర్శి అర్థం రవి, జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడిదల రాము, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Tags:    

Similar News