కేంద్రం నిధులను దారి మళ్లించిన కేసీఆర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి
పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ఇండ్లు నిర్మించేందుకు నిధులు ఇస్తే దారి మళ్లించిన ఘనుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
దిశ, కూకట్పల్లి: పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ఇండ్లు నిర్మించేందుకు నిధులు ఇస్తే దారి మళ్లించిన ఘనుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జి మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో మూసాపేట్ సర్కిల్ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన 24 గంటల ఆత్మ గౌరవ దీక్ష కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ బీజేపీ చీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కొత్త రాష్ట్రంలో పేదలకు సొంతింటి కలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద నిధులు కేటాయించింది. రెండు లక్షల మంది పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర ప్రభుత్వం సూచిస్తే కేసీఆర్ ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి, కొడుకు, కోడలు ఎక్కడ పడుకోవాలంటూ పిట్ట కథలు చెబుతూ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తానని గొప్పలు చెప్పి కేంద్రం ఇచ్చిన నిధులను డైవర్ట్ చేశారని, పేదలకు ఇప్పటికి ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో, కేటాయిండంలో విఫలం అయ్యారని ఆరోపించారు. కొన్ని చోట్ల కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లు నాణ్యత పాటించక పోవడంతో చేతి గోర్లతో గిల్లితే గోడలు కూలి పోయే విధంగా ఉన్నాయని అన్నారు.
తండ్రిని మించిన తనయుడు ట్విట్టర్ టిల్లు కేటీఆర్ అని అన్నారు. కేంద్రం కేటాయించిన నిధులు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఎన్ని ఇండ్లు నిర్మించారు, ఎంత మందికి కేటాయించారు అంటూ కేంద్ర మంత్రి లేఖ రాసినా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదని అన్నారు. నిధులను డైవర్ట్ చేసిన మూర్ఖుడు, పేదల ద్రోహి కేసీఆర్ అంటు తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబానికి వ్యాపారాలు చేసుకోవాడనాకి, దోచు కోవడానికి, బ్యాంకులలో దాచుకోవడానికి పైసలు ఉంటాయి కాని పేద ప్రజల కోసం పైసలుండవని అన్నారు.
దోచుకునే వారి చేతులో పెట్టడానికేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది, 14 వందల మంది బలిదానం చేసుకుంది నేటి తెలంగాణను చూడటానికా అంటు ప్రశ్నించారు. బీజేపీ ఆధ్వర్యంలో పేదల సమస్యలు, పోడు భూములు, నిరుద్యోగుల సమస్యలు, రైతుల సమస్యలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం ఆందోళనలు చేస్తుంటుందని అన్నారు. రానున్న ఎన్నికలలో మోసం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని, రామరాజ్యాన్ని, పేదల రాజ్యాన్ని తీసుకు వచ్చే బీజేపీ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచితంగా పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, టీటీడీ సలహా మండలి సభ్యుడు, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డెపల్లి రాజేశ్వర్ రావు, కార్పొరేటర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.