AP Politics: పునర్నిర్మాణమే దిక్కు.. లేకుంటే పార్టీ కనుమరుగే..
ఒకప్పుడు జగన్ దర్శనమంటే ఆ పార్టీ నాయకులు ఎగిరి గంతేసే వారు.
దిశ, ఏపీ బ్యూరో: ఒకప్పుడు జగన్ దర్శనమంటే ఆ పార్టీ నాయకులు ఎగిరి గంతేసే వారు. ఇప్పుడు బొట్టు పెట్టి మరీ పార్టీ మీటింగ్ఉందని పిలిచినా కొందరు నేతలు స్పందించలేదు. మరికొందరు ఇతర సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఇంకొందరు కాడి దించేసి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ దుస్థితికి కారణం జగనేనంటూ ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఘోర ఓటమిపై జగన్ ఆత్మపరిశీలన చేసుకుంటారా? కింది నుంచి మళ్లీ పార్టీ పునర్నిర్మాణం జరిగితేనే ఆ పార్టీకి భవిష్యత్తు అంటూ పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాల్లేవ్..
గత ఎన్నికల ముందు వరకూ క్షేత్ర స్థాయి నుంచి వైసీపీ బలమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో విజయవంతం చేసేది. అప్పట్లోనే జగన్‌పై విపరీతమైన క్రేజ్ ఉండేది. పార్టీ అధికారానికి వస్తే తమ కష్టాలన్నీ తీరతాయని కార్యకర్తలు గంపెడాశ పెట్టుకున్నారు. పార్టీ కోసం ఆస్తులు హారతి కర్పూరమైనా అధికారానికి వస్తే చాలన్నంత త్యాగ నిరతిని ప్రదర్శించారు. జగన్ ముఖ్యమంత్రి పీఠమెక్కిన రోజు నుంచి 2024 ఎన్నికల దాకా ఏనాడూ కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాల్లేవు.
వలంటీర్లు, పోలీసులతోనే పాలన..
వైసీపీ 2019లో అధికారానికి వచ్చాక జగన్జనానికి దూరమయ్యారు. కేవలం వలంటీర్లు, సచివాలయాలు, కలెక్టర్లు, పోలీసులతోనే పాలన సాగించారు. సంక్షేమ పథకాలు ఒక్కటే మళ్లీ తనను అధికారానికి తెస్తాయని భ్రమించారు. అంతకుముందు వరకూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలను గాలికొదిలేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వాళ్లను పట్టించుకోలేదు. అసలు పార్టీ యంత్రాంగానికి ఓ పనంటూ లేకుండా చేశారు. కేవలం జగన్ కోటరీలో ఉన్నోళ్లే బాగుపడ్డారని పార్టీ క్యాడర్ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోంది. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం పార్టీ యంత్రాంగాన్ని సొంతం చేసుకోలేకపోవడమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
మళ్లీ మరో ఓదార్పు యాత్రతో జనంలోకి..
ఇప్పుడు మళ్లీ జగన్జనంలోకి వెళ్లేందుకు ఓ కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నారు. అధికార టీడీపీ దాడులకు గురైన కుటుంబాల ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ఇదొక్కటే చాలదు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలపై గళమెత్తే వాళ్లను తయారు చేసుకోవాలి. బూతుల్లేకుండా విషయ పరిజ్ఞానంతో మాట్లాడగలిగే వాళ్లను ఏర్పాటు చేసుకోవాలి. మళ్లీ ఉద్యమ స్వభావాన్ని సంతరించుకునేట్లు పార్టీకి రూపురేఖలు మార్చేయాలి. ప్రాంతీయ పార్టీ అయినా అంతర్గత ప్రజాస్వామ్యానికి అవకాశమివ్వాలి. అప్పుడే వైసీపీ తిరిగి మనుగడలోకి రావడానికి అవకాశముందని పలువురు విశ్లేషిస్తున్నారు.