Gujarat Election Result 2022 కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టిన ఉద్యమ నేత.. ఫలించిన BJP ఎత్తుగడ..!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ విఫలం అయింది. జాతీయ స్థాయిలో ఆ పార్టీ అనేక సమస్యలతో సతమతం అవుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ విఫలం అయింది. జాతీయ స్థాయిలో ఆ పార్టీ అనేక సమస్యలతో సతమతం అవుతోంది. మోడీ మేనియాను తట్టుకుని ముందుకు రావడం ఆ పార్టీకి సమస్యగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ మరింత వీక్ అయింది. అయితే కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే విషయంలో మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీజేపీ పార్టీ గెలుపుకు ఈ సారికూడా కులం కార్డుతో పాటు హర్థిక్ పటేల్ మంత్రాంగం కలిసి వచ్చినట్టు చర్చ జరుగుతోంది. గుజరాత్ జనాభాలో పాటిదార్ల సంఖ్య సుమారు 15 శాతం. 1990 నుంచి పాటీదార్లు బీజేపీకి మద్దతుగా ఉంటున్నప్పటికీ 2015లో హార్ధిక్ పటేల్ సారథ్యంలో జరిగిన పాటీదార్ ఉద్యమం ఆ రాష్ట్రంలో సంచలనం అయింది.
ఆ ఉద్యమాన్ని అక్కడి బీజేపీ ప్రభుత్వం అణిచివేసింది. ఆ సయమంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో పాటీదార్ యువకులు మరణించడం పాటీదార్ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న హర్థిక్ పటేల్ కాంగ్రెస్‌లో చేరిపోవడంతో బీజేపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఉద్యమ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో పటేళ్లకు, బీజేపీకి మధ్య గ్యాప్ పెరిగింది. ఆ ప్రభావం 2017 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో పాటిదార్లంతా కాంగ్రెస్ వైపు నిలబడటంతో 2017 ఎన్నికల్లో బీజేపీ కేవలం 99 సీట్లకే పరిమితం కాగా కాంగ్రెస్ 77 సీట్లను కైవసం చేసుకోగలిగింది.
కానీ ఈ సారి పాటిదార్ల ఓట్ల ప్రాముఖ్యతను గుర్తించిన బీజేపీ ఎన్నికలకు ముందే వ్యూహత్మకంగా వ్యవహరించింది. పటేళ్ల కోపాన్ని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి విజయ్ రూపాణిని మార్చి అతడి స్థానంలో భూపేంద్ర పటేల్‌కు పగ్గాలు అప్పగించింది. ఆ తర్వాత క్రమంగా తన చక్రం తిప్పుతూ కాంగ్రెస్‌కు అండగా నిలిచిన పాటీదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్‌ను తమ వైపు తిప్పుకోగలిగింది. కాంగ్రెస్‌ను వీడిన హర్ధిక్ పటేల్ బీజేపీలో చేరడం ఆపై ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం బీజేపీకి కలిసి వచ్చిన అంశాలుగా మారాయి.
మరో వైపు గిరిజనుల ఓట్లను సైతం పోలరైజ్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇప్పటి వరకు ఆదివాసీల ఓట్లు, సీట్లు కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా సాధిస్తూ వస్తున్నా తాజా ఎన్నికల్లో వీరి ఓట్లపై పార్టీ అగ్రనాయకత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించడం, కాంగ్రెస్ నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మోహన్ సిహన్హ్ రత్వాను పార్టీలో చేర్చుకోవడం ఆయనకు గిరిజన ఓటు బ్యాంక్‌పై మంచి పట్టు ఉండటం బీజేపీకి కలిసి వచ్చింది. దానికి తోడు ఆమ్ ఆద్మీ, ఎంఐఎం చేయాల్సినంత డ్యామేజ్ చేయడం కాంగ్రెస్ పతనానికి కారణంగా మారాయి.
కాంగ్రెస్‌లో ఆ సీనియర్ నేత లేని లోటు..
గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి మరో కీలక కారణం ఆ పార్టీ వ్యూహకర్త అహ్మద్ పటేల్ మరణం. తెరవెనుక చక్రం తిప్పగలిగే సామర్థ్యం కలిగిన అహ్మద్ పటేల్ 2020 కోవిడ్ సమయంలో తలెత్తిన అనారోగ్య పరిస్థితుల కారణంగా మరణించారు. ఆయన పెద్దగా మీడియాలో కనిపించకపోయినా సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శిగా, అనేక వ్యూహరచనలు చేస్తూ పార్టీకి దన్నుగా నిలుస్తూ వచ్చారు. 2017లో పటేళ్లను బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు తిప్పుకునేలా ఆయన చేసిన వ్యూహమే పార్టీ అధిక సీట్లు గెలుచుకునేలా పని చేసింది. ఈ సారి ఆయన లేకపోవడంతో ఆ లోటు పార్టీలో స్పష్టంగా కనిపించిందనే చర్చ జరుగుతోంది. దీనికి తోటు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, యుద్ధానికి ముందే చేతులు ఎత్తేసిన చందంగా పార్టీ అగ్రనాయకత్వం తీరు అన్ని ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ఆకర్షించలేకపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.