AP News: ఎంవీవీ సేవలోనే జీవీఎంసీ కమిషనర్..

రాష్ర్టంలో ప్రభుత్వం మారినా, వైసీపీకి వ్యతిరేకంగా విశాఖ వాసులు స్పష్టమైన తీర్పు ఇచ్చినా వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తిన కొందరు అధికారుల తీరు మారడం లేదు.

Update: 2024-06-21 03:30 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ర్టంలో ప్రభుత్వం మారినా, వైసీపీకి వ్యతిరేకంగా విశాఖ వాసులు స్పష్టమైన తీర్పు ఇచ్చినా వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తిన కొందరు అధికారుల తీరు మారడం లేదు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వివాదాస్పద సిరిపురం సీబీసీఎన్‌సీ స్ధలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల వాణిజ్య భవన సముదాయానికి వాస్తు దోషం లేకుండా టైకూన్ జంక్షన్‌లో డివైడర్ పెట్టించిన జీవీఎంసీ సాయికాంత్ వర్మ ఇంకా ఆ మత్తు నుంచి బయట పడటం లేదు.

వెలగపూడి ఫిర్యాదునే పట్టించుకోరా?

అక్కడ ఎంవీవీ సత్యనారాయణ భవన నిర్మాణం కోసం జరుపుతున్న తవ్వకాలు, మైనింగ్ వల్ల తమ ఇళ్లకు, ఆరోగ్యాలకు ప్రమాదం అంటూ చుట్టుపక్కల వారు చేసిన ఫిర్యాదు మేరకు సంబంధిత విశాఖ తూర్పు శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు జీవీఎంసీకి లేఖ రాశారు. వెంటనే తవ్వకాలు, మైనింగ్ ఆపి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో ఇటువంటి ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని సాయికాంత్ వర్మ ఇప్పుడు కూడా అలాగే వ్యవహరించారు. మరీ పట్టించుకోకపోతే ఇబ్బంది అనుకుని దానిపై ఏ మాత్రం అధికారం లేని ఏసీపీతో నోటీసు ఇప్పించి మమ అనిపించారు.

సైట్ తనిఖీకీ వెళ్లలేదు..

తన నివాసం పక్కనే ఈ నిర్మాణం జరుగుతున్నా, నాలుగో సారి ఎంఎల్ఏగా ఎన్నికైన వెలగపూడి స్వయంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా కనీసం సైట్ తనిఖీకి కూడా కమీషనర్ వెళ్లలేదు. కింది వారిని పంపలేదు. ఏదీ చేయకపోతే బాగోదని, నోటీసు ఇచ్చే అధికారం లేని ఏసీపీతో నోటీసు ఇప్పించి మాయ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి నిబంధనల మేరకు కమీషనర్ నోటీసు ఇవ్వాలి. కానీ అలా చేయలేదు. తనకు వచ్చిన ఫిర్యాదుల గురించి ఫాలోఅప్ చేసే వెలగపూడి ఏమైందని పదే పదే ప్రశ్నించడంతో ఇక మరో మార్గం లేక కమీషనర్ నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.


Similar News