మోడీ భారత ప్రధాని.. బీజేపీ ప్రధాని కాదు: కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా
మోడీ భారత దేశానికి మొత్తం ప్రధాని అని బీజేపీ ప్రధాని కాదని కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా అన్నారు.
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత దేశ ప్రధాని ప్రతి చోటా గౌరవానికి అర్హుడని, ఇది మనకు గర్వకారణమని కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ ఈ నెల 22వ తేదీన అమెరికా కాంగ్రెస్ లో చారిత్రక ప్రసంగం చేయనున్నారన్న వార్తల పట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓవర్సీస్ విభాగం చైర్ పర్సన్ శామ్ పిట్రోడా ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాలోని మూడు నగరాల్లో ఆరు రోజుల పర్యటన జరుపుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో శామ్ పిట్రోడా ఉన్నారు. మోడీకి భారత ప్రధానిగానే ఆదరణ లభిస్తోందని, బీజేపీ ప్రధానిగా కాదనే విషయాన్ని గుర్తించాలన్నారు. అయితే.. బీజేపీకి చెందిన కొందరు ప్రతి విషయాన్ని ట్విస్ట్ చేసి గందరగోళానికి గురి చేస్తారని, పైగా అబద్ధాలతో వ్యక్తిగత దాడి చేసేందుకు దాన్ని ఆయుధంగా మార్చుకుంటారని చెప్పారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను ముస్లింలు స్పాన్సర్ చేస్తున్నారంటూ నీచమైన ప్రచారానికి బీజేపీ వాళ్లు దిగారని, ముస్లింలు భారత దేశ పౌరులు కాదా..? అని ప్రశ్నించారు. ఈ పర్యటనను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని, అమెరికాలో నిర్వహించే 17 కార్యక్రమాలను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు.
అమెరికాలో రాహుల్ కు విశేష ఆదరణ
రాహుల్ పర్యటన అమెరికాలోని ఎన్నారైల్లో కొత్త ఆశలు, ఉత్సాహం నింపుతున్నాయని శామ్ పిట్రోడా అన్నారు. దేశంలో చరిత్రను బీజేపీ ప్రభుత్వం వక్రీకరిస్తోందన్న విషయం తెలుసుకొని ఎన్నారైలు ఆందోళన వ్యక్తం చేశారని, ఆవర్తన పట్టికను, డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని భారత్ లోని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. రాహుల్ పర్యటనకు ప్రవాస భారతీయుల నుంచి అద్భుత స్పందన లభిస్తోందని, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ వంతు సహకారం అందించేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారని తెలిపారు. భారత ప్రజాస్వామ్యం తప్పుడు మార్గంలో వెళ్తే దానికి ప్రపంచం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పిట్రోడా అన్నారు.