కర్ణాటక ఎన్నికల ర్యాలీలో కీలక వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై సీఈసీకి ఫిర్యాదు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదని కర్నాటక ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ ర్యాలీలో సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదని కర్నాటక ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ ర్యాలీలో సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ ఉద్దేశపూర్వకంగా సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 'తుక్డే-తుక్డే' గ్యాంగ్ ఎజెండా అని, అందుకే ఇలాంటి పదాలు వాడుతున్నారని మండిపడ్డారు. ఈ దేశ వ్యతిరేక చర్యపై ఈసీ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.