విపక్షాల నయా ఫార్ములా.. వన్ సీట్ వన్ క్యాండిడేట్!
2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలనే పట్టుదలతో ప్రతిపక్షాలు ఉన్నాయి. అయితే విపక్షాల ఐక్యత అసలు సమస్యగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిహార్ సీఎం నితీష్ కుమార్ అనూహ్య ప్రతిపాదన చేసినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బుధవారం ఢిల్లీలో తన మిత్ర పక్షం ఆర్జేడీ నేతలతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని కలిసిన నితీష్ కుమార్ రాబోయే సార్వత్రిక ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలిపారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ ముందు నితీష్ కుమార్ వన్ సీట్.. వన్ క్యాండిడేట్ ఫార్ములాను ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీని ఎదుర్కోవాలంటే దేశంలో ఉన్న అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల తరపున ఒక్క అభ్యర్థే ఉండాలని నితీష్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
దీని ద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోవని, ఫలింతగా విపక్ష కూటమి గెలుపు సునాయాసం అవుతుందనే అభిప్రాయాన్ని నితీష్ వెలిబుచ్చినట్లు తెలిసింది. ఇదే సమయంలో విపక్ష కూటమిలో అనుమానాలు రేకెత్తేలా మాట్లాడిన శరద్ పవార్ కు చెక్ పెట్టేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదానీ వ్యవహారంలో జేపీసీ, మోడీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ల అంశంలో ఎన్సీపీ నేతలు శరద్ పవార్, అజిత్ పవార్ లు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ను తెరమీదకు తీసుకువచ్చి విపక్ష కూటమితో కలిసి పని చేసేలా ఆమ్ ఆద్మీ, టీఎంసీ వంటి పార్టీలను ఒప్పించే బాధ్యతలు నితీష్ కు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. నితీష్ తో భేటీకి ముందే ఖర్గే.. డీఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేతో చర్చించారు. దీంతో విపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ చేస్తున్న తాజా ప్రయత్నం ఫలిస్తుందా లేక మోడీ, అమిత్ షాల వ్యూహంతో బెడిసి కొడుతుందా అనేది ఉత్కంఠగా మారింది.