నెక్ట్స్ టార్గెట్ నాగార్జున సాగర్
నెక్ట్స్ టార్గెట్ నాగార్జున సాగర్.. దుబ్బాక, జీహెచ్ఎంసీ గెలుపు ఇచ్చిన ధీమాతో బీజేపీ ప్రణాళికలు రచిస్తుండగా, సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ దక్కించుకునే ప్లాన్‌లో టీఆర్ఎస్, గత వైభవాన్ని తెచ్చుకోవాలని కాంగ్రెస్… ఇలా ఏ పార్టీకి అదే వ్యూహరచన చేస్తున్నాయి. అధికార పార్టీ నేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటించాలనే ధోరణిలో బీజేపీ వేచి చూస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయ వేడి రాజుకుంటోంది. దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జునసాగర్ […]
నెక్ట్స్ టార్గెట్ నాగార్జున సాగర్.. దుబ్బాక, జీహెచ్ఎంసీ గెలుపు ఇచ్చిన ధీమాతో బీజేపీ ప్రణాళికలు రచిస్తుండగా, సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ దక్కించుకునే ప్లాన్‌లో టీఆర్ఎస్, గత వైభవాన్ని తెచ్చుకోవాలని కాంగ్రెస్… ఇలా ఏ పార్టీకి అదే వ్యూహరచన చేస్తున్నాయి. అధికార పార్టీ నేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటించాలనే ధోరణిలో బీజేపీ వేచి చూస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయ వేడి రాజుకుంటోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలుతో పాటే నాగార్జునసాగర్ ఉప ఎన్నికపైనా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ గెలుపు కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి. విజయావకాశాలకు అనుగుణంగా ఏ అభ్యర్థిని నిలబెట్టాలన్న దానిపై ఆలోచనలు చేస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ ఈసారి వెయిట్ అండ్ వాచ్ ధోరణితో ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారైన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది.
సామాజిక వర్గంపై దృష్టి..
ప్రతీ నియోజకవర్గంలో ఉన్నట్లుగానే నాగార్జునసాగర్ విషయంలోనూ సామాజికవర్గంపైనే పార్టీలు ఆలోచనలు చేస్తున్నాయి. రెడ్డి, యాదవ సామాజికవర్గాల ఓటర్లు ఎక్కువగా ఉండడంతో అన్ని పార్టీలూ ఈ కోవకు చెందినవారికే టికెట్లు ఇవ్వాలనుకుంటున్నాయి. అధికార పార్టీ ఈసారి నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవన్న వార్తలు వెలుగులోకి రావడంతో తేరా చిన్నపరెడ్డి, కోటిరెడ్డి లాంటివారి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సైతం జానారెడ్డి లేదా ఆయన కుమారుడిని నిలబెట్టాలనుకుంటోంది.
బీజేపీ మాత్రం ఇంకా స్పష్టమైన ఆలోచనకు రాలేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన నివేదితా రెడ్డి ఈసారి కూడా టికెట్ వస్తుందన్న ఆశతో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. గత ఎన్నికల సందర్భంగా డిపాజిట్ సైతం దక్కించుకోలేదన్న అభిప్రాయంతో ఉన్న పార్టీ ఈసారి ఆమెకు బదులుగా ఇతరులను నిలబెట్టాలన్న ఆలోచనతో ఉంది. నివేదిత భర్త శ్రీధర్‌రెడ్డి బీజేపీ నల్లగొండ జిల్లా అద్యక్షుడు అయినప్పటికీ ఆమె గెలుపుపై అనుమానాలు రావడంతో దీటైన అభ్యర్థి కోసం చూస్తోంది. ఇప్పటికే జానారెడ్డి వస్తారని ఎదురుచూసిన బీజేపీ చివరి వరకూ ఆ ప్రయత్నాలను కొనసాగించాలనుకుంటోంది. పార్టీ మారే ఉద్దేశం లేదని స్వయంగా జానారెడ్డి చెప్పినా ఏ నిమిషంలో మనసు మారుతుందోననే ఆశతో బీజేపీ ఉంది. జానారెడ్డి పార్టీలోకి వస్తే ఆయనకు లేదా ఆయన కుమారుడికిగానీ టికెట్ ఇద్దామనుకుంటోంది. ఆయన రాకపోతే యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పేరును పరిశీలించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. టీఆర్ఎస్ పార్టీ కోటిరెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో ఆయనలో తలెత్తే అసంతృప్తిని కూడా బీజేపీ క్యాష్ చేసుకోవాలనుకుంటోంది. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఆయన సేవలను నియోజక వర్గానికి ఓట్ల రూపంలో వాడుకోవాలనే ఆలోచనతో ఉంది. గతంలో పోటీ చేసిన అంజయ్య యాదవ్‌కు 30 వేల ఓట్లు వచ్చాయన్న ఉద్దేశంతో ఈసారి ఆయన పేరు పరిశీలనలో ఉందని రాష్ట్రస్థాయి బీజేపీ నాయకుడొకరు తెలిపారు.
ఎవరికి వారుగా..
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల దూకుడునే ఇక్కడ కూడా చేజిక్కించుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోరాదని, బీజేపీకి తగిన పాఠం నేర్పాలని టీఆర్ఎస్ ఇక్కడ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అవసరమైతే జిల్లాలోనే పలుకుబడి ఉన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటివారి పేర్లను కూడా టీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈసారి ఇక్కడ గెలిచితీరాలన్న పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో జానారెడ్డి స్వల్ప తేడాతో ఓడిపోయినందున ఈసారి దాన్ని భర్తీ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని, తిరిగి ఆయనకే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని భావిస్తోంది. సుదీర్ఘకాలంగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన జానారెడ్డిపై మూడు పార్టీలూ దృష్టి పెట్టాయి. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లో ఉన్నందున టీఆర్ఎస్‌లోకి లాక్కుని నిలబెట్టాలనే ఆలోచన ఆ పార్టీకి చెందిన జిల్లా నాయకుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండూ కాదని ఆయనను పార్టీ విడిచి వెళ్లకుండా కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఢిల్లీ నాయకత్వం అక్కడి నుంచి పావులు కదుపుతోంది. జానారెడ్డి కుమారుడిని రాజకీయంగా సెటిల్ చేయడంపై దృష్టి పెట్టినందున ఆయన నుంచి వచ్చే ప్రతిపాదనలపై పార్టీ అధిష్ఠానం సానుకూలంగానే స్పందించాలనుకుంటోంది. ఇదే విషయం ఆయనకు స్పష్టం కావడంతో పార్టీ మారే ఆలోచన లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.
బీజేపీ దుబ్బాక, జీహెచ్ఎంసీ గెలుపు పాలపొంగు లాంటిది మాత్రమేనని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభిప్రాయం. అందువల్ల ఈసారి ఓడించాలని ఈ రెండు పార్టీలూ కృతనిశ్చయంతో ఉన్నాయి. నాగార్జున సాగర్ గెలుపుతో మళ్లీ రాష్ట్రంలో పుంజుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని బీజేపీకి బుద్ధి చెప్పాలన్నది టీఆర్ఎస్ ఆలోచన. వీటన్నింటి నడుమ ఈసారి నాగార్జునసాగర్‌లో ముక్కోణపు పోటీ ఖాయమైంది. గెలుపుపైనే ఇప్పుడు అన్ని పార్టీల ఆసక్తి నెలకొంది.