కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సీనియర్ నేత చేతులెత్తేశారా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపుల బాట పట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలోని పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అంతా కూడా గోవా ట్రిప్‌లో ఉన్నారు. అయితే ఈ క్యాంపు రాజకీయాలకు అసలు కారణాలేంటీ..? వెనక ఉండి నడిపిస్తున్నదెవరూ అన్నదే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఏమీ తెలియదు.? […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపుల బాట పట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలోని పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అంతా కూడా గోవా ట్రిప్‌లో ఉన్నారు. అయితే ఈ క్యాంపు రాజకీయాలకు అసలు కారణాలేంటీ..? వెనక ఉండి నడిపిస్తున్నదెవరూ అన్నదే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా జరుగుతున్న చర్చ.
ఏమీ తెలియదు.?
అయితే, ఈ క్యాంపు వ్యవహారంలో తనకేం సంబంధం లేదని, వారంతా తనకు తెలియకుండానే టూర్‌కు వెళ్లిపోయారంటూ పెద్దపల్లి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక వేళ అదే నిజమైతే తన ఇలాకాలో తన పార్టీకి చెందిన వారిని కూడా ఆయన కట్టడి చేయలేకపోతున్నారా లేకపోతే పోతేపోనీ అనుకుని వదిలేశారా అన్నదే అంతుచిక్కకుండా తయారైంది. తన ప్రాంతంలో అన్నింటా పట్టు నిలుపుకుంటారన్న చరిత్ర కల్గిన ఆ నాయకుడు వారిని అలా ఎందుకు వదిలేసినట్టు? క్యాంపు రాజకీయాలు మనకు అవసరం లేదని వెనక్కి పిలిపించొచ్చుగా అని అంటున్నారు కొందరు. తన నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకునే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారని పేరున్న సదరు నాయకుడు ఈ క్యాంపు విషయంలో మాత్రం అంటీముట్టనట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.
ఆయన నియోజకవర్గంలోని జిల్లాకు చెందిన ఓ బలమైన నాయకుడు ముందుండి క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్టుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే, సదరు నాయకుడి ఒత్తిళ్లకు ఈ ముఖ్య నాయకుడు తలొగ్గాడా లేక ఆయన ప్రతిపాదనను కాదనలేకపోయారా అన్నదే అంతుచిక్కకుండా పోయింది. చరిష్మాతోనే చక్రం తిప్పగల సత్తా ఉన్న ఆ ముఖ్య నేత తన ఇలాకాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఆయనకు తెలియకుండా క్యాంపునకు వెళ్లినా ఇది క్రమశిక్షణా రాహిత్యమే అవుతుందన్న సంకేతాలను వారికి పంపించకపోవడం ఏంటన్నది మిస్టరీగానే మారిపోయింది. అయితే పార్టీ అధికారికంగా అభ్యర్థిని బరిలో నిలపలేదు కాబట్టి తాను క్యాంపు రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదని సదరు నేత సన్నిహితులతో అంటున్నట్టుగా సమాచారం.
ఆయన్ను కాదని..
ముఖ్య నేత నిర్ణయంతో సంబంధం లేకుండా ఓ జిల్లాకు చెందిన కీలక పదవిలో ఉన్న నాయకుడే ఈ క్యాంపునకు శ్రీకారం చుట్టినట్టు కాంగ్రెస్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. సదరు నేతకు సంబంధం లేకుండా టూర్లకు శ్రీకారం చుట్టడంపై ఆ పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ క్యాంపులో కూడా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా ఈ విషయంపై చర్చిస్తున్నారు. అసలు తమనెందుకు క్యాంపులకు తరలించారు.? తమ మద్దతు ఎవరికి అవసరం ఉంటుంది.? ఎవరికి ఓటు వేయాలి అన్న విషయంపై క్లారిటీ ఇవ్వకుండా టూర్లకు తిప్పుతుండటంపై అర్థం కావడం లేదని క్యాంపునకు వెళ్లిన లీడర్స్ మాట్లాడుకుంటున్నారు.
తాజాగా శనివారం నుండి ఫోన్లు కూడా వాడొద్దని, కేవలం రిసార్ట్స్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఫోన్లు వాడుకోవాలన్న కండీషన్ పెట్టడం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఆశ్యర్యానికి గురి చేస్తోంది. పైగా బయటకు టూర్లకు వెళ్లినప్పుడు క్యాంపును నిర్వహిస్తున్న వారే ప్రత్యేకంగా ఫోటోలు తీసేందుకు కొంతమందిని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ ఫోటోలను ఫిబ్రవరి 10న అందజేస్తామని అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవాలని క్యాంపు నిర్వహకులు చెప్తున్నట్టు తెలుస్తోంది. అసలు అభ్యర్థే లేని పార్టీకి క్యాంపులు పెట్టడమే విచిత్రంగా ఉందంటే చివరకు ఫోటో సెషన్స్ విషయంలోనూ కట్టడి చేస్తుండటంతో క్యాంపులో ఉన్న వారు పార్టీ పెద్దల నిర్ణయం ఎలా ఉండబోతుందన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం.
అధికార పార్టీ ప్రభావమా..?
అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభావం కారణంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను క్యాంపులకు తరలించారన్న ప్రచారం జరుగుతోంది. మొదట్లో టీఆర్ఎస్ పార్టీ రెబెల్స్‌కు అనుకూలంగా క్యాంపు ఏర్పాటు చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అసలు విషయం వేరే ఉందంటున్నారు కొందరు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన ఓ అభ్యర్థి తన గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకే క్యాంపు రాజకీయాలను ప్రారంభించారని అంటున్నవారూ లేకపోలేదు. సదరు అభ్యర్థికి సమీప బంధువు ఒకరు సెంటర్‌పాయింట్‌గా మారి ఈ సమీకరణాలు జరుపుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొని ఉన్నందున దానిని అధిగమించేందుకు ఇతర పార్టీల ఓటర్లను కూడా మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అధిష్టానం క్యాంపులకు మెజార్టీ ఓటర్లను తరలించినప్పటికీ సదరు అభ్యర్థికి నమ్మకం కుదరకపోవడం వల్లే ఈ ఎత్తుగడలకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం. ఏది ఏమైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వ్యూహాల కన్నా అతి బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయాలే కేంద్రీకృతం కావడం గమనార్హం.