పోలీసులకు చలాన్ల రూపంలో మీరెంత డబ్బు చెల్లించారో తెలిస్తే.. అవాక్కైతారు!
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా టైమ్‌లో అన్ని సెక్షన్ల ప్రజలు ఆదాయ వనరులు కోల్పోతూ ఉంటే పోలీస్ శాఖ మాత్రం వసూళ్లలో రికార్డు సృష్టించింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు చలాన్ల రూపంలో జరిమానా వసూలు చేయడం గణనీయంగా పెరిగింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏడాదిన్నర కాలంలో చలాన్ల రూపంలో రాష్ట్రంలోని ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ. 366.08 కోట్లు వసూలు చేశారు. ఇందులో ఎక్కువ భాగం సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా టైమ్‌లో అన్ని సెక్షన్ల ప్రజలు ఆదాయ వనరులు కోల్పోతూ ఉంటే పోలీస్ శాఖ మాత్రం వసూళ్లలో రికార్డు సృష్టించింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు చలాన్ల రూపంలో జరిమానా వసూలు చేయడం గణనీయంగా పెరిగింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏడాదిన్నర కాలంలో చలాన్ల రూపంలో రాష్ట్రంలోని ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ. 366.08 కోట్లు వసూలు చేశారు. ఇందులో ఎక్కువ భాగం సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసిందే. బండి ఖరీదుకంటే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు విధించిన జరిమానాలే ఎక్కువ కావడంతో ఒకరు ఏకంగా ఆ బండిని స్పాట్‌లో వదిలేసి వెళ్లిపోయాడు. ఇంకో వ్యక్తి పోలీసుల తీరుపై అసహనంతో సొంత బైక్‌కు నడిరోడ్డు మీదే నిప్పు పెట్టాడు.
మారని యూత్
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై చట్టాలు ఎంతగా హెచ్చరిస్తున్నా యూత్ మాత్రం బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు కెమెరాలతో ఫొటోలు తీసి చలాన్లు పంపుతున్నా వాహనదారులు పద్ధతి మార్చుకోవడంలేదు. కొన్ని సందర్భాల్లో నెంబర్ ప్లేట్లకు మాస్కులు వేసుకోవడమో, ఒక డిజిట్‌ను మూసేయడమో చేస్తూ చలాన్ల నుంచి తప్పించుకుంటున్నారు. కానీ,.. నిబంధనల ఉల్లంఘనను మాత్రం మార్చుకోవడంలేదు. రోడ్డు ప్రమాదాల్లో వందలమంది చనిపోతున్నా, డ్రంకెన్ డ్రైవింగ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నా యువతలో నిర్లక్ష్యం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నది. పోలీసులకు పట్టుబడకుండా, కెమెరా కంటికి చిక్కకుండా లక్షలాది వాహనాలు నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయి.
ఏడాదిన్నరలో రూ. 366 కోట్లు
గతేడాది ఏప్రిల్ నుంచి మన రాష్ట్రంలో కరోనా జాగ్రత్తలు మొదలయ్యాయి. లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటివి అమలులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రాష్ట్రం మొత్తం మీద నిబంధనలను ఉల్లంఘించినవారికి పోలీసులు చలాన్లు వేసి రూ. 366.09 కోట్లను వసూలు చేశారు. ఇందులో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 12 నెలల కాలంలో రూ. 208 కోట్లు ఉంటే, మిగిలినది ఈ ఏడాది తొమ్మిది నెలల కాలానికి సంబంధించిన రూ. 158.33 కోట్లు. అత్యధికంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రూ. 124.74 కోట్లు ఉంటే ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్‌లో రూ. 91.22 కోట్లను వసూలు చేసింది. రాచకొండ పరిధిలో ఇది రూ. 33.43 కోట్లుగా ఉన్నది. రాష్ట్రంలో అత్యంత తక్కువగా ములుగు జిల్లాలో రూ. 67 లక్షలు ఉంటే, ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలో రూ. 68.42 లక్షలుగా ఉంది.
ఎడాపెడా వసూళ్లు
ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంప్.. లాంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులతోపాటు హెల్మెట్ లేకుండా బండి నడపడం, డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎన్ని రూపాల్లో పోలీసులు జరిమానా వసూలు చేస్తున్నా ఉల్లంఘనలు ఏ మాత్రం తగ్గడంలేదు. రోడ్ల మీద వాహనాలు పెరుగుతున్నాకొద్దీ నిబంధనల ఉల్లంఘన కూడా పెరుగుతూనే ఉన్నది. ట్రాఫిక్ పోలీసులు సైతం గతంలో ఎలా వ్యవహరించినా కరోనా తర్వాత మాత్రం తనిఖీల జోరు పెంచారు. వేలాది బైక్‌లను, కార్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పార్కింగ్ చేయడానికి స్థలంలేక వేలం ద్వారా అమ్మేస్తున్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు ఎంతగా అవగాహన కలిగించినా ఉల్లంఘనలు మాత్రమే కొనసాగుతూనే ఉన్నాయి.
డ్రంకెన్ డ్రైవింగ్‌తో రూ. 165 కోట్ల ఫైన్
హైదరాబాద్ నగరంలో డ్రంకెన్ డ్రైవింగ్ ఎంతటి బీభత్సం సృష్టిస్తున్నా మందు బాబుల్లో చలనం రావడంలేదు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ద్వారా యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. ప్రాణనష్టమూ జరుగుతున్నది. అయినా డ్రంకెన్ డ్రైవింగ్ తగ్గడంలేదు. పోలీసులు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఫైన్‌లు వసూలు చేస్తున్నారు. కరోనా టైమ్‌లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొంతకాలం బంద్ అయ్యాయి. అయినా ఆ తర్వాత మొదలుపెట్టిన తనిఖీలతో భారీ స్థాయిలోనే ఫైన్‌లను వసూలు చేశారు. ఎక్కువగా రాజేంద్రనగర్, మియాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, శంషాబాద్ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. 2018-20 మధ్యకాలంలో మొత్తం సుమారు 45 వేల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ద్వారా ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 20 నెలల కాలంలో ఏకంగా రూ. 165 కోట్లను కేవలం డ్రంకెన్ డ్రైవింగ్ రూపంలో వసూలు చేసింది. ఇందులో కార్ల ద్వారా రూ. 99.76 కోట్లు వసూలు చేస్తే, బైక్‌ల ద్వారా రూ. 50.68 కోట్లను వసూలు చేసింది.
హెల్మెట్ ఉల్లంఘన కేసులూ ఎక్కువే
హైదరాబాద్ నగరంలో హెల్మెట్ సహా పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులు ఎప్పటి నుంచో కేసులు నమోదు చేస్తున్నా కరోనా తర్వాత మాత్రమే యాక్టివిటీ బాగా పెరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది మార్చి వరకు హెల్మెట్ లేని కేసులు కేవలం 2,714 మాత్రమే నమోదయ్యాయి. వీటి ద్వారా రూ. 2.71 లక్షల రూపాయలనే ట్రాఫిక్ పోలీసులు వసూలు చేశారు. కానీ కరోనా తర్వాత లాక్‌డౌన్ మొదలుకావడంతో ఒక్కసారిగా తనిఖీలు, జరిమానాలు పెరిగిపోయాయి. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు హైదరాబాద్ పరిధిలో మొత్తం సుమారు 9.57 లక్షల హెల్మెట్ ఉల్లంఘన కేసులు నమోదుకాగా వాటి ద్వారా రూ. 12.84 కోట్లను వసూలు చేశారు. సైబరాబాద్ పరిధిలో ఇది ఏకంగా రూ. 85.47 కోట్లు కావడం గమనార్హం.