కొంటె పనులు చేస్తే కొరడా తప్పదు
దిశ, నర్సంపేట టౌన్: రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల కార్యక్రమం వాహన దారులకు అవగాహన కల్పిస్తూ, నియమాలు పాటించేలా చేస్తున్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరిస్తూ పత్రాలు తప్పనిసరిగా కలిగిఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వాహనాల తనిఖీలు చేపడుతున్న అధికారులు రోజంతా ప్రత్యేక కార్యాచరణ నేపథ్యంలో కెమెరాతో జాగ్రత్తలు పాటించని వాహన దారులను బంధించి, అనంతరం జరిమానాలు విధిస్తున్నారు. కొంతమంది వాహన […]
దిశ, నర్సంపేట టౌన్: రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల కార్యక్రమం వాహన దారులకు అవగాహన కల్పిస్తూ, నియమాలు పాటించేలా చేస్తున్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరిస్తూ పత్రాలు తప్పనిసరిగా కలిగిఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వాహనాల తనిఖీలు చేపడుతున్న అధికారులు రోజంతా ప్రత్యేక కార్యాచరణ నేపథ్యంలో కెమెరాతో జాగ్రత్తలు పాటించని వాహన దారులను బంధించి, అనంతరం జరిమానాలు విధిస్తున్నారు. కొంతమంది వాహన దారులు నియమాలు పాటించకపోవడమే కాక తప్పించుకోవడం కోసం అతి వేగంగా వెళ్లడం, పోలీసుల కెమెరా కంట పడకుండా వాహనం నెంబర్ ప్లేట్ తొలగించి తిరుగుతున్నారు. ఇటువంటి వారి పట్ల పోలీసులు కొరడా ఝులుపుతున్నారు. జరిమానాల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వాహనదారులు ఆలోచన పడడంతో హెల్మెట్ ఉపయోగం పెరిగిపోయింది. చాలామందిలో జరిమానా కన్నా హెల్మెట్ మంచిదని ఓ అవగాహనకు వచ్చారు.
ప్రత్యేక తనిఖీల మూలంగా కొంతమేర ప్రమాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రెండు సంవత్సరాల నుండి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ లాంటి వ్యాధుల నుండి ప్రాథమిక రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మాస్క్ వాడకాన్ని తప్పనిసరి చేసిన నేపథ్యంలో పోలీసుల ప్రత్యేక తనిఖీ మూలంగా ప్రతి ఒక్కరూ మాస్కును ధరిస్తున్నారు. ”మాస్క్ కు 10 రూపాయలు, జరిమానా 1000 రూపాయల అనేది తెలుసుకోవాలని’, ‘ఫోన్ స్క్రీన్ గార్డ్ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తాం కానీ, కుటుంబ రక్షణకు వెయ్యి రూపాయల హెల్మెట్ అవసరం” లాంటివి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యేక తనిఖీల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గి, ప్రజలలో సామాజిక రక్షణ విషయంలో అవగాహన వస్తే అదే పదివేలు అని అనుకుంటున్నారు. ప్రత్యేక తనిఖీల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా రక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.