పీవోకే హస్తగతానికి పాకిస్తాన్ కుటిలయత్నం

– 1947 నుంచి వివాదంలో గిల్గిత్-బాల్టిస్తాన్ – ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన పాక్ – హక్కు లేదని వాదిస్తోన్న భారత్ దిశ, వెబ్‌డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతం ఎంత చల్లగా ఉంటుందో.. గత ఐదు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ వేదికలపై అంతగా వేడిపుట్టించింది. భారత్-పాక్ మధ్య కశ్మీర్ వివాదం 1947 నుంచే ఉంది. కానీ 1970లో పాకిస్తాన్ ఎప్పుడైతే గిల్గిత్-బాల్టిస్తాన్‌ను తమ ఉత్తర ప్రాంతంగా ప్రకటించుకుందో ఆనాటి నుంచి వివాదం ముదిరింది. ఆ ప్రాంతంపై […]

Update: 2020-05-06 07:03 GMT

– 1947 నుంచి వివాదంలో గిల్గిత్-బాల్టిస్తాన్
– ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన పాక్
– హక్కు లేదని వాదిస్తోన్న భారత్

దిశ, వెబ్‌డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతం ఎంత చల్లగా ఉంటుందో.. గత ఐదు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ వేదికలపై అంతగా వేడిపుట్టించింది. భారత్-పాక్ మధ్య కశ్మీర్ వివాదం 1947 నుంచే ఉంది. కానీ 1970లో పాకిస్తాన్ ఎప్పుడైతే గిల్గిత్-బాల్టిస్తాన్‌ను తమ ఉత్తర ప్రాంతంగా ప్రకటించుకుందో ఆనాటి నుంచి వివాదం ముదిరింది. ఆ ప్రాంతంపై సర్వహక్కులు తామవేనని పాకిస్తాన్ ప్రకటించుకుంది. కానీ ఇండియా ఈ వివాదంపై ఐక్యరాజ్యసమితిలో బలమైన బాణి వినిపించడంతో అదొక వివాదాస్పద ప్రాంతంగా మిగిలిపోయింది. ఇరుదేశాల మధ్య ఆ ప్రాంతం కోసం యుద్దం జరిగినా 1949 జనవరి 2న కాల్పుల విరమణ జరిగింది. అప్పటికే గిల్గిత్ – బాల్టిస్తాన్ ప్రాంతాన్ని పాక్ ఆక్రమించేసింది. చివరకు 1972లో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం వాస్తవాధీన రేఖను ఇరు దేశాలు గుర్తించాయి. అయితే భారత్ మాత్రం గిల్గిత్ – బాల్టిస్తాన్‌పై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కులు ఉండవని తేల్చి చెప్పింది. మరోవైపు పాకిస్తాన్ అది తమ దేశంలోని ప్రాంతమే అని ప్రకటించుకుంది కానీ తమ దేశంలో ఒక ప్రావిన్స్ అని ప్రకటించుకోలేక పీవోకేకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. ఆనాటి నుంచి అది పాకిస్తాన్ పాలనలోనే ఉన్నా.. పూర్తి అధికారాలు మాత్రం లేవు.

మరోవైపు భారత్ ఆధీనంలో ఉన్న కశ్మీర్‌లో ఎన్నికలు జరపడానికి ఎలాంటి అభ్యంతరాలు తలెత్తలేదు. పాక్‌తో ఉన్న విభేదాల కారణంగా భారత రాజ్యాంగం జమ్ము మరియు కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించింది. గత ప్రభుత్వాలు కూడా 1972 నుంచి కశ్మీర్, పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌ను యధాతథ స్థితిలోనే ఉంచాయి. 1994 ఫిబ్రవరి 24న భారత పార్లమెంట్‌లో ఒక చట్టం చేసింది. కశ్మీర్ భారత్‌లో ఎప్పటికీ అంతర్భాగమేనని.. దీన్ని దేశం నుంచి విడదీయడానికి వీల్లేదనేది ఆ చట్టంలో ముఖ్యమైన అంశం. అంతే కాకుండా గతంలో అవిభాజ్య కశ్మీర్‌లో భాగమైన గిల్గిత్ – బాల్టిస్తాన్‌ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోవాలని.. ఈ విషయంలో ఇతర ఏ దేశాలు మధ్యవర్తిత్వం వహించవద్దని పార్లమెంటులో తీర్మానం చేశారు. ఆనాటి నుంచి ఇరు దేశాల మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై వివాదం నడుస్తూనే ఉంది.

ఎన్నో ఏండ్లుగా కశ్మీర్‌ను హస్తగతం చేసుకోవాలనే కుటిలయత్నాలు చేస్తున్న పాకిస్తాన్ పలు మార్లు ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. ఇండియా కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లే గిల్గిత్ -బాల్టిస్తాన్‌లో తామూ ఎన్నికలు నిర్వహించడం ద్వారా దాన్ని అధికారికంగా పాకిస్తాన్‌లోని భూభాగంగా ప్రకటించుకోవచ్చనే ఎత్తుగడను వేసింది. అప్పటికే తాను ఆసియాలో చైనాపై ఆధిపత్యం చెలాయించాలంటే పాకిస్తాన్‌ను గుప్పిట్లో పెట్టుకోవాలని భావించిన అమెరికానే ఈ ఉత్తర్వుల జారీలో పాక్‌ను రెచ్చగొట్టిందనే ఆరోపణలు వచ్చాయి. గిల్గిత్ – బాల్టిస్తాన్‌‌లో ఎన్నికలు నిర్వహించాలని పాక్ ప్రభుత్వం 2018లో ఒక చట్టం చేసింది. ఈ చట్టానికి న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించి.. జనవరి 2019లో పాకిస్తాన్ సుప్రీంకోర్టు పరిధిని గిల్గిత్-బాలిస్తాన్‌కు విస్తరించింది. తాజాగా అదే సుప్రీంకోర్టు పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు గత 50 ఏండ్లుగా గిల్గిత్ -బాల్టిస్తాన్‌ను తన పరిధి కాదని చెప్పిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు అక్కడ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడం అంతా పాక్ కుట్రలో భాగమేనని భారత్ అంటోంది.

పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌ను హస్తగతం చేసుకోవడంలో భాగమే సుప్రీంకోర్టు తీర్పని భారత ప్రభుత్వం మండిపడుతోంది. ఎప్పుడైతే కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హక్కులను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందో అప్పటి నుంచే పాక్ గిల్గిత్ -బాల్టిస్తాన్ తమ చేతి నుంచి జారీపోతుందేమోననే భయం పాక్ ప్రభుత్వానికి పట్టుకుంది. మరోవైపు పీవోకేలో భారత్‌కు అనుకూలంగా ఆందోళనలు కూడా మొదలయ్యాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే తమ రబ్బర్ స్టాప్ వంటి సుప్రీంకోర్టుతో పాక్ ప్రభుత్వం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుందని భారత్ వాదిస్తోంది.

రెండు రోజుల క్రితం పాకిస్తాన్ లేఖకు స్పందించిన భారత్ తీవ్రంగా స్పందించింది. కశ్మీర్‌పై పూర్తి హక్కులు తమవేనని.. అక్కడ ఎన్నికలు నిర్వహిస్తే అంతర్జాతీయ వేదికలపై నిలదీస్తామని చెప్పింది. పీవోకేలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా దాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోవాలనుకోవడం కుటిలయత్నమేనని భారత ప్రభుత్వం భావిస్తోంది. కరోనా సంక్షోభ సమయంలో పాకిస్తాన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం తగదని అంటోంది. మరి ఈ వాదనకు అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుందో వేచి చూడాల్సిందే.

Tags: POK, Pakistan, Gilgit Baltistan, India, Kashmir, Elections, Supreme Court, Indian Parliament

Tags:    

Similar News