అప్పుడు అలాగే ఇచ్చారు.. ఇప్పుడెలా?

దిశ, న్యూస్ బ్యూరో: వికారాబాద్ గ్రామపంచాయతీ 1964లో మంజూరు చేసిన లే ఔట్‌లోని ఒక ప్లాటును గతంలోనే రాజు అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ ప్లాటులో భవన నిర్మాణ అనుమతి కోసం మునిసిపాలిటీకి వెళితే ఎల్ఆర్ఎస్ చేసుకుంటేనే ఇస్తామని అధికారులు తేల్చి చెప్పారు. గ్రామపంచాయతీ లే ఔట్ కాబట్టి అనుమతి రాదని స్పష్టంచేశారు. గ్రామపంచాయతీకి మంజూరు చేసే అధికారాలు ఉన్నప్పుడు అనుమతి పొందిన లే ఔట్‌లోని ప్లాటు అంటూ రాజు వివరించినా మునిసిపల్ అధికారులు […]

Update: 2020-09-03 01:03 GMT

దిశ, న్యూస్ బ్యూరో: వికారాబాద్ గ్రామపంచాయతీ 1964లో మంజూరు చేసిన లే ఔట్‌లోని ఒక ప్లాటును గతంలోనే రాజు అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ ప్లాటులో భవన నిర్మాణ అనుమతి కోసం మునిసిపాలిటీకి వెళితే ఎల్ఆర్ఎస్ చేసుకుంటేనే ఇస్తామని అధికారులు తేల్చి చెప్పారు. గ్రామపంచాయతీ లే ఔట్ కాబట్టి అనుమతి రాదని స్పష్టంచేశారు. గ్రామపంచాయతీకి మంజూరు చేసే అధికారాలు ఉన్నప్పుడు అనుమతి పొందిన లే ఔట్‌లోని ప్లాటు అంటూ రాజు వివరించినా మునిసిపల్ అధికారులు ససేమిరా అన్నారు. ఏమి చేయాలో తోచక అయోమయంలో ఉన్నాడు రాజు.

ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణ, గ్రామాల్లోనూ ఉన్నాయి. మునిసిపల్ యాక్టు 1965 అమలులోకి రాకముందు గ్రామపంచాయతీలకు లే ఔట్లు, భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే అధికారముండేది. అప్పుడు అనుమతిచ్చిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ తీసుకోవాలని చెప్పడం ఎంత వరకు సబబనేది ప్రజలను తొలుస్తున్న ప్రశ్న. 1965లో మునిసిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మాత్రమే గ్రామపంచాయతీలకు లే ఔట్లను మంజూరు చేసే అధికారాలను తొలగించడాన్ని మునిసిపల్ అధికారులు గుర్తు చేసుకోవాలనే వాదన తెరపైకి వచ్చింది. గ్రామపంచాయతీ అనగానే అక్రమమని ప్రచారం చేయరాదని పట్టణప్రాంత వాసులు కోరుతున్నారు.

రిజిస్ట్రేషన్ ఏడాది మార్కెట్ విలువనే

ప్లాటు రిజిస్ట్రేషన్ అయిన ఏడాది మార్కెట్ విలువనే పరిగణలోకి తీసుకుని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు రుసుమును విధించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. ప్రస్తుత మార్కెట్ విలువ అంటే క్రమబద్ధీకరణ చేసే సంవత్సరపు మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకుంటే గతంలో కొనుగోలు చేసిన ప్లాట్ విలువ మొత్తానికంటే అధికంగా ఉంటుందని, అంత మొత్తం చెల్లించలేని పరిస్థితిలో చాలా మంది ప్రజలు ఉన్నారంటున్నారు.

‘రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో కొనుగోలుదారుడు చెల్లిస్తున్న స్టాంప్ డ్యూటీ, ఇతర చాలానా నిధులు ప్రభుత్వానికే చెందుతున్నాయి కదా? ఆ నిధుల్లో అధిక శాతం గ్రామం లేదా పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కేటాయిస్తున్నందున, మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేరిట రుసుం వసూలు చేయడమంటే ప్రజల నుంచి ముక్కుపిండి వేల కోట్ల రూపాయలను ఖజానాకు చేర్చడమే’ అని రిటైర్డ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దేవరాజు విష్ణువర్థన్ రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

2015లో వచ్చిన ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకుని పూర్తి రుసుం చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిస్థతి ఏమిటనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించే అధికారాలు హెచ్ఎండీఏకు, డీటీసీపీ, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకు లేవు. ఆ సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్నవాటి కోసం దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందేనా? లేదా వాటిని పరిష్కరించుకునేందుకు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా? లేదా అథారిటీలకు వినతి పత్రం సమర్పించాలా? అనేది జిఓ 131లో వివరించలేదు.

కటాఫ్ డేట్ పెంచాలి …

ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించేందుకు తుది గడువును మరింతగా పొడిగించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తున్నది. కరోనా నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయిన తరుణంలో ఎల్ఆర్ఎస్ తీసుకురావడమే సరైన సమయం కాదని వారు విమర్శిస్తున్నారు. దీనికి తోడు రుసుం చెల్లించేందుకు నిర్ధిష్టమైన గడువు విధించడం ప్రభుత్వ విధనాం కాకూడదనే వాదన తెరపైకి వచ్చింది. ప్రజలకు మేలు చేసేలా చట్టాలను ప్రభుత్వాలు రూపొందించాలని, ఆదేశాలను జారీచేయాలని ప్లాట్ల యజమానులు కోరుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు అద్వాన్నంగా ఉన్న తరుణంలో రుసుంలు వసూలు చేసే పద్దతిని ప్రవేశపెట్టడమే ప్రజలపై మోయలేని భారాన్ని మోపడమని, మరికొంత వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్లాట్ల యజమానులు గుర్తు చేస్తున్నారు.

Tags:    

Similar News