ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారైనా ఆఖరి మెట్టు ఎక్కుతుందా?

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021లో టైటిల్ గెలవాలని ప్రతీ జట్టు తపిస్తున్నది. లీగ్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా.. అందులో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని జట్లలో ఒకటి ఢిల్లీ క్యాపిటల్స్. గత సీజన్‌లో ఫైనల్ చేరినా ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. ఇక పంజాబ్ కింగ్స్ (అప్పట్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) జట్టు కూడా ఇప్పటి వరకు టైటిల్ నెగ్గలేదు. ఐపీఎల్ 13వ సీజన్‌ ప్రారంభంలో టాప్ పొజిషన్‌లో ఉన్నా.. రెండో అర్థ […]

Update: 2021-04-05 08:58 GMT

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021లో టైటిల్ గెలవాలని ప్రతీ జట్టు తపిస్తున్నది. లీగ్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా.. అందులో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని జట్లలో ఒకటి ఢిల్లీ క్యాపిటల్స్. గత సీజన్‌లో ఫైనల్ చేరినా ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. ఇక పంజాబ్ కింగ్స్ (అప్పట్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) జట్టు కూడా ఇప్పటి వరకు టైటిల్ నెగ్గలేదు. ఐపీఎల్ 13వ సీజన్‌ ప్రారంభంలో టాప్ పొజిషన్‌లో ఉన్నా.. రెండో అర్థ భాగంలో పేలవ ప్రదర్శనతో కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేదు. మరి ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల పరిస్థితి ఏమిటో పరిశీలిద్దాం..

కొత్త లీడర్… సరికొత్త ఢిల్లీ

ఐపీఎల్ ప్రారంభమైన దగ్గర నుంచి అంచనాలు అందుకోలేక పోతున్న జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్) ఒకటి. జట్టులో హేమాహేమీ క్రికెటర్లు ఉన్నా ఏనాడూ చాంపియన్‌గా అవతరించలేదు. కానీ యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో మాత్రం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో డీసీ అంచనాలను మించి రాణించింది. జట్టులోని ప్రతీ ఒక్కరు తమ పాత్రను విజయవంతంగా పోషించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ విశ్లేషకుల అంచనాలను మించిపోయింది. ధావన్, పృథ్వీషా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ తమ బ్యాటింగ్‌తో ఎన్నో సార్లు జట్టును ఆదుకున్నారు. ఈ సీజన్‌లో కెప్టెన్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఇప్పటికే వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా పంత్ నిరూపించుకున్నాడు. గతంలో దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి కెప్టెన్‌గా మంచి విజయాలు అందించాడు. దీంతో తాజా ఐపీఎల్ సీజన్‌లో పంత్ తప్పక రాణిస్తాడని జట్టు యాజమాన్యం కూడా భావిస్తున్నది. ఈ సీజన్‌లో కొత్తగా స్టీవ్ స్మిత్ జట్టుతో చేరడం అదనపు బలం అని చెప్పుకోవచ్చు. ఓపెనర్ ధావన్ నుంచి మిడిల్ ఆర్డర్‌లోని హెట్‌మెయిర్ వరకు అందరూ భారీ స్కోర్లు సాధించగలిగే బ్యాట్స్‌మెన్లు ఉండటం ఢిల్లీకి కలసి వచ్చే అంశం. మార్కస్ స్టోయినిస్ గత సీజన్‌లో ఢిల్లీకి కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సారి కూడా అతడిపై ఢిల్లీ యాజమాన్యం అంచనాలు పెట్టుకున్నది.

బౌలింగ్ ఓకే..

ఢిల్లీ జట్టులో కగిసో రబాడ, ఎన్రిక్ నోర్జే వంటి మంచి పేసర్లు అందుబాటులో ఉన్నారు. గత సీజన్‌లో వీరిద్దరూ మంచిగా రాణించారు. వీరికి తోడు రవిచంద్రన్ అశ్విన్ వంటి వికెట్ టేకింగ్ బౌలర్ అందుబాటులో ఉన్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా బ్యాటుతో పాటు బంతితో అద్భుతాలు సృష్టించగలడు. గత సీజన్‌లో పటేల్ బౌలింగ్ ప్రతిభే అతడికి టీమ్ ఇండియాలో స్థానం సంపాదించి పెట్టింది. అక్షర్ ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అవడంతో అతడు తొలి రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. అతడి స్థానంలో అమిత్ మిశ్రాను తీసుకునే అవకాశం ఉన్నది. ఏదేమైనా గత ఏడాది ఫైనల్ వరకు చేరుకున్న ఢిల్లీ జట్టు చివరి మెట్టుపై చతికిల పడింది. ఈ సారి అలా జరగబోదని కోచింగ్ స్టాఫ్ చెబుతున్నది.

జట్టు : రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), లుక్మన్ మేరీవాలా, ఎం. సిద్దార్థ్, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, స్టీవ్ స్మిత్, అవేష్ ఖాన్, ఎన్రిక్ నోర్జే, మార్కస్ స్టోయినిస్, సామ్ బిల్లింగ్స్, అక్షర్ పటేల్, విష్ణు వినోద్, టామ్ కర్రన్, రిపల్ పటేల్, క్రిస్ వోక్స్, శిఖర్ ధావన్, కగిసో రబాడ, ఉమేష్ యాదవ్, ప్రవీణ్ దూబే, అజింక్య రహానే, శిమ్రోన్ హెట్‌మెయర్, ఇషాంత్ శర్మ, లలిత్ యాదవ్, పృథ్వీ షా

ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్‌లు

చెన్నై – ఏప్రిల్ 10
రాజస్థాన్ – ఏప్రిల్ 15
పంజాబ్ – ఏప్రిల్ 18
ముంబయి – ఏప్రిల్ 20
హైదరాబాద్ – ఏప్రిల్ 25
బెంగళూరు – ఏప్రిల్ 27
కోల్‌కతా – ఏప్రిల్ 29
పంజాబ్ – మే 2
కోల్‌కతా – మే 8
ఢిల్లీ – మే 11
బెంగళూరు – మే 14
హైదరాబాద్ – మే 17
చెన్నై – మే 21
ముంబై – మే 23

గత సీజన్ 2వ స్థానం

ఈ సారైనా పంజాబ్ గెలిచేనా?

ఐపీఎల్ గత సీజన్ గడిచి కేవలం నాలుగు నెలలే గడిచింది. కానీ ఇప్పటికీ క్రికెట్ అభిమానులు పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) జట్టు ఆడిన తీరును ఎవరూ మర్చిపోలేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ప్రత్యర్థి జట్టు బౌలర్లను చీల్చి చెంఢాడారు. అయినా సరే ఆ సీజన్‌లో జరిగిన మొదటి 7 మ్యాచ్‌లలో ఐదింటిని ఓడిపోయి పంజాబ్ కింగ్స్ అట్టడుకే పరిమితం అయ్యింది. రెండో అర్థభాగంలో వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ ప్లేఆఫ్స్‌కు పోటీ పడింది. కానీ ఐపీఎల్ సీజన్ ముగిసే సరికి ఆరవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టాప్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ కీలక బ్యాట్స్‌మెన్లు. డేంజరస్ క్రికెటర్ క్రిస్ గేల్‌ను గత ఏడాది తొలి అర్థభాగంలో ఆడించనందుకు గాను పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకున్నది. క్రిస్ గేల్‌ను రెండో అర్థభాగంలో ఆడించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఈ సారి గేల్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌కు తోడు దావిద్ మలాన్ ఉండటం జట్టుకు కలసి వచ్చే అంశం. నికొలస్ పూరన్, మన్‌దీప్ సింగ్ బ్యాటుతో సత్తా చాటగలరు. టాప్ ఆర్డర్‌ బలంగా ఉన్నా.. మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్ లేకపోవడం పంజాబ్ జట్టుకు పెద్దలోపం.

ఇక ఐపీఎల్‌లో అత్యధిక ఆల్‌రౌండర్లు కలిగిన జట్టు పంజాబ్ కింగ్స్. దాదాపు 10 మంది ఆల్‌రౌండర్లు ఈ జట్టు బెంచ్‌పై ఉన్నారు. ఫాబియన్ అలనె, మోసెస్ హెన్రిక్స్, జైల్ రిచర్డ్‌సన్, హర్‌ప్రీత్ బ్రార్, దీపక్ హుడా వంటి ఆల్‌రౌండర్లు జట్టుకు రెండు విధాలుగా సహాయ పడగలరు. బౌలింగ్‌లో మహ్మద్ షమి వంటి సీనియర్ పేసర్ అందుబాటులో ఉన్నాడు. గత సీజన్‌లో జట్టు తరపున అత్యధిక వికెట్లు తీశాడు. అతడికి తోడు క్రిస్ జోర్డాన్, ఇషాన్ పోరెల్, అర్షదీప్ సింగ్ జట్టుకు పేస్ బాధ్యతలు నిర్వర్తించగలరు. కాగా, పంజాబ్ కింగ్స్ జట్టులో స్పిన్నర్లే తక్కువగా ఉన్నారు. అయితే రవి బిష్ణోయ్ వంటి మిస్టరీ స్పిన్నర్ అందుబాటులో ఉండటం జట్టుకు బలం. అతడికి తోడుగా మురుగన్ అశ్విన్ కూడా జట్టులో ఉన్నాడు. ఏదేమైనా గత ఏడాది చేసిన తప్పును మళ్లీ పునరావృతం చేయకుండా క్రిస్ గేల్ సేవలు మొదటి నుంచి ఉపయోగించుకుంటే పంజాబ్ కింగ్స్ ఈ సారి తప్పకుండా రాణించగలదు.

జట్టు : క్రిస్ గేల్, దావిద్ మలాన్, మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, జలజ్ సక్సేనా, మోసెస్ హెన్రిక్స్, సౌరభ్ కుమార్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, జైల్ రిచర్డ్ సన్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, ప్రభ్‌సిమమ్రన్ సింగ్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, క్రిస్ జోర్డాన్, మహ్మద్ షమి, రిలే మెరిడిత్, ఇషాన్ పొరెల్, దర్శన్ నల్‌ఖండే, అర్ష్‌దీప్ సింగ్

పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లు

రాజస్థాన్ – ఏప్రిల్ 12
చెన్నై – ఏప్రిల్ 16
ఢిల్లీ – ఏప్రిల్ 18
హైదరాబాద్ – ఏప్రిల్ 21
ముంబై – ఏప్రిల్ 23
కోల్‌కతా – ఏప్రిల్ 26
బెంగళూరు – ఏప్రిల్ 30
ఢిల్లీ – మే 2
బెంగళూరు – మే 6
చెన్నై – మే 9
ముంబై – మే 13
కోల్‌కతా – మే 15
హైదరాబాద్ – మే 19
రాజస్థాన్ – మే 22

గత సీజన్ 6వ స్థానం

Tags:    

Similar News