పినపాక కాంగ్రెస్ మండలాధ్యక్షుడి ఘోరాలు.. పార్టీ పేరుతో అక్రమ వసూళ్ల దందా!
దిశ, మణుగూరు : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం, ఉనికి కోసం కష్టపడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. రేవంత్ పార్టీ పగ్గాలు తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ వచ్చింది. క్యాడర్ అంతా యాక్టివ్ అయ్యింది. ఎలక్షన్ వరకు ఇంకా టైం ఉండటంతో ఎలాగైనా పార్టీని అధికారంలోనికి తీసుకొచ్చేందుకు రేవంత్ అండ్ కో తీవ్ర కసరత్తులు చేస్తోంది. అయితే, కొంతమంది వ్యక్తుల వల్ల పార్టీకి తీరని నష్టం కలుగుతోందని కింది స్థాయి క్యాడర్ […]
దిశ, మణుగూరు : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం, ఉనికి కోసం కష్టపడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. రేవంత్ పార్టీ పగ్గాలు తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ వచ్చింది. క్యాడర్ అంతా యాక్టివ్ అయ్యింది. ఎలక్షన్ వరకు ఇంకా టైం ఉండటంతో ఎలాగైనా పార్టీని అధికారంలోనికి తీసుకొచ్చేందుకు రేవంత్ అండ్ కో తీవ్ర కసరత్తులు చేస్తోంది. అయితే, కొంతమంది వ్యక్తుల వల్ల పార్టీకి తీరని నష్టం కలుగుతోందని కింది స్థాయి క్యాడర్ ఆరోపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పార్టీ పేరుతో రోజూ వసూళ్ళ దందాకు పాల్పడుతున్నాడని మండల ప్రజల ఆరోపిస్తున్నారు. మండలంలోని ఇసుక ర్యాంపులు, కాంట్రాక్టర్లు, సిండికేట్ దుకాణాలు, కిరణా దుకాణాలపై పార్టీ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు జోరుగా చర్చ నడుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చెమట చుక్క కూడా కార్చకుండా నిత్యం వసూళ్ళకే పరిమితమవుతున్నాడని కొందరు నాయకులు మండిపడుతున్నారు. అతను ఏరోజు కూడా పార్టీ కోసం కష్టపడలేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ పార్టీ పేరు చెప్పి డబ్బులు వసూళ్ళు చేద్దామా? అనే ఆలోచన తప్పా.. పార్టీ కోసం కొంచెం కూడా ఆలోచించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన వసూళ్ళ దందాకు ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకు, కార్యకర్తలను దూరం ఉంచుతున్నాడని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే, కొంతమంది ఆ లీడర్ వసూళ్ల పర్వం గురించి ప్రశ్నిస్తే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని కార్యకర్తలు, ప్రజలు వాపోతున్నారు.
నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టుతే కనీసం వాటికి హాజరుకాడని నియోజకవర్గ పెద్దలు, కార్యకర్తలు, ప్రజలు తెలుపుతున్నారు. మండలంలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను దూరం పెట్టి కేవలం ఆయన జల్సాలు, సంతోషాల కోసం పార్టీని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నట్టు మండల ప్రజలు ముక్తకంఠంతో విమర్శించారు. కొత్తవాళ్ళను పార్టీలోకి అడుగు పెట్టనివ్వకుండా చేస్తున్నాడని.. అందుకోసం కొత్తగా చేరిన వారితో గొడవలు పెట్టుకుని మరీ వారిని వెంటనే పార్టీ నుంచి తీసివేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్రికా విలేకరులు ఇతని దందాల గురించి పత్రికల్లో రాసినా తాను ఎవ్వరికీ భయపడేవాడిని కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు చర్యలు..
టీపీసీసీ ఉపాధ్యక్షుడు భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య పార్టీ కోసం కష్టపడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి మారినా.. పొదేం వీరయ్య పార్టీ మారకుండా ప్రజలకోసం, పార్టీ కోసం సేవచేస్తుంటే పినపాక మండల అధ్యక్షుడు లాంటి వారు పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీ అభివృద్ధి కాదని పలువురు లోకల్ లీడర్స్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పొదేం వీరయ్య, నియోజకవర్గ కన్వీనర్, కో-కన్వీనర్ పినపాక మండల అధ్యక్షుడిని పార్టీ నుంచి బహిష్కరించకపోతే.. మండలంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడం తథ్యమని మండల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తు్న్నారు. కాగా, పినపాక మండల అధ్యక్షుడిపై అధిష్టానం ఆదేశాల మేరకు ఏ చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.