అదరగొట్టిన దివ్యాంగులు.. ‘పేడ’తో తయారైన రాఖీలకు జనం ‘ఫిదా’
దిశ, కామారెడ్డి రూరల్ : అన్నాచెల్లెళ్ల అనుబంధం, అప్యాయతను చాటి చెప్పే పండుగ ‘రాఖీ’.. ఈనెల 22 (ఆదివారం) రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కెట్లలో కొత్త రకం రాఖీలు కనువిందు చేస్తున్నాయి. అయితే, ఈ పండుగ నాడు అక్కా చెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి వారిపై ఉన్న అనుబంధాన్ని, ప్రేమను చాటుతారు. భారతీయ సంప్రదాయాల్లో రాఖీకి ఎంతో విశిష్టత ఉన్నది. విదేశాల్లో ఉన్న భారతీయ సోదరీమణులు సైతం తమ అన్నదమ్ముళ్లపై ఉన్న ప్రేమను గుర్తు చేసుకుని […]
దిశ, కామారెడ్డి రూరల్ : అన్నాచెల్లెళ్ల అనుబంధం, అప్యాయతను చాటి చెప్పే పండుగ ‘రాఖీ’.. ఈనెల 22 (ఆదివారం) రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కెట్లలో కొత్త రకం రాఖీలు కనువిందు చేస్తున్నాయి. అయితే, ఈ పండుగ నాడు అక్కా చెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి వారిపై ఉన్న అనుబంధాన్ని, ప్రేమను చాటుతారు. భారతీయ సంప్రదాయాల్లో రాఖీకి ఎంతో విశిష్టత ఉన్నది. విదేశాల్లో ఉన్న భారతీయ సోదరీమణులు సైతం తమ అన్నదమ్ముళ్లపై ఉన్న ప్రేమను గుర్తు చేసుకుని ప్రతీయేడు వారి ఇంటికి రాఖీలు పంపించడం మనం చూస్తునే ఉంటాం.
అయితే, దేశీయంగా ఎన్నో రకాల రాఖీలు మార్కెట్లల్లో కనువిందు చేస్తున్నా.. మహిళా దివ్యాంగులు ఈ ఏడాది ‘గోమయం’తో వినూత్నంగా తయారు చేసిన రాఖీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా దివ్యాంగులు ఒకరిపై ఆధారపడి జీవిస్తుంటారు. అందులోనూ మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినా.. ఈ దివ్యాంగులు తమ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. భారతీయ పండుగలను దృష్టిలో ఉంచుకుని రాఖీలు, మట్టి గణేషులు, బతుకమ్మలు, ఇంట్లో వినియోగించే డిటర్జెంట్ పౌడర్‌లను సైతం తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. తాజాగా గోమయంతో తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా దివ్యాంగ మహిళలు రాఖీలు తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ‘రాఖీ పౌర్ణమి’ని పురస్కరించుకుని ‘దిశ’ ప్రత్యేక కథనం మీకోసం..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దివ్యాంగులు ఒక బృందంగా ఏర్పడ్డారు. చింతల పోశవ్వ, ఆఫీసా బేగం ఆధ్వర్యంలో ‘దివ్య హస్తం’ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా స్వయం ఉపాధిని పొందుతున్నారు. రాఖీలు, గణేష్ విగ్రహాలను తయారు చేయాలని భావించారు. అయితే, అందరీలా కాకుండా వినూత్నంగా ఆలోచించారు. గోమయంతో రాఖీలు, గణేష్ ప్రతిమలను తయారు చేయాలని నిర్ణయించుకుని.. పని ప్రారంభించారు. భారతీయ పండగలను దృష్టిలో ఉంచుకుని ఆయా పండుగల్లో ప్రత్యేక వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టారు. వీరిలో ప్రత్యేకత ఏమిటంటే పర్యావరణం కలుషితం కాకుండా ప్రజలను ఆకర్షించాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే గోమయంతో ప్రతిమలు తయారు చేసి వాటికి సహజ సిద్ధమైన రంగులు అద్ది పర్యావరణాన్ని సమతుల్యతకు తమ వంతు కృషి చేస్తున్నారు. ఈనెలలో రాఖీ పండుగ ఉన్నందున గోమయం ద్వారా రాఖీలు తయారు చేసి విక్రయిస్తున్నారు.
బయోడిగ్రేడబుల్, యాంటీ రేడియేషన్‌తో తయారైన వస్తువులు పర్యావరణ పరిరక్షణకు హాని కలిగించవు. వారు అద్దే రంగులు కూడా సహజ సిద్ధమైన వాటర్ కలర్స్ మాత్రమే. ‘పేడ’తో వీరు తయారు చేసే రాఖీలు భూమిలో సులువుగా కలిసిపోతాయి. అంతేగాకుండా, పంట పొలాలకు ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. తమ ఆలోచన ప్రతీ ఒక్కరికి చేరాలనే ఈ రాఖీలను తయారు చేస్తున్నట్టు దివ్యాంగ మహిళలు తెలిపారు. అయితే, ఇలాంటి ఉత్పత్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం తరఫున కల్పించాలని సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు. రాఖీలు కావాలసిన వారు కామారెడ్డి జిల్లా న్యూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర గల రాజీవ్ గృహకల్పలో సంప్రదించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని.. అందుకోసం బయోడిగ్రేడబుల్ రాఖీలను వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం తమకు మరింత సహాయం అందిస్తే ఎక్కువ మొత్తంలో పర్యావరణానికి ముప్పు కలిగించని ఉత్పత్తులు తయారు చేస్తామన్నారు.
పర్యావరణ రక్షణ కోసమే గోమయం ఉత్పత్తులు
స్వయం ఉపాధి పొందడంతో పాటు పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో గోమయం రాఖీలు, గణేష్ ప్రతిమలను సైతం తయారు చేస్తున్నాం. వీటిని మార్కెట్ చేయడానికి, మరిన్ని తయారు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. తన లాంటి దివ్యాంగులను ఆదుకోవడానికి ముందుకు రావాలి.