సెక్రెటేరియేట్లో నిఘా.. ఐఏఎస్‌ల పోన్లు ట్యాపింగ్..!
దిశ, తెలంగాణ బ్యూరో: సచివాలయంలో సమాంతర పాలన నడుస్తోందా? తనకు పడని అధికారుల ఫోన్ సంభాషణలపై సీఎస్ నిఘా వేశారా? వారి కదలికలను పసిగట్టే బాధ్యత తనకు అనుకూలంగా ఉండే అధికారులకు అప్పగించారా? ఇంతకూ సచివాలయంలో ఏం జరుగుతోంది? కిందిస్థాయి నుంచి మొదలుకుని శాఖాధిపతి వరకు ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. సీఎస్ కాకముందు తాము చూసిన సోమేశ్ కుమార్‌కు, ఇప్పటి సోమేశ్ కుమార్‌కు చాలా వ్యత్యాసం ఉందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: సచివాలయంలో సమాంతర పాలన నడుస్తోందా? తనకు పడని అధికారుల ఫోన్ సంభాషణలపై సీఎస్ నిఘా వేశారా? వారి కదలికలను పసిగట్టే బాధ్యత తనకు అనుకూలంగా ఉండే అధికారులకు అప్పగించారా? ఇంతకూ సచివాలయంలో ఏం జరుగుతోంది? కిందిస్థాయి నుంచి మొదలుకుని శాఖాధిపతి వరకు ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. సీఎస్ కాకముందు తాము చూసిన సోమేశ్ కుమార్‌కు, ఇప్పటి సోమేశ్ కుమార్‌కు చాలా వ్యత్యాసం ఉందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి పాలిస్తుంటే, సీఎస్ ఆయనకు సమాంతరంగా ఇక్కడ పాలన సాగిస్తున్నట్లు భావిస్తున్నారు. సీఎం తమ ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల స్వయంగా ఆరోపణలు చేశారు. అదే తరహాలో సీఎస్ కూడా తనకు వ్యతిరేకంగా ఉన్న ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారుల మీద నిఘా ఉంచారని అంటున్నారు. వారి ఫోన్ల కూడా ట్యాపింగ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పలువురు ఉన్నతాధికారులు కూడా దీనిని ధ్రువీకరిస్తున్నారు.
ఉన్నతాధికారుల ఆగ్రహం
ఐఏఎస్ అధికారులు చాలా మంది సీఎస్ మీద ఆగ్రహంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. చిన్న చిన్న అంశాలు, సాధారణ, పరిపాలనా విషయాలలోనూ ఆయన జోక్యం పెరిగిపోవడంతో వారంతా కలిసి ఏకంగా సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఎస్ కూ, ఐఏఎస్‌లకూ మధ్య అంతరం పెరిగింది. కలెక్టర్లు కూడా సీఎస్‌పై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల కొందరు ఐఏఎస్‌ల వ్యవహారంలో సీఎస్ తీసుకున్న నిర్ణయాలు మరింత కోపానికి కారణమయ్యాయి. ధరణి, ఎల్ఆర్ఎస్ వంటి స్కీంలు రచ్చకు దారి తీసాయి. ఇదే సమయంలో సీఎం కూడా సీఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌ల ప్రతి కదలికపై సీఎస్ నిఘా పెట్టారని, తనకు అనుకూలంగా ఉండే కొందరు పోలీస్ ఉన్నతాధికారులతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారని అంటున్నారు. ఇప్పుడు చాలా మంది అధికారులు ప్రైవేట్ అంశాలను కూడా ఫోన్లలో మాట్లాడుకోవడం లేదు. నిఘా ఉందని తెలియడంతో ఉన్నతాధికారులు సీఎస్ తో బహిరంగంగానే వివాదాలకు దిగుతున్నారు.
తారస్థాయికి వ్యతిరేకత
రిజిస్ట్రేషన్, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ వంటి శాఖల ఉన్నతాధికారులపై కూడా నిఘా పెరిగింది. రిజిస్ట్రేషన్ల శాఖలో సీఎస్‌పై వ్యతిరేకత తారస్థాయికి చేరింది. చిన్న ఉద్యోగి నుంచి మొదలుకుని ఉన్నతాధికారుల వరకు మండిపడుతున్నారు. తమ శాఖను సీఎం ముందు పని లేని విభాగంగా మార్చేందుకు సీఎస్ ప్రయత్నాలు చేశారనే కోపం వారిలో ఉంది. సీఎస్ నివేదిక ఆధారంగానే సీఎం కూడా రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా రెవెన్యూలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మూడున్నర నెలలపాటు నిలిపివేశారు. ఆదాయం తగ్గిపోవడంతో పాటుగా క్షేత్రస్థాయి నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది.
జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఓటమికి ఇది కూడా కారణమంటూ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందినట్లు తెలుస్తోంది. దీంతో సీఎస్ ను సీఎం సీరియస్‌గా మందలించినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి గతంలో ఇచ్చిన నివేదికలపై సీఎం కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎస్ ఆ శాఖ అధికారులపై సీఎస్ కక్ష పెట్టుకున్నారని అంటున్నారు. సోమేశ్ ఏపీ కేడర్ అయినప్పటికీ, ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కన్నా సీనియర్లు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అయినా సీఎం నమ్మకంతో సీఎస్ బాధ్యతలను సోమేశ్ కుమార్ కు అప్పగించారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కలిసి రాలేదు. ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయి. కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. కరోనా అంశంలోనూ అంతే. ఇలా వరుసగా జరుగుతున్నా సీఎస్ మాత్రం సీఎం తరహాలోనే సమాంతర వ్యవస్థను సాగిస్తున్నట్లు చెబుతున్నారు. కొందరు అధికారులను గుప్పిట పెట్టుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.