ఆర్టీసీపై మరో పిడుగు.. పీఎఫ్ చెల్లిస్తారా.. కేసు పెట్టాలా?

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ యాజమాన్యం నెత్తిపై మరో పిడుగు పడింది. ఏండ్ల నుంచి పెండింగ్‌లో పెట్టిన పీఎఫ్ బకాయిలను వెంటనే జమ చేయాలని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్​నోటీసులిచ్చారు. జమ చేయకుంటే నేరంగా పరిగణిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇప్పుడేం చేయాలో తెలియక ఆర్టీసీ యాజమాన్యం తల పట్టుకుంటోంది. ఆర్టీసీలో పీఎఫ్ బకాయిలు ఏకంగా రూ.1160 కోట్లకు చేరాయి. గతేడాది నవంబర్‌లో కూడా దీనిపై నోటీసులు జారీ చేయడంతో.. ఎలాగో రూ.18 కోట్లు సర్దుబాటు చేశారు. […]

Update: 2021-02-27 13:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ యాజమాన్యం నెత్తిపై మరో పిడుగు పడింది. ఏండ్ల నుంచి పెండింగ్‌లో పెట్టిన పీఎఫ్ బకాయిలను వెంటనే జమ చేయాలని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్​నోటీసులిచ్చారు. జమ చేయకుంటే నేరంగా పరిగణిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇప్పుడేం చేయాలో తెలియక ఆర్టీసీ యాజమాన్యం తల పట్టుకుంటోంది. ఆర్టీసీలో పీఎఫ్ బకాయిలు ఏకంగా రూ.1160 కోట్లకు చేరాయి. గతేడాది నవంబర్‌లో కూడా దీనిపై నోటీసులు జారీ చేయడంతో.. ఎలాగో రూ.18 కోట్లు సర్దుబాటు చేశారు. కానీ బాకీ రూ.1160 కోట్లకు దాటిపోయింది. ఆర్టీసీ కార్మికుల చందా జమలో జరుగుతున్న జాప్యంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల వేతనం నుంచి మినహాయించిన భవిష్యనిధి చందాను సకాలంలో జమ చేయకుండా ఆ మొత్తాన్ని సంస్థ అవసరాలు, వేతనాల చెల్లింపులకు వాడుకోవడంపై మళ్లీ తాజాగా నోటీసులు జారీ చేసింది.

పీఎఫ్ సొమ్ము పక్కదారి

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ సొమ్ము పక్కదారి పట్టింది. ఆర్టీసీలో 49 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. పీఎఫ్‌ను ఆర్టీసీ సొంతంగా నిర్వహిస్తుండగా.. దీనిపై పూర్తి పర్యవేక్షణ బాధ్యత ఈపీఎఫ్‌వోది. కార్మికులకు ప్రతినెలా చెల్లించే వేతనంలో పీఎఫ్‌ వాటా సొమ్మును మినహాయించి, ప్రతి నెలా పదో తేదీన ఆర్టీసీ పీఎఫ్‌ ట్రస్టులో ఆ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతినెలా ఉద్యోగుల నుంచి దాదాపుగా రూ.25 కోట్లు, యాజమాన్య వాటా కింద రూ.18 కోట్లు జమ కావాలి. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా రూ.1160 కోట్లను పీఎఫ్‌ ఖాతాకు జమ చేయకుండా వాడేసుకుంది. ఆర్టీసీలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి, అధికారి నెల వేతనం నుంచి యాజమాన్యం 12 శాతం పీఎఫ్ కింద కోత వేస్తుంది. దానికి యాజమాన్యం మరో 12 శాతం కలుపుతుంది. మొత్తం 24 శాతంలో 8.33 శాతం సొమ్ము పింఛను ఖాతాకు జమ చేస్తోంది. మిగతా 15.67 శాతానికి సంబంధించిన సొమ్మును పీఎఫ్‌ కార్యాలయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ట్రస్టు ఖాతాలో జమ చేయాలి. కానీ ఈ సొమ్ము ట్రస్టులో జమ కావడం లేదు. దీనిని ఆర్టీసీయే వాడేసుకుంటోంది. 2014 నుంచి మధ్య మధ్యలో కొంత జమ చేసినా.. ఇప్పటి వరకూ వాడేసుకున్న సొమ్ము రూ.1160 కోట్లుగా తేలింది.

ఆర్టీసీ.. ఇన్ బ్లాక్‌లిస్ట్

ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పీఎఫ్‌ను ఏళ్ల తరబడి జమ చేయకపోవడంతో పీఎఫ్‌ కమిషనరేట్ తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తామంటూ హెచ్చరించింది. దాదాపు ఏడేండ్ల నుంచి పీఎఫ్‌ విత్‌డ్రాయల్స్‌ నిలిచిపోవడంతో.. పీఎఫ్‌ కార్యాలయం ఆర్టీసీని బ్లాక్‌ లిస్టులో పెట్టింది. అయినా.. సంస్థలో మార్పు లేదు. అయితే గతేడాది నవంబర్‌లో దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి. సమ్మె సమయంలో కోర్టులో ఈ అంశంపై కూడా పిటిషన్​దాఖలైంది. దీంతో కోర్టు సూచనలతో పీఎఫ్​ సొమ్మును జమ చేస్తామని చెప్పుకొచ్చిన ఆర్టీసీ యాజమాన్యం.. అష్టకష్టాలు పడి రూ.18 కోట్లు జమ చేసింది. కానీ మళ్లీ పాత కథే.

జమ చేస్తారా.. లేదా?

గతంలో రూ.18 కోట్లు జమ చేసిన ఆర్టీసీ.. ఇప్పటి వరకు మళ్లీ రూపాయి జమ చేయకపోవడంతో పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్‌‌శర్మకు షోకాజ్ నోటీసు పంపించారు. పీఎఫ్ సొమ్మును జమ చేస్తారా.. లేదా అంటూ ప్రశ్నించారు. పీఎఫ్​ కార్యాలయం నుంచి నోటీసు రావడంతో ఆర్టీసీ యాజమాన్యం ఆందోళనలో పడింది. ఇప్పుడు ఎండీగా ఉన్న సునీల్‌‌శర్మ బాధ్యత వహించాల్సి రావడంతో ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. మరోవైపు ఆర్టీసీలో వేతనాలకే పైసల్లేక అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతినెలా ఐదో తారీఖులోగా వేతనాలు ఇవ్వాల్సి ఉండగా గతేడాది నుంచి 10వ తేదీ వరకు లాక్కుంటూ వచ్చారు. కరోనా లాక్‌డౌన్ నుంచి ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు 15వ తేదీ దాటే వరకు కూడా వేతనాలు జమ చేయడం లేదు. ఈ నేపథ్యంలో పీఎఫ్‌కు వేల కోట్లు చెల్లింపులు ఎలా అనేది సమస్యగా మారింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తేనే వీలవుతుందని విజ్ఞప్తి చేసుకుంటున్నారు. కానీ అప్పుడో, ఇప్పుడో వేతనాల కోసమే కొంత కొంత సర్దుబాటు చేస్తున్న ప్రభుత్వం.. పీఎఫ్​ బకాయిలు విడుదల చేసే అవకాశం లేదంటున్నారు.

క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు. అత్యవసర సమయాల్లో అక్కరకు రాకుండా పీఎఫ్ సొమ్మును వాడుకుంది. తెలంగాణ ఏర్పాటు నుంచి జమ చేయడం లేదు. ఆర్టీసీని ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా రూపాయి ఇవ్వడం లేదు. పీఎఫ్​సొమ్మును ఇవ్వకుంటే ఆర్టీసీ యాజమాన్యంపై క్రిమినల్​కేసు నమోదు చేయాలి. సీసీఎస్ కూడా జమ చేయడం లేదు. దీనిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే త్వరలోనే ఆందోళన చేస్తాం.
– అశ్వత్థామరెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి.

Tags:    

Similar News