కొవిడ్ ఎఫెక్ట్..పెరుగుతున్న ‘పారోస్మియా’
దిశ, వెబ్‌డెస్క్: వాసన, రుచి కోల్పోవడం కరోనా వైరస్ ప్రధాన లక్షణాలు కాగా, దాదాపు మూడింట రెండు వంతుల కేసులను ఇది ప్రభావితం చేస్తోంది. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలా మందిలో వాసన చూడటం, రుచి చూసే జ్ఞానం తిరిగి పొందగా కొందరిలో మాత్రం ఇది భిన్నమైన లక్షణాలు చూపిస్తోంది. దాంతో ఆహార పదార్థాల వాసనలు దుర్గంధపూరితంగా, చెడు వాసనలు సువాసనలుగా అనిపిస్తున్నాయి. దీన్నే ‘పారోస్మియా’ అంటారు. ఈ సమస్య బారినపడుతున్నవారి సంఖ్య క్రమంగా […]
దిశ, వెబ్‌డెస్క్: వాసన, రుచి కోల్పోవడం కరోనా వైరస్ ప్రధాన లక్షణాలు కాగా, దాదాపు మూడింట రెండు వంతుల కేసులను ఇది ప్రభావితం చేస్తోంది. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలా మందిలో వాసన చూడటం, రుచి చూసే జ్ఞానం తిరిగి పొందగా కొందరిలో మాత్రం ఇది భిన్నమైన లక్షణాలు చూపిస్తోంది. దాంతో ఆహార పదార్థాల వాసనలు దుర్గంధపూరితంగా, చెడు వాసనలు సువాసనలుగా అనిపిస్తున్నాయి. దీన్నే ‘పారోస్మియా’ అంటారు. ఈ సమస్య బారినపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
సాధారణంగా జలుబు చేసిన, తీవ్రమైన జ్వరం వచ్చినా రుచి, వాసన సామర్థ్యాలను కోల్పోతారన్న విషయం తెలిసిందే. అయితే ‘సైనస్’తో బాధపడే కొంతమందిలో మాత్రం తరుచుగా సిగరెట్ వాసనలు, దుర్గంధపూరితమైన కెమికల్ వాసనలు వస్తుంటాయి. ఇదే లక్షణం కొవిడ్ బాధిత వ్యక్తుల్లోనూ కనిపించింది. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఈ లక్షణం నుంచి బయటపడ్డారు. కానీ, కొందరిలో మాత్రం ఆ వాసన సామర్థ్యం భిన్నంగా మారిపోతోంది.
ఈ క్రమంలో మాంసం, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, చాకోలేట్, కాఫీ, కూరగాయలు, పండ్లు, కుళాయి నీళ్లు, వైన్ నెయిన్ పాలిష్ వంటి పదార్థాల వాసన దుర్గంధపూరితంగా తోస్తుండగా, బాత్రూంలో వచ్చే వాసనలు, కాలిపోతున్న రబ్బర్ వాసన, సిగరెట్ స్మోక్, మురుగు నీరు తదితర మురుగు వాసనలు మంచి స్మెల్‌లా అనిపిస్తాయి. దీన్నే ‘పారోస్మియా’ అంటారు. ఘ్రాణ శక్తిని మెదడుకు చేరవేసే నాడీ కణాలు దెబ్బతినడం వల్ల..లేదా వైరస్ కారణంగా తప్పుడు సంకేతాలను చేరవేయడం ద్వారా ఇటువంటి ‘పారోస్మియా’ వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. పారోస్మియాతో బాధపడుతున్న వారిలో 90 శాతం మంది కొంతవరకు కోలుకుంటారని గణాంకాలు చెబుతుండగా, మిగతా 10 శాతానికి మాత్రం ఏళ్లు పట్టొచ్చు. పారోస్మియా బాధితుల్లో కొందరు తమకు దుర్గంధం రాని ఆహార పదార్థాలను ఎంచుకుని, తింటున్నారు.
‘కొవిడ్ వల్ల ఇద్దరు వ్యక్తులలో ఒకరు వాసన సామర్థ్యాన్ని కోల్పోతారు. తొంభై శాతం మంది రెండు లేదా మూడు వారాల్లో తిరిగి పొందుతారు. కానీ పదిమందిలో ఒకరికి దీర్ఘకాలిక వాసన తగ్గుతుంది. ఆ సమయంలో పారోస్మియా వస్తుంది. యూకేలో ప్రస్తుతం 1,85,000 మందికి దీర్ఘకాలిక వాసన నష్టం ఉందని మేము లెక్కించాం. పారోస్మియా ఉన్న వారికి కాల్చిన మాంసాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్లు, కాఫీ, చాక్లెట్ వాసనలు పడవు. దీంతో వాళ్లు ఆహారం తినక బరువు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇది ప్రజల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే వాసన, ఐదు ఇంద్రియాలలో ఒకటి. మానవ సంబంధాలు, ఆనందాలు, జ్ఞాపకాలు అన్నీ వాసనల చుట్టూ ఏర్పడతాయి’ అని అబ్సెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారా ఓక్లే తెలిపారు. అబ్సెండ్ అనేది ఓ చారిటి సంస్థ. ఇది స్మెల్ డిజార్డర్స్ మీద ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.