భయంతోనే దాచేస్తున్నారు.. అయినా దాగుతుందా?

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా లక్షణాలున్నా.. వైరస్ సోకినా.. చెప్పకుండా కొందరు దాచేస్తున్నారు. పరీక్షలు చేసుకోకుండా కుంటి సాకులతో తప్పించుకుంటున్నారు. సమాజంలో కొవిడ్ పేషెంట్ పట్ల చూపుతున్న వివక్ష, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై అపనమ్మకం, కార్పొ‘రేట్’దవాఖానాల్లో వైద్యం పేరిట దండుకుంటున్న తీరు, కరోనా‌తో సహాజీవనం చేయాల్సిందేనంటున్న ప్రభుత్వ పెద్దల ప్రకటనలు.. ఇలా కారణమేదైనా కొవిడ్ బాధితులు మాత్రం రోగాన్ని దాచిపెడుతున్నారు. వైరస్ బారిన పడినా.. వైద్యం చేయించుకోకుండా సమాజంలో కలిసిపోయి ఇతరులకు అంటిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే […]

Update: 2020-07-15 22:31 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా లక్షణాలున్నా.. వైరస్ సోకినా.. చెప్పకుండా కొందరు దాచేస్తున్నారు. పరీక్షలు చేసుకోకుండా కుంటి సాకులతో తప్పించుకుంటున్నారు. సమాజంలో కొవిడ్ పేషెంట్ పట్ల చూపుతున్న వివక్ష, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై అపనమ్మకం, కార్పొ‘రేట్’దవాఖానాల్లో వైద్యం పేరిట దండుకుంటున్న తీరు, కరోనా‌తో సహాజీవనం చేయాల్సిందేనంటున్న ప్రభుత్వ పెద్దల ప్రకటనలు.. ఇలా కారణమేదైనా కొవిడ్ బాధితులు మాత్రం రోగాన్ని దాచిపెడుతున్నారు. వైరస్ బారిన పడినా.. వైద్యం చేయించుకోకుండా సమాజంలో కలిసిపోయి ఇతరులకు అంటిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి సరైన ట్రీట్ మెంట్ ఇవ్వకపోవడం, లక్షణాలున్న వారికి వెంటనే టెస్టులు చేసి హోం క్వారంటైన్ చేయకపోవడం, చికిత్స అందించడంలో సర్కారు స్పందన సరిగా లేకపోవడం వల్లే బాధితులు అలా చేస్తున్నారని అంటున్నారు. పక్క రాష్ట్రం ఏపీలో గ్రామ వాలంటీర్ల చేత సర్వే చేయించి, దేశంలోనే ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేసి, కొవిడ్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటుంటే..ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో మాత్రం కరోనా పరిస్థితి ఆధ్వానంగా తయారైందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మనవాళ్లే దూరం పెడుతుంటే..

కరోనా వైరస్ సోకిన వ్యక్తితోపాటు కుటుంబాన్ని సమాజం వెలివేసినంత పనిచేస్తోంది. ఆ ఇంటిని, కుటుంబీకులను సమీప బంధువులు కూడా పలకరించే పరిస్థితి ఉండదు. రోగం వచ్చి ఆస్పత్రిలో చేరితే నా అనే వాళ్లు తోడుండరు. నొప్పి వచ్చినా..ఆకలి వేసినా..పట్టించుకునే దిక్కుండదు..కరోనాతో చనిపోతే శ్మశానంలో చోటుండదు.. కుటుంబీకులు కడసారి వీడ్కోలు పలికే అవకాశం ఉండదని.. కరోనా బారిన పడినా పలువురు చెప్పకుండా దాచి పెడుతున్నారు. కొందరు వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లి అష్ట కష్టాలు పడటం కంటే.. హోం క్వారైంటైన్‌లో ఉంటూ.. సొంత వైద్యం చేసుకుంటున్నారు. పలు సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో వస్తున్న సమాచారాన్ని ఫాలో అవుతూ రోగ నిరోధకశక్తిని పెంపొందించేందుకు ఆయా పద్ధతులను అవలంభిస్తున్నారు. అయితే క్వారంటైన్ టైంలో సొంత వైద్యం చేసుకున్న తర్వాత ఆరోగ్యం కొంత మెరుగు పడిందనుకొని కొవిడ్ టెస్టులు చేయించుకోకుండానే అందరితో కలిసిపోతూ ఇతరులకు వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు.

ప్రభుత్వాస్పత్రుల్లో పైపైనే సేవలు..

కరోనా రోగులకు హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలో సేవలందిస్తున్నారు. అక్కడ మినహా మిగతా అన్ని ఆస్పత్రులలో సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనికి తోడు గాంధీలో బెడ్లు లేవని ప్రచారం జరుగుతుండగా నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా కొవిడ్ మహమ్మారి నగరంలో వేగంగా విస్తరిస్తోంది. గచ్చి బౌలి టిమ్స్‌లో ఇంకా వైద్య సేవలు ప్రారంభం కాలేదు. దాంతో అప్పో.. సప్పో చేసి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే బిల్లులు తడిసి మోపెడవుతాయని పలువురు భయపడుతున్నారు. నగరంలో ఇప్పుడు చిన్నా చితక నర్సింగ్ హోంలు, ఆస్పత్రులలో కరోనా పేషెంట్లు చేర్చుకోవడం లేదు. అయితే పలు కార్పొరేట్ ఆస్పత్రులలో చేర్చుకుంటున్నారు. కానీ, బిల్లు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఒక్కో పేషెంట్‌కు సగటున రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. దాంతో ఆస్పత్రులకు వెళ్తే ఉన్నదంతా అమ్ముకోవాలేమోనని కొంత మంది కరోనాను తమలోనే దాచుకుంటూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు ప్రజలకు కొవిడ్‌పై మరింత అవగాహన కల్పించాలని టెస్టులు విస్తృతంగా చేయాలని, అందుకు ప్రజలు సహకరించేలా చూడాలని, లక్షణాలున్నవారికి వెంటనే టెస్టులు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

లక్షణాలుంటే టెస్టులు తప్పనిసరి : డాక్టర్ చంద్రశేఖర్, ఎండీ ఫిజీషియన్

కరోనా లక్షణాలంటే తప్పకుండా టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ టెస్టులు చేయించుకోక బయట తిరిగితే ముందుగా మీ కుటుంబ సభ్యులతోపాటు మిమ్మిల్ని కలిసిన వారికి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. టెస్టులు చేయించుకోని సరైన ట్రీట్ మెంట్ తీసుకుంటే మీతో పాటు మిగితా వారందరినీ రక్షించుకోవచ్చు. రోగాన్ని దాచిపెడితే నేరం కిందకు వస్తుంది. అలా దాచి పెట్టడం వల్ల సమాజానికి కీడు జరుగుతుంది.

Tags:    

Similar News