పవన్ కల్యాణ్‌ది.. రాజకీయమా? స్పందనా?

జనసేనాని పవన్ కల్యాణ్ కర్నూలు పర్యటన ఇంకా ఆరంభం కాకుండానే విమర్శల్ని తెచ్చి పెట్టింది. సుగాలి ప్రీతి మరణించి నేటికి మూడేళ్లు కావస్తోంది. ఇప్పటికి పవన్ కల్యాణ్ స్పందించడంపై కొన్ని వర్గాలు మండిపడుతుండగా.. ఇప్పటికైనా స్పందించారంటూ మరికొన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బడాబాబులు అండగా ఉన్న ఈ కేసును పవన్ ముందుకు తీసుకెళ్తాడా? లేక రాజకీయ అవకాశంగా మలచుకుంటాడా? అన్న ఆసక్తి అందర్లోనూ రేగుతోంది. కాగా కర్నూల్ జిల్లా దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్సియల్ […]

Update: 2020-02-12 03:13 GMT

జనసేనాని పవన్ కల్యాణ్ కర్నూలు పర్యటన ఇంకా ఆరంభం కాకుండానే విమర్శల్ని తెచ్చి పెట్టింది. సుగాలి ప్రీతి మరణించి నేటికి మూడేళ్లు కావస్తోంది. ఇప్పటికి పవన్ కల్యాణ్ స్పందించడంపై కొన్ని వర్గాలు మండిపడుతుండగా.. ఇప్పటికైనా స్పందించారంటూ మరికొన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బడాబాబులు అండగా ఉన్న ఈ కేసును పవన్ ముందుకు తీసుకెళ్తాడా? లేక రాజకీయ అవకాశంగా మలచుకుంటాడా? అన్న ఆసక్తి అందర్లోనూ రేగుతోంది.

కాగా కర్నూల్ జిల్లా దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్సియల్ స్కూల్‌లో ప్రీతి టెన్త్ చదువుతోంది. 2017లో ఆగస్టు 19న ఆమెపై ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కుమారులు అత్యాచారం చేసి హాస్టల్‌లోనే ఉరేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ర్టవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపారు. అనంతరం బెయిల్‌పై బయటకొచ్చిన నిందితులు దర్జాగా తిరగడం మొదలుపెట్టారు.

నిందితుల కుటుంబానికి రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడానికి తోడు సామాజికంగా, ఆర్థికంగా బలవంతులు కావడంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చేశారు. ఈ కేసు మూడేళ్లైనా బలమైన సాక్ష్యాలు లేవంటూ వాయిదాలపై వాయిదాలు పడుతున్నాయి. ఏదైనా కేసులో నిందితులకు శిక్ష పడాలంటే ఛార్జిషీట్ బలంగా ఉండాలి. ఈ ఛార్జిషీట్ తయారు చేసేది పోలీసులే.. అందుకే ఏదైనా కేసు నిలబడాలన్నా.. నీరుగారాలన్నా పూర్తి బాధ్యత పోలీసులపైనే ఉంటుంది. ఈ కేసు కూడా పోలీసులపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే ఛార్జిషీటు దాఖలైన ఈ కేసులో భాధిత కుటుంబం సీబీఐ విచారణ కోరుతోంది.

నిర్భయ తల్లి చేసిన పోరాటం స్పూర్తిగా వికలాంగురాలైన ప్రీతి తల్లి చేస్తున్న పోరాటం కూడా మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ కేసుపై గొంతెత్తేందుకు, ప్రశ్నించేందుకు పవన్ కల్యాణ్ కర్నూలు రానున్నారు. అయితే ఆయన ఎవరికి అనుకూలంగా గొంతెత్తుతారు? ఎవరిని ప్రశ్నిస్తారు? అన్న ప్రశ్నలు అందర్లో ఆసక్తి రేపుతున్నాయి. ఎందుకంటే.. ఈ వివాదం రేగినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆయనకి అన్ని విధాలుగా సహకరించిన టీడీపీ ప్రభుత్వమే.. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు స్థానిక టీడీపీ కీలక నేత. టీడీపీకి బేషరతుమద్దతిచ్చే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆపార్టీపై ఎలాంటి పోరాటం చేస్తారు? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

అలా కాకుండా వైఎస్సార్సీపీ అంటే ఒంటికాలిపై లేచే పవన్ కల్యాణ్ ఈ కేసును అడ్డం పెట్టుకుని మరోసారి వైఎస్సార్సీపీపై ఎగసిపడతారా? అన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. మరోవైపు పార్టీ పెట్టిన నాటినుంచి ప్రజల్లో క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో పవన్ వెనకబడ్డ సంగతి తెలిసిందే. ఆయన సభలకు కేవలం ఆయనను చూసేందుకు మాత్రమే వస్తారన్న సంగతి గత ఎన్నికల్లో నిరూపించబడింది కూడాను. ఈ నేపథ్యంలో ఆయన నేటి సాయంత్రం నిర్వహించనున్న బహిరంగ సభలో మిత్రపక్షమైన టీడీపీ నేతపై ఎలాంటి డిమాండ్లు చేయనున్నారు? ఈ పర్యటనను రాజకీయ లబ్దికి ఉపయోగించుకోనున్నారా? లేక బాధితురాలకి న్యాయం జరగాలన్న ఒకే లక్ష్యంతో ర్యాలీ నిర్వహించనున్నారా? అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

సుగాలి ప్రీతి అంశంలో నిందితులు కోరుకునే న్యాయాన్ని ఆయన ఎలా అందించే ప్రయత్నం చేస్తారన్నది అందర్లోనూ ఆసక్తి రేపుతోంది. కలిసిన ప్రతినేతా తమకు న్యాయం చేస్తానని చెప్పిన వారేనని, చేతల దగ్గరకి వచ్చేసరికి ఎవరూ సహాయం చేయడం లేదని హతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రీతి హంతకులకు శిక్ష వేయాలని గొంతువిప్పడంతోనే కొంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో ప్రజా, విద్యార్థి సంఘాలన్నీ ప్రీతికి అనుకూలంగానే ఉన్నాయి. ఆమెకు న్యాయం జరగాలనే కోరుకుంటున్నాయి. మరి పవన్ చొరవతోనైనా నిందితులకు శిక్ష పడాలని అంతా కోరుకుంటున్నారు.

Tags:    

Similar News