బీజేపీ అంటే భారతీయ జగన్ పార్టీ.. పయ్యావుల కేశవ్
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలోని బీజేపీపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ వేరు.. రాష్ట్రంలో బీజేపీ వేరు అంటూ విమర్శలు చేశారు. దేశంలో పార్టీకి జనసేన మిత్రపక్షం అయితే రాష్ట్రంలో మాత్రం జగన్ పార్టీ మిత్రపక్షం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేదని.. భారతీయ జగన్ పార్టీ కొనసాగుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో నేడు జరుగుతున్న ప్రజాగ్రహ సభ ఓ బూటకం అని.. ఈ […]
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలోని బీజేపీపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ వేరు.. రాష్ట్రంలో బీజేపీ వేరు అంటూ విమర్శలు చేశారు. దేశంలో పార్టీకి జనసేన మిత్రపక్షం అయితే రాష్ట్రంలో మాత్రం జగన్ పార్టీ మిత్రపక్షం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేదని.. భారతీయ జగన్ పార్టీ కొనసాగుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో నేడు జరుగుతున్న ప్రజాగ్రహ సభ ఓ బూటకం అని.. ఈ ఏడాదికి ఇదే అతి పెద్ద జోక్ అని చెప్పారు.
అంతేకాదు ఆ సభకు ప్రజాగ్రహ సభ కాకుండా జగన్ అనుగ్రహ సభ అని పేరు పెడితే బాగుండేదని పయ్యావుల కేశవ్ ఘాటు విమర్శలు చేశారు. కేంద్రంలో నాయకత్వం సరిగ్గానే ఉన్నా రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం సరిగ్గా లేదని విమర్శించారు. రాజధాని అంశం పై అమిత్ షా చెబితే తప్ప ఇక్కడి వారు రాజధానికి మద్దతు ఇవ్వలేదు. బీజేపీ జాతీయ నేత ప్రకాష్ జవదేకర్‌కు ఒక్కటే చెప్తున్నా రాష్ట్రంలో బీజేపీ లేదు భారతీయ జగన్ పార్టీ మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు.
‘చైనాలో వచ్చిన కరోనాకు మందు కనుగొన్నాం. కానీ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు మాత్రం మందు కనుక్కోలేదు. బీజేపీ బ్రాండ్ హిందుత్వంపై దాడులు జరుగుతుంటే ఇక్కడ మౌనంగా ఉంటుంది. ధర్మకర్త అశోక్ గజపతిరాజు పై దాడి జరిగితే బీజేపీ మౌనంగా ఉంది. దేశం మొత్తంలో బీజేపీ మోడీ , షా ఆదేశాలతో పనిచేస్తుంటే ఇక్కడ జగన్ కనుసన్నుల్లో పనిచేస్తోంది. ఓ ఎంపీని చంపే అంత పని చేశారు. ఓ బాబాయ్‌ని చంపితే ఇప్పటికీ నిందితులు ఎవరో తెలియదు. ఓ డాక్టర్‌ని కొట్టి చంపితే అతిగతి లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అత్యాచారాలపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించే దమ్ము బీజేపీకి ఉందా’ అని పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర బీజేపీలో ట్రాన్స్ లేషన్, ట్రాన్స్ మిషన్ లాసెస్ చాలా ఉన్నాయి. ప్రజల కంటే ప్రభుత్వం కోసం ఇక్కడ పార్టీ పనిచేస్తోంది. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రం ముద్ర వేసుకున్న, పంచాయతీ నిధులు వాడుకున్నా ఇక్కడి బీజేపీ గమ్మునుంది. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కోసం పనిచేస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను అని చెప్పి.. యుద్ధం చేయకనే విరామం ప్రకటించిన వ్యక్తిని ముందు పెట్టుకొని యుద్ధం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన టీడీపీ పోరాడుతోంది. రాబోయే రోజుల్లో టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ధీమా వ్యక్తం చేశారు.