ఆరు నెలలుగా నిర్లక్ష్యం..ఇప్పుడు ప్రభుత్వం ఉరుకులు, పరుగులు

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతి పెరిగే అవకాశం ఉందని ముందే హెచ్చరికలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆఘమేఘాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. గతేడాది సెప్టెంబరులో అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైనప్పుడే పార్లమెంటరీ స్థాయీ సంఘం అప్రమత్తమైంది. అక్టోబరులో సమావేశం నిర్వహించింది. ఏమేం చర్యలు తీసుకోవాలో లిఖితపూర్వకంగానే సిఫారసులు చేసింది. కానీ ఆ దిశగా ఆరు నెలల పాటు ఎలాంటి స్పందనా లేదు. […]

Update: 2021-04-25 08:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతి పెరిగే అవకాశం ఉందని ముందే హెచ్చరికలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆఘమేఘాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. గతేడాది సెప్టెంబరులో అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైనప్పుడే పార్లమెంటరీ స్థాయీ సంఘం అప్రమత్తమైంది. అక్టోబరులో సమావేశం నిర్వహించింది. ఏమేం చర్యలు తీసుకోవాలో లిఖితపూర్వకంగానే సిఫారసులు చేసింది. కానీ ఆ దిశగా ఆరు నెలల పాటు ఎలాంటి స్పందనా లేదు. చివరికి పీకలదాకా వచ్చిన తర్వాత హడావిడి తప్పలేదు. వైద్యారోగ్య రంగానికి నిధులను పెంచి ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయాలని కూడా సూచించింది. కానీ నిధులను తగ్గించింది. కరోనా వ్యాక్సిన్ కోసం మాత్రం అదనంగా కేటాయింపులు చేసింది.

ఆక్సిజన్ గురించి ముందే హెచ్చరించిన కమిటీ

గతేడాది కరోనా వైరస్ సృష్టించిన బీభత్సాన్ని పరిగణనలోకి తీసుకున్న పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆక్సిజన్ అవసరాలు పెరుగుతాయని, ఉత్పత్తిని పెంచడంతో పాటు సిలిండర్ల తయారీని కూడా మెరుగుపర్చాలని కేంద్ర ప్రనుత్వానికి సిఫారసు చేసింది. అందరికీ ఆమోదయోగ్యమైన ధరల్లో సిలిండర్లు అందుబాటులోకి తెస్తే ఆక్సిజన్ సమస్యలు తలెత్తవని స్పష్టం చేసింది. ఇందుకోసం గరిష్ట ధరలను నిర్ణయించాల్సిందిగా నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ చొరవ తీసుకోవాలని పేర్కొంది. కానీ ఇప్పటివరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో విదేశాల నుంచి సైతం ఆక్సిజన్‌ను, క్రయోజెనిక్ టాంకర్లను యుద్ధ విమానాల ద్వారా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, షిప్పింగ్ ఛార్జీలు తదితరాలన్నింటినీ మూడు నెలల పాటు రద్దు చేయాలన్న నిర్ణయాన్ని కూడా తీసుకుంది.

పార్లమెంటరీ స్థాయి సంఘం గతేడాది అక్టోబరులో సిఫారసు చేసినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఆక్సిజన్ దొరకక వేలాది మంది ఇప్పుడు చనిపోయి ఉండేవారు కాదు. ఆక్సిజన్‌కు కొరత లేనప్పటికీ దాన్ని సకాలంలో పేషెంట్లకు అందుబాటులో ఉండేలా ముందుగానే సమకూర్చుకుని ఉంటే ఇప్పుడు దేశంలో ఇంతటి విపత్కర పరిస్థితి తలెత్తేది కాదు. గతేడాది అక్టోబరులో పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు దేశం మొత్తం మీద ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్ని బెడ్‌లు ఉన్నాయి, ఎన్నింటికి ఆక్సిజన్ సౌకర్యం ఉంది, ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయి, కరోనా కారణంగా అదనంగా సమకూర్చుకున్నవి ఎన్ని తదితర వివరాలను వెల్లడించారు.

కరోనా అవసరాల కోసం సమకూర్చుకున్న మౌలిక సదుపాయాలు…

కొత్తగా ఆస్పత్రి సౌకర్యాలు : 3,914
సాధారణ బెడ్‌లు : 3,77,737
ఐసీయూ బెడ్‌లు : 39,820
ఆక్సిజన్ బెడ్‌లు : 1,42,415
వెంటిలేటర్లు : 20,047

వివిధ రాష్ట్రాలన్నింటిలో కలిపి అదనంగా అందుబాటులోకి వచ్చినవి :

కొత్తగా ఆస్పత్రి సౌకర్యాలు : 15,239
సాధారణ బెడ్‌లు : 12,73,100
ఐసీయూ బెడ్‌లు : 76,709
ఆక్సిజన్ బెడ్‌లు : 2,64,107
వెంటిలేటర్లు : 39,476
వార్డులుగా మారిన రైల్వే కోచ్‌లు : 736
అందుబాటులోకి వచ్చిన బెడ్‌లు : 12,472

కమిటీ చేసిన సిఫారసులేంటి?

దేశం మొత్తం మీద రోజుకు సుమారు 6,900 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నదని, ఇందులో కోవిడ్ పరిస్థితులకు ముందు సగటున రోజుకు వెయ్యి టన్నులు మాత్రమే వైద్య అవసరాలకు వాడుతున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు పార్లమెంటరీ కమిటీకి వివరించారు. కానీ కరోనా తదనంతర పరిస్థితుల్లో రోజుకు సగటున 3,000 టన్నులకు పెరిగిందని పేర్కొన్నారు. సెప్టెంబరు నాల్గవ వారంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న సమయంలో కూడా మూడు వేల టన్నులకు మించి అవసరం ఏర్పడలేదని తెలిపారు. మిగిలిన ఆక్సిజన్ పారిశ్రామిక అవసరాలకు వాడుతున్నట్లు వివరించారు.

వైద్యారోగ్య శాఖ అధికారుల బ్రీఫింగ్‌తో భవిష్యత్తులో మరింతగా ఆక్సిజన్ అవసరాలు పెరుగుతాయని అంచనా వేసిన పార్లమెంటరీ కమిటీ వైద్య అవసరాలకు ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని, సిలిండర్లను మరింత ఎక్కువ సంఖ్యలో తయారుచేసి ప్రజల కొనుగోలు శక్తికి అనుగుణంగా గరిష్ట ధరలను నిర్ణయించాలని సిఫారసు చేసింది. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు కొరత లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు సిలిండర్లను అందుబాటులోకి తేవాలిన స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లోని బెడ్‌ల సామర్థ్యం, ఆక్సిజన్‌కు పెరిగే డిమాండ్ తదితరాలను దృష్టిలో పెట్టుకుని సమృద్ధిగా ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గతేడాది ఆక్టోబరు చివరి వారంలో సిఫారసు చేసింది.

నిజానికి గతేడాది జూలైలోనే కేంద్ర వైద్యారోగ్య శాఖ 1.02 లక్షల కొత్త ఆక్సిజన్ సిలిండర్లకు ఆర్డర్ ఇచ్చి 80 వేలకు పైగా వివిధ రాష్ట్రాలకు పంపించింది. కానీ పార్లమెంటరీ కమిటీ సిఫారసులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇప్పుడు ఆక్సిజన్ దొరకక ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. సిలిండర్లకు కొరత ఏర్పడింది. ఆక్సిజన్ ఉత్పత్తి ఎలా ఉన్నా ప్రజలకు మాత్రం అందుబాటులోకి రాలేదు. రవాణా సమస్యలను పరిష్కరించకపోవడంతో రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తయారుచేసే స్టీల్ ప్లాంట్లకు యుద్ధ విమానాల్లో ఖాళీ టాంకులను తరలించాల్సి వచ్చింది. ప్రత్యేకంగా రైల్వే గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటుచేసి ఆక్సిజన్‌తో నిండిన టాంకర్లను గూడ్సు రైళ్ళ ద్వారా తరలించాల్సి వస్తోంది. ఈ నాలుగైదు రోజుల సమయంలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడి అన్ని ప్రధాన నగరాల్లో వేలాది మంది పేషెంట్లు చనిపోతున్నారు. కరోనాతో చనిపోవడంకంటే ఆక్సిజన్ అందక చనిపోయేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Tags:    

Similar News