ఈ వార్త మీ కోసమే
‘‘కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిండు. ఏండ్ల తరబడి పని చేయించుకున్నరు. హోంగార్డుల పరిస్థితి అయితే దారుణంగా ఉండేది. కనీస వేతనాలు ఇచ్చేది కాదు. లేబర్ కేసు పెట్టమని నేనే చెప్పిన. నెలో, వారం రోజులో అంటే ఏదో అనుకుంటం. ఏండ్ల తరబడి పని చేయించుకుని ఉద్యోగ భద్రత లేకుండా చేస్తే ఎట్ల బతుకుతరు? ఇది దుర్మార్గం… వాళ్లందరినీ రెగ్యులర్ చేస్తాం. 27 అక్టోబర్ 2017న నిండు శాసనసభలో సీఎం […]
‘‘కాంట్రాక్ట్,
ఔట్‌సోర్సింగ్
ఉద్యోగాల నియామకానికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిండు. ఏండ్ల తరబడి పని చేయించుకున్నరు. హోంగార్డుల పరిస్థితి అయితే దారుణంగా ఉండేది. కనీస వేతనాలు ఇచ్చేది కాదు. లేబర్ కేసు పెట్టమని నేనే చెప్పిన. నెలో, వారం రోజులో అంటే ఏదో అనుకుంటం. ఏండ్ల తరబడి పని చేయించుకుని ఉద్యోగ భద్రత లేకుండా చేస్తే ఎట్ల బతుకుతరు? ఇది దుర్మార్గం… వాళ్లందరినీ రెగ్యులర్ చేస్తాం. 27 అక్టోబర్ 2017న నిండు శాసనసభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది.
దిశ, న్యూస్ బ్యూరో: ‘‘సమాన పనికి సమాన వేతనం ఇస్తం. ఉద్యోగ భద్రత కల్పిస్తం. అన్ని ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన చేపడుతం. గత ప్రభుత్వాలు ఉద్యోగులను అర్థాకలితో పని చేయించుకున్నాయి. సిబ్బంది క్రమబద్దీకరణలో రూల్ అఫ్ రిజర్వేషన్ పాటిస్తం. శాశ్వత ఉద్యోగులను నియమించుకుంటం. ఔట్‌సోర్సింగ్ తీసుకోవడం నిలిపేస్తున్నాం. సమస్య పరిష్కారం కోసం త్వరలో ఉన్నత స్థాయి కమిటీ నియమిస్తాం” అంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చారు. దీంతో లక్షకు పైగా ఉన్న ఉద్యోగులు ఆనందపడిపోయారు. అమలు మాత్రం కాలేదు. హామీ అలాగే మిగిలిపోయింది. చివరకు ఉన్న ఉద్యోగాలు కూడా దక్కకుండా పోయే ప్రమాదం నెలకొంది. గత ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోసిన సీఎం కేసీఆర్ తన పాలనలోనూ అదే వైఖరిని అవలంబిస్తున్నారని తాత్కాలిక ఉద్యోగులు వాపోతున్నారు.
కొత్త ఉద్యోగాలు లేవు
కొత్త ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. తీసుకునే ఉద్యోగాల్లోనూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ ద్వారా టిమ్స్ లో 662 పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం జూన్ రెండున జీవో నెంబరు 872ను జారీ చేసింది. ఏడాది కాలానికి 502 కాంట్రాక్ట్, 148 ఔట్ సోర్సింగ్, 12 పోస్టులను డిప్యూటేషన్‌పై తీసుకుంటామని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొంది. జూన్ 25న ఆర్థిక శాఖ జీవో నెంబర్ 888ను విడుదల చేసింది. వైద్యారోగ్య శాఖలోనే 82 పోస్టులను ఆరు నెలల కాలానికి భర్తీ చేస్తామని అందులో పేర్కొంది. వీరిని కేవలం ఔట్ సోర్సింగ్ పద్దతిన తీసుకుంటామని వెల్లడించింది. ఇదే శాఖలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 604 పోస్టులకు గత నెల 25న ప్రభుత్వం జీవో నెంబర్ 902 జారీ చేసింది. 604 పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో తీసుకుంటామని, ఏడాది పాటు పని చేయాలని జీవోలో స్పష్టం చేసింది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అంశంలో సీఎం కేసీఆర్ గతంలో చేసిన ప్రకటనలకు ఇప్పుడు వెలువడుతున్న నోటిపికేషన్లకు పొంతన లేకుండా పోతోంది.
క్రమబద్ధీకరణ ఏమైంది?
ఉమ్మడి పాలనలో ఇలాంటి ఉద్యోగులను చాలా బాధలు పెట్టారని పదేపదే చెప్పిన సీఎం కేసీఆర్ వారందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక శాఖ కూడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసింది. రాష్ట్రంలో సుమారు 1.28 లక్షల మంది ఇలా పని చేస్తున్నట్లు తేలింది. రెగ్యులరైజేషన్ ప్రక్రియ మాత్రం అడుగు ముందుకు పడలేదు. కాంట్రాక్ట్ లెక్చరర్లు, డాక్టర్లు, నర్సులు ఇలా ఎవరూ ఉండదరాదని నొక్కి చెప్పినప్పటికీ, ఒక్కరినీ కూడా పర్మినెంట్ చేయలేదు. పదేపదే ఆందోళనలు జరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని మళ్లీ ప్రకటించారు. ముందుగా ఐకేపీ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నామన్నారు. ఐకేపీ ఉద్యోగులను ఆహార శుద్ది కేంద్రాల్లో వాడుకుంటామని ప్రకటించారు. కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ మొదలే కాలేదు. ప్రస్తుతం పలు శాఖల్లో ఉద్యోగుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.
ఒక్కొక్కరిగా తొలగింపు
రాష్ట్రంలో కరోనాతో ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను ప్రభుత్వం అవకాశంగా మల్చుకుంటోంది. ఖజానాపై భారం పడుతుందనే కారణంతో ఉద్యోగులను తొలగిస్తోంది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులనుఇంటికి పంపిస్తోంది. ఇప్పటికే ఉపాధిహామీలో దాదాపు తొమ్మిది వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగించింది. సమ్మెకు పోయిన ఫీల్డ్ అసిస్టెంట్లు తమకు తాముగా వచ్చి విధుల్లో చేరుతామని మొరపెట్టుకుంటున్నా వద్దు పొమ్మంటున్నారు. మిషన్ భగీరథ పథకంలో 704 మందిని తొలగించింది. గత నెల 30న వీరి ఆఖరి పని దినంగా పేర్కొంటూ ఇంటికి పంపించింది. 2015లో నియమితులైన 662 మంది వర్క్ ఇన్స్ పెక్టర్లు, 47 మంది జూనియర్ అసిస్టెంట్లు ఇందులో ఉన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న కొంతమందిని కూడా పంపించే ప్రయత్నాలు మొదలయ్యాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే వారిని ఫీల్డ్ కు పంపించేలా ఉత్తర్వులిచ్చారు. వాస్తవంగా వారంతా ఫీల్డ్ తో సంబంధం లేని ఉద్యోగులు. వీరిని ఇంటికి పంపించే నేపంతోనే ఈ ప్రక్రియను చేపట్టారు. ఉపాధిహామీలో కూడా ఉద్యోగులను తొలగించే కుట్ర మొదలైంది. అన్ని శాఖలకు సంబంధించిన పనులన్నీ దాదాపు ఉపాధిలోనే చేడుతున్నారు. వాటి పర్యవేక్షణను ఆయా శాఖల మండల అధికారులకు అప్పగిస్తున్నారు. నీటిపారుదల శాఖ పరిధిలోని కాల్వల పనులు ఉపాధిహామీలో చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటి పర్యవేక్షణను ఐబీ శాఖకు అప్పగించారు. ఇటీవల ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది చర్చల సందర్భంలో ప్రభుత్వానికి ఓ నిబంధన విధించారు. ప్రస్తుతం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో వైద్య సిబ్బందిని నియమించి, కరోనా ప్రభావం తగ్గిన తర్వాత తీసేస్తే పరిస్థతి ఏమిటని ప్రశ్నించారు. శాశ్వత ప్రాతిపదికన నియమించాలని షరతు విధించారు. కానీ, ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంతోనే నియామక ప్రక్రియ మొదలుపెట్టింది.