16 నుంచి ఓయూ హాస్టళ్లు ప్రారంభం
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 16 నుంచి హాస్టళ్లను తెరిచేందుకు ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను యూనివర్సిటీ రిజిస్ట్రార్ విడుదల చేశారు. హాస్టల్స్, మెస్‌ను కూడా ప్రారంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంతో పాటు నాన్-బోర్డర్ సమస్యను తగ్గించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అనుమతి ఉన్న విద్యార్థులు మాత్రమే కొవిడ్ నిబంధనలను పాటిస్తూ హాస్టళ్లకు రావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇన్నాళ్లు మూతబడడం ఇదే తొలిసారి లాక్‌డౌన్ తర్వాత కళాశాలలు భౌతిక తరగతులను […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 16 నుంచి హాస్టళ్లను తెరిచేందుకు ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను యూనివర్సిటీ రిజిస్ట్రార్ విడుదల చేశారు. హాస్టల్స్, మెస్‌ను కూడా ప్రారంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంతో పాటు నాన్-బోర్డర్ సమస్యను తగ్గించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అనుమతి ఉన్న విద్యార్థులు మాత్రమే కొవిడ్ నిబంధనలను పాటిస్తూ హాస్టళ్లకు రావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇన్నాళ్లు మూతబడడం ఇదే తొలిసారి
లాక్‌డౌన్ తర్వాత కళాశాలలు భౌతిక తరగతులను ప్రారంభించాయి. యూనివర్సిటీలు కూడా ఫిజికల్ క్లాసులను ఈ నెల ఒకటి నుంచే ప్రారంభించాయి. అయితే హాస్టళ్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేకపోయాయి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులు కొనసాగుతున్నాయి. అయితే ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే మొదటిసారిగా ఆరు నెలలు హాస్టళ్లు మూతపడటం ఇదే తొలిసారి. వాటర్ లైన్లు, టాయిలెట్లు అధ్వానంగా మారిపోవడంతో పునరుద్ధరించేందుకు కొంత సమయం పట్టినట్టు చీఫ్ వార్డెన్ శ్రీనివాస్‌రావు తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు తాగు నీటి కోసం ఆర్‌ఓ ప్లాంట్లలోని కాయిల్స్ ఆరు నెలలుగా ఉపయోగించకపోవడంతో చెడిపోయినట్టు ఆయన వివరించారు. వినియోగంలోని విద్యుత్ వైర్లు, బోర్డులను కూడా పరీక్షించి విద్యార్థులకు అందుబాటులోకి తేవాల్సి ఉంటుందని తెలిపారు.
కొవిడ్ నిబంధనలతోనే
హాస్టళ్లలో చేరే విద్యార్థులు యూజీసీ నిబంధనలు పాటించేలా చూస్తున్నట్టు ఓయూ అధికారులు స్పష్టం చేశారు. బోర్డర్ విద్యార్థులంతా కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వినియోగించాలని సూచించారు. 2013లో రిజిస్టరయిన రీసెర్చ్ స్కాలర్స్‌తో పాటు నాన్-బోర్డర్లు ఖాళీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. హాస్టల్ గదుల్లోనూ కొవిడ్ రూల్స్ అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక గదిలో ఇద్దరు విద్యార్థులను మాత్రమే అనుమతిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఉన్న కొత్త భవనాలను మాత్రమే ప్రస్తుతం తెరవనున్నారు. రీసెర్చ్ స్కాలర్స్ కోసం ఓల్డ్, న్యూ పీజీ హాస్టళ్లు, ఎన్‌ఆర్ఎస్, కామర్స్ విద్యార్థులకు మంజీరా, నిజాం కాలేజీ బోర్డర్డలకు సరయూ హాస్టల్ భవనాలను అధికారులు కేటాయించారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా యూనివర్సిటీలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ సహకారాన్ని తీసుకుంటున్నారు. హాస్టల్ గదులను పరిశుభ్రం, శానిటైజేషన్ చేసేందుకు ప్రత్యేక నిధులను యూనివర్సిటీ అధికారులు ఖర్చు చేస్తున్నారు.