గల్వాన్ లోయ ఘర్షణకు ఏడాది.. సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్ .!
దిశ, వెబ్‌డెస్క్: భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో సరిగ్గా ఏడాది కిందట నెలకొన్న ఘర్షణ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురిచేసింది. తుపాకీ పేల్చలేదు కానీ సైనికులు వీర మరణం పొందారు. భారత్‌కు చెందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్ కుమార్(సూర్యాపేట), 19 మంది భారత జవానులతో… మొత్తం 20 మంది అమరులయ్యారు. చైనాలో కూడా దాదాపు 45 మంది వరకు సైనికులు మరణించినట్టు జాతీయ మీడియా, భారత అధికారులు తెలిపారు. కానీ, ఈ విషయాన్ని మాత్రం చైనా బయటపెట్టకపోవడం […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో సరిగ్గా ఏడాది కిందట నెలకొన్న ఘర్షణ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురిచేసింది. తుపాకీ పేల్చలేదు కానీ సైనికులు వీర మరణం పొందారు. భారత్‌కు చెందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్ కుమార్(సూర్యాపేట), 19 మంది భారత జవానులతో… మొత్తం 20 మంది అమరులయ్యారు. చైనాలో కూడా దాదాపు 45 మంది వరకు సైనికులు మరణించినట్టు జాతీయ మీడియా, భారత అధికారులు తెలిపారు. కానీ, ఈ విషయాన్ని మాత్రం చైనా బయటపెట్టకపోవడం గమనార్హం.
అసలు ఘర్షణకు ముందు ఏమైంది..
భారత్, చైనా సరిహద్దుల్లో 2020, మే 10న ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు సంకేతాలు వచ్చాయి. సైనికులు ఘర్షణ పడినట్టు వార్తలు ప్రచారం అయ్యాయి. దీనిని పెద్దదిగా చూపొద్దంటూ భారత సైనికాధికారులు మీడియాకు సూచించడంతో అక్కడితో వివాదం ముగిసింది. ఆ తర్వాత మే 21న భారత సైన్యం సరిహద్దులను దాటుతోందని చైనా విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం కాస్తా ముదిరింది. దీనికి స్పందించిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ సైనికుల గస్తీ విధులకు చైనా సైన్యమే అడ్డు తగిలిందని చెప్పారు.
ఈ వివాదాలపై భారత్-చైనా శాంతియుత చర్చలు కూడా జరిపారు. జూన్ 6న లద్ధాఖ్‌లో భారత్-చైనా దౌత్యవేత్తలు, సైనిక కమాండర్ల చర్చలు జరిపారు. ఇదే విషయంపై పలుసార్లు మీటింగ్‌లు పెట్టి.. చర్చలు ఫలించినట్టుగానే ప్రకటించుకున్నాయి ఇరు దేశాలు. కానీ, భారత్-చైనా ప్రకటన విడుదల చేసిన పది రోజులకే యావత్ దేశం ఘోరమైన వార్తను విన్నది. గాల్వన్ లోయలో జూన్ 15, సోమవారం(2020) ఇరుదేశాల సైనికులు పరస్పరం దాడులు చేసుకున్నారు.. డ్రాగన్ దొంగదెబ్బ తీసిందన్న వార్తలు భారత్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘర్షణలో భారత సైనికులకు తీవ్ర గాయాలు కావడంతో మరణించారని ముందుగా వార్తలు రావడంతో చైనాపై మండిపడ్డారు పౌరులు.
మరుసటి రోజు జూన్ 16న ఈ ఘర్షణ జరిగినట్టు ఇరు దేశాలు ధృవీకరించాయి. ఈ దాడిలో మొత్తం 20 మంది భారత సైనికులు మరణించడం భారత దేశాన్ని మరింత కలచివేసింది. అందులో సూర్యాపేట జిల్లా వాసి కల్నల్ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. చైనా మాత్రం నలుగురు సైనికులు చనిపోయారని అధికారికంగా చెప్పినప్పటికీ.. దాదాపు 45 మందికి పైగా మరణించారని ప్రపంచ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.
మోడీ ప్రసంగం..
ఈ పరిణామాలతో భారత ప్రధాని మోడీ సైనికులకు భరోసానిస్తూ ప్రసగించారు. ఎవరినీ మన భూభాగంలోకి అడుగు పెట్టనివ్వలేదని చెప్పారు. అనంతరం జులై 3న లద్ధాఖ్‌లో పర్యటించిన మోడీ భారత సైనికులతో ముచ్టటించారు. విస్తరణ కాంక్షతో వచ్చేవారిపై సైనికులు పోరాడుతున్నారని కొనియాడారు. ఇటువంటి పరిస్థితుల నడుమ కొన్ని రోజులకు భారత్-చైనా ఘర్షణలు తగ్గుముఖం పట్టాయి. చైనా బలగాలను విజయవంతంగా వెనక్కి పంపించగలిగామని ఆగస్టు 31, 2020న భారత్ ప్రకటించింది. ఆ తర్వాత గల్వాన్ లోయలో మరెప్పుడు కూడా ఆ స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకోలేదు.
ప్రతికారమా..?
అయితే, ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి సైనికుల మోహరింపు చర్చనీయాంశం అయింది. ఈ ఘర్షణ జరిగి సరిగ్గా ఏడాది అవుతున్న సందర్భంగా ఇండియా ప్రతికారం తీర్చుకునే అవకాశం ఉందని.. అందుకే సరిహద్దుల్లో 100 యుద్ధవిమానాలతో సైనికులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్టు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది. ఇందుకు స్పందించిన ఎయిర్ మర్షల్ అనిల్ చోప్రా లద్ధాఖ్ సరిహద్దుల్లో భారత సైనికులు కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. సరిహద్దుల్లో యుద్ధవిమానాలు, సైనికులు వెనక్కి వెళ్లకుండా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ, చైనాను ఎదుర్కొనేందుకు భారత బలగాలు ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉన్నారని చెప్పారు. ఇటువంటి ప్రకటనలతో భారత్-చైనా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.