రెవెన్యూ కంటే ప్రజలకే ప్రాధాన్యతనివ్వాలి
సత్యాగ్రహ దీక్షలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశ, న్యూస్ బ్యూరో : కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం.. ఆదాయం కంటే ప్రజల ప్రాణాలకే ఎక్కువ విలువనివ్వాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, నల్గగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. రైతులు, వలస కూలీల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక్క రోజు సత్యగ్రాహ దీక్ష చేపట్టింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో […]
సత్యాగ్రహ దీక్షలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
దిశ, న్యూస్ బ్యూరో :
కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం.. ఆదాయం కంటే ప్రజల ప్రాణాలకే ఎక్కువ విలువనివ్వాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, నల్గగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. రైతులు, వలస కూలీల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక్క రోజు సత్యగ్రాహ దీక్ష చేపట్టింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో దీక్షలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. గన్నీ బ్యాగుల కొరత, అకాల వర్షాలతో తడిసిన ధాన్యం, మార్కెట్లలో ధర తగ్గింపు వంటి కారణాలతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఇప్పటివరకు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెబుతోన్న ప్రభుత్వం.. రైతుల దగ్గరి మొత్తం ధాన్యాన్ని తరుగు, ధాన్యం తడిసిందనే కారణాలు చూపకుండా ఒకే రేటుతో కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని కోరారు.
వలస కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం..
లాక్‌డౌన్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీసీసీ చీఫ్ దుయ్యబట్టారు. వలస కార్మికులను తరలించేందుకు అవసరమైన చార్జీలను తమ పార్టీ భరిస్తుందని స్వయంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించినా.. ఆ మేరకు రవాణా సౌకర్యాలు కల్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. పీఎం, సీఎం సహాయనిధులకు విరివిగా విరాళాలు వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకొని వలస కూలీలకు సరైన వసతులు కల్పించలేకపోయాయని ఆరోపించారు. తెలంగాణలో వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాలి
తెలంగాణలో కొన్ని చోట్ల మద్యం దుకాణాలు తెరుస్తారని ప్రచారం జరుగుతోందని, అలాంటి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. రెవెన్యూ కోసం ప్రజల ప్రాణాలను బలిపెట్టొద్దని, మద్యం దుకాణాలు తెరిస్తే కరోనా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రజలకు ఆర్థిక సహకారమందించేందుకు కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాలని, ఇతరులను ఇరుకున పెట్టేలా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.
కరోనా కేసులపై అనుమానాలొస్తున్నాయ్..
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల పట్ల ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఐసీఎంఆర్ నిర్ధేశకాల మేరకు ప్రైవేటు ల్యాబ్‌లను ఉపయోగించుకోవడం లేదని, వాటిని కూడా కరోనా టెస్టుల కోసం ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా కేసులు, పోస్టుమార్టం విషయాల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం అనుమానాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో జరిగిన దీక్షలో ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ ఎంపీలు హనుమంత రావు, పొన్నం ప్రభాకర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: corona, Lockdown, Congress, Formers, Telangana, kcr, migrant Labour