మంచి పథకాలకు చెడ్డ పేరు.. బోనులో అధికారులు
దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యమ నేతే ముఖ్యమంత్రి అయితే సమస్యలు తీరుతాయని తెలంగాణ సమాజం భావించింది. కానీ, ప్రజా సంక్షేమానికి తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ఉన్నతాధికారుల కారణంగా కోర్టు బోనుకు చేరుతున్నాయి. దేశంలోనే వినూత్న సంక్షేమ పథకాలు ఉనికిలోకి వస్తున్నా అధికారుల వ్యవహార శైలితో సంకట పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎలాంటి పథకాలు అమలు చేయాలి, పాలన ఎలా ఉండాలి అనే కోణంలో సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అభిప్రాయం ఉన్నా, ఐఏఎస్ అధికారుల నుంచి ఆ స్థాయిలో సపోర్ట్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యమ నేతే ముఖ్యమంత్రి అయితే సమస్యలు తీరుతాయని తెలంగాణ సమాజం భావించింది. కానీ, ప్రజా సంక్షేమానికి తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ఉన్నతాధికారుల కారణంగా కోర్టు బోనుకు చేరుతున్నాయి. దేశంలోనే వినూత్న సంక్షేమ పథకాలు ఉనికిలోకి వస్తున్నా అధికారుల వ్యవహార శైలితో సంకట పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎలాంటి పథకాలు అమలు చేయాలి, పాలన ఎలా ఉండాలి అనే కోణంలో సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అభిప్రాయం ఉన్నా, ఐఏఎస్ అధికారుల నుంచి ఆ స్థాయిలో సపోర్ట్ లభించడం లేదు. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి వేగాన్ని అధికారులు అందుకోలేకపోతున్నారు. సీఎం నిర్ణయాలలో లీగల్ చిక్కులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదే అయినా వారు ఆ దిశగా చొరవ తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. ఫలితంగా చాలా అంశాలు కోర్టుల వరకూ వెళ్తున్నాయి. చివరకు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఏనాడూ కోర్టు మెట్లు ఎక్కని ఐఏఎస్ అధికారులు ఇప్పుడు బోనులో నిలబడుతున్నారు.
అనేక పథకాల మీద
ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక స్కీములపై హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. దీంతో ఆయా శాఖలు నిర్ణయాలు తీసుకోడానికే హడలిపోతున్నాయి. కలెక్టర్ల నుంచి మొదలుకుని ఉన్నతాధికారుల వరకూ ఇదే పరిస్థితి. ధరణి, ఎల్ఆర్ఎస్ ఏకంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ప్రతిష్ఠకే చెడ్డపేరు తీసుకొచ్చాయని బహిరంగ చర్చలే జరుగుతున్నాయి. ఓ ఉన్నతాధికారే ఇందుకు కారణమంటూ సచివాలయంలోనే చర్చలు మొదలయ్యాయి. నగరంలో వరద బాధితులకు నగదు సాయం అందించాలన్న ఆలోచన కూడా సదరు ఉన్నతాధికారిదే అని అంటున్నారు. దానిని సక్రమంగా నిర్వహించకపోవడంతో కోర్టు చీవాట్లు తినాల్సి వచ్చిందని ఐఏఎస్ అధికారులే చెబుతున్నారు. ఈ ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు అనేకం కోర్టుకు చేరాయి.
ఆర్టీసీ సమ్మెతో మొదలు
ఆర్టీసీ కార్మికులు గతేడాది చేసిన 53 రోజులు సమ్మెపై హైకోర్టులో చాలా రోజులపాటు వాడీవేడి వాదనలు జరిగాయి. కోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం చేతులెత్తేసింది. కరోనా కట్టడిలోనూ తెలంగాణ ప్రభుత్వానికి అక్షింతలు పడ్డాయి. కరోనా పరీక్షలు, గణాంకాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా పేర్కొనడం, కరోనా మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపడం లాంటి విషయాలలో ప్రభుత్వాన్ని హైకోర్టు తూర్పారబట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. టెస్టులు, మరణాలపై హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేయాల్సివచ్చింది. మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు తప్పనిసరి అంటూ ఆదేశాలు ఇచ్చింది. వాటిని అమలు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేసింది. సీఎస్ సోమేశ్ కుమార్, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారీతిలో చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నా పట్టించుకోకపోవడంపై కోర్టు నుంచే కాక ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఉద్యోగుల వేతనాలు
లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు, పింఛన్లలో కోత విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్సుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు సూచనలతో ఎట్టకేలకు విడతలవారీగా కోత వేతనాలను జమ చేస్తున్నారు. కొత్త సచివాలయ నిర్మాణంపైనా హైకోర్టు నుంచి చీవాట్లు తప్పలేదు. తాము ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎర్రమంజిల్ కోర్టు, సచివాలయ భవనాలు కూల్చొద్దని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం కూల్చివేతకు అనుమతి పొందింది. అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్‌పై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పిటిషన్ దాఖలు చేసింది. భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిపై హైకోర్టులో సుదీర్ఘ విచారణే జరిగింది. ఇంకా తీర్పు వెలువడాల్సి ఉంది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే విధించింది. ఆధార్, కులం వివరాల గురించి ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం వెకేట్ పిటిషన్ దాఖలు చేసింది. సబ్సిడీ పథకాలకు ఆధార్ వివరాలతో ఇబ్బంది లేనప్పుడు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ విషయంలో మాత్రం ఎందుకుంటుందని ప్రభుత్వం వాదించింది. చివరకు ఈనెల 31లోగా కౌంటర్ సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
వరద పీడ
వరద బాధితులకు ప్రభుత్వం రూ. 10 వేల చొప్పున తక్షణ సాయాన్ని ప్రకటించింది. అమలు చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్, నిర్వహణపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఓటరు జాబితా సవరణలు, వార్డుల రిజర్వేషన్లు, బీసీల రొటేషన్ రిజర్వేషన్ వంటి అంశాలు కోర్టుకు చేరాయి. పాత, కొత్త రిజర్వేషన్ల విధానంపై తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వుల మీద కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఓట్ల లెక్కింపులో స్వస్తిక్ గుర్తు వివాదంపై ప్రభుత్వానికి చుక్కెదురైంది.
పరీక్షల మీదా
పీజీ మెడికల్, దంత పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయడం, రహదారులపై మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాలపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం, కరోనా కాలంలో ఇంటర్, డిగ్రీ, పీజీ పరీక్షలను నిర్వహించలేకపోవడం, ఇటీవలి కాలంలో భారీ స్థాయిలో చిన్నపిల్లల, యువతుల, మహిళల మిస్సింగ్ కేసులపై పోలీసులు అలసత్వంతో వ్యవహరించడం, ఒకే రోజున 64 మంది అదృశ్యంకావడం తదితరాలపై కూడా కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మహిళలపై నేరాలు పెరిగిపోతున్నా వారి గురించి పట్టించుకోవాల్సిన మహిళా కమిషన్ లేకపోవడంతో డిసెంబరు 31 కల్లా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాల్సి వచ్చింది. ఇలా ఎన్నో అంశాల్లో ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి, మంత్రులను లీగల్ విషయాల్లో వివరాలను చెప్పడంలో అధికారుల నిర్లక్ష్యం చివరకు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితులను సృష్టించాయి.