అవి ఉత్తుత్తి లెక్కలేనా..?

దిశ, న్యూస్ బ్యూరో: గ్రామాల్లో పనికి రాని బోర్లు, బావులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏటా ఎక్కడోచోట పిల్లల ప్రాణాలు మింగుతూనే ఉన్నాయి. సాగు, తాగునీటి అవసరాల కోసం వేసిన బోర్లల్లో నీళ్లు రాకుంటే వాటిని అలాగే వదిలేస్తున్నారు. కొన్నిచోట్ల తాగునీటి సరఫరా కోసం గ్రామ పంచాయతీలు వేస్తున్న బోర్లను కూడా ఇదేవిధంగా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఫలితంగా చిన్నారులకు మృత్యుదారులు అవుతున్నాయి. ఆడుకుంటూ వెళ్లి బోర్లలో పడి బలవుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్సన్‌పల్లిలో జరిగిన […]

Update: 2020-05-29 23:36 GMT

దిశ, న్యూస్ బ్యూరో: గ్రామాల్లో పనికి రాని బోర్లు, బావులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏటా ఎక్కడోచోట పిల్లల ప్రాణాలు మింగుతూనే ఉన్నాయి. సాగు, తాగునీటి అవసరాల కోసం వేసిన బోర్లల్లో నీళ్లు రాకుంటే వాటిని అలాగే వదిలేస్తున్నారు. కొన్నిచోట్ల తాగునీటి సరఫరా కోసం గ్రామ పంచాయతీలు వేస్తున్న బోర్లను కూడా ఇదేవిధంగా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఫలితంగా చిన్నారులకు మృత్యుదారులు అవుతున్నాయి. ఆడుకుంటూ వెళ్లి బోర్లలో పడి బలవుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్సన్‌పల్లిలో జరిగిన బోరు ఘటనతో గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి లెక్కలపై ప్రభుత్వం ఆగ్రహించింది. పనికి రాని బోర్లు, బావులను మూసి వేసినట్లుగా భారీ లెక్కలు చూపించినా ఇంకా వేల సంఖ్యలో ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. మొత్తం వీటి లెక్కలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈసారి నిర్వహించే పల్లె ప్రగతి ప్రణాళికలో బోర్లు, బావులను మూసివేయడాన్ని ప్రధాన అంశంగా పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఆశించిన ఫలితాలు రాలేదు..

పల్లె ప్రగతిలో ఉత్తుత్తి లెక్కలు చూపించారని, గ్రామాల్లో పనికిరాని బోరు, బావులు ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది. దీనిపై ప్రభుత్వం కూడా మూడోసారి నిర్వహించే పల్లె ప్రగతిలో ప్రధాన అంశంగా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న బోరు, బావులు, వాటిపై తీసుకునే చర్యలు, వెచ్చించాల్సిన నిధులపై వివరాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రెండు విడతల్లో ప్రభుత్వం పల్లె ప్రగతి ప్రణాళికను నిర్వహించి మూడో విడతకు సన్నద్ధమవుతోంది. పంచాయతీలకు ప్రతినెలా నిధులు విడుదల చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రాలేదనే అభిప్రాయాలున్నాయి. రాష్ట్రంలో రెండు విడతల పల్లె ప్రగతిలో మొత్తం 22,167 బావులు పనికిరానివి, ప్రమాదకరమైనవి ఉన్నట్లు గుర్తించగా 16,380 బావులను మూసివేసినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. వీటితో పాటు 11,065 నిరూపయోగమైన బోర్లు ఉండగా, 9,888 బోర్లను మూసివేశామని, మిగతా వాటి యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ బోర్ల దగ్గర రక్షణ చర్యలు చేపట్టామని నివేదికల్లో వివరించారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పనికి రాని బోర్లు నోరు తెరుచుకునే ఉంటున్నాయి. రక్షణ చర్యలు తీసుకున్నట్లు పంచాయతీలు చెప్పినా అవి తాత్కాలికంగానే మిగులుతున్నాయి. వ్యవసాయ భూములు, ఇండ్ల పరిసరాల్లో ఉన్న బోర్ల దగ్గర పరిస్థితులు మరీ ప్రమాదకరంగా మారాయి. ఎలాంటి రక్షణా చర్యలు లేకుండా వదిలేశారు.

గుర్తించడంలో నిర్లక్ష్యం!

పనికి రాని బోర్లను గుర్తించడంలో కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోన్నది. ఇలాంటి బోర్లను గుర్తించేందుకు రంగారెడ్డి జిల్లాలో గతంలో వినూత్న ప్రయోగం చేశారు. మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి దీనిపై ప్రత్యేకమైన యాప్‌ను తయారు చేయించారు. పనికి రాని బోర్లు, బావులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి, వాటిని మూసివేసేందుకు ఈ యాప్‌ను తీసుకొచ్చారు. మొదట్లో యాప్ కు స్పందన వచ్చినా తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్‌ను అమల్లోకి తీసుకొచ్చి రక్షణా చర్యలు తీసుకోవాలని భావించినప్పటికీ ఆచరణలోకి తీసుకురాలేదు. మెదక్ జిల్లా ఘటనతో పంచాయతీ రాజ్ పనితీరు బట్టబయలైంది.

Tags:    

Similar News