తరలిస్తామన్నారు.. నరికేశారు
దిశ, తెలంగాణ బ్యూరో: పచ్చదనాన్ని పెంపొందించే దిశగా హరితహారం పేరుతో ప్రతి ఏటా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతున్నట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తూ ఉంటుంది. కానీ ఏళ్ళ తరబడి ఏపుగా పెరిగిన చెట్లకు మాత్రం దిక్కు లేకుండా పోయింది. అభివృద్ధి పేరుతో చెట్లను నరికేస్తున్నారు అధికారులు. నగరం నడిబొడ్డున సచివాలయం దగ్గర ఏపుగా పెరిగిన చెట్లు వేర్లతో సహా నేల కూలాయి. సచివాలయం నిర్మాణం కోసం కొన్ని చెట్లను తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్న రాష్ట్ర పర్యావరణ శాఖ […]
దిశ, తెలంగాణ బ్యూరో: పచ్చదనాన్ని పెంపొందించే దిశగా హరితహారం పేరుతో ప్రతి ఏటా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతున్నట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తూ ఉంటుంది. కానీ ఏళ్ళ తరబడి ఏపుగా పెరిగిన చెట్లకు మాత్రం దిక్కు లేకుండా పోయింది. అభివృద్ధి పేరుతో చెట్లను నరికేస్తున్నారు అధికారులు. నగరం నడిబొడ్డున సచివాలయం దగ్గర ఏపుగా పెరిగిన చెట్లు వేర్లతో సహా నేల కూలాయి. సచివాలయం నిర్మాణం కోసం కొన్ని చెట్లను తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్న రాష్ట్ర పర్యావరణ శాఖ వీటిని ఎక్కడ నాటిందో తెలియదుగానీ రోడ్డు పక్కనే చెట్లు వేర్లతో సహా నరికిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
సచివాలయ ప్రాంగణంలో ఉన్న చెట్లను అధునాతన పరిజ్ఞానంతో తొలగించి మరో చోట ‘ట్రాన్స్‌లొకేషన్’ చేస్తామని రోడ్లు భవనాల శాఖ తన పర్యావరణ నిర్వహణ నివేదికలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు హామీ ఇచ్చింది. కానీ కొత్త సచివాలయం నిర్మాణంలో భాగంగా కొన్ని చెట్లను నరికేసింది. సచివాలయ భవన సముదాయాల ప్రాంగణంలో వివిధ జాతులకు చెందిన 607 చెట్లు ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో అనివార్యంగా 27 చెట్లను తొలగించక తప్పదని పేర్కొని వాటిని వేరే చోట నాటనున్నట్లు తెలిపింది. కానీ దీనికి భిన్నంగా భారీ వృక్షాన్ని వేర్లతో సహా పెకిలించి ముక్కలుగా కోసి రోడ్డు పక్కనే పడేశారు. దీనిని చూసిన ప్రకృతి ప్రేమికులు చెట్లను పెంచమంటున్న ప్రభుత్వమే ఇలా చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయ పరిసర ప్రాంతమైన ఎన్టీఆర్ గార్డెన్ వెలుపల కూడా చెట్ల నరికివేత చోటుచేసుకుంది. ఒకవైపు అర్బన్ ఫారెస్ట్రీ పేరుతో పార్కులను నెలకొల్పుతూనే మరోవైపు ఏపుగా పెరిగిన చెట్లను కూకటి వేర్లతో సహా పెకిలిస్తున్నారు. నూతన సచివాలయ నిర్మాణ ప్రాంతం ఒక నిషిద్ధ ప్రాంతంగా మారిపోయింది. అక్కడ ఏపుగా పెరిగి ఉన్న చెట్లలో ఎన్నింటిని తొలగించారు, వాటిని తిరిగి ఎక్కడ ‘ట్రాన్స్‌లొకేట్’ చేశారనే వివరాలేవీ బైటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. పర్యావరణ అనుమతులు తీసుకునే సమయంలో లెక్కలతో సహా వివరించిన అధికారులు ఇప్పుడు ఆ వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. కానీ రోడ్డు పక్కన మాత్రం భారీ వృక్షాలను నేలకూల్చిన వాస్తవం కళ్ళముందు కనిపిస్తోంది.